కాంగ్రెస్‌లో కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీ : టీ పీసీసీ చీఫ్

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు. 

మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు. 

శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
 

ఇండియన్స్.. ఇరాన్ నుంచి వచ్చేయండి.. కేంద్రం ప్రకటన

ఇరాన్ లో నివసిస్తున్న ఇండియన్స్ అందరూ వెంటనే వెనక్కు వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఇరాన్ లో భారతీయులు ఎవరూ ఉండొద్దు, వెంటనే వెనక్కు వచ్చేయాలనీ, అక్కడ ఉన్న ఇండయన్స్ ను వెనక్కు తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నామనీ పేర్కొంది.   ఇరాన్‌  ముస్లిం దేశమే అయినప్పటికీ,  సాంకేతిక‌త‌, వైద్య విద్య  తదితర అంశాలలో ముందంజలో ఉండటంతో భారత్ నుంచి అనేక మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించేందుకు వెడుతుంటారు. ఇక నిర్మాణ రంగంలో పని చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఇరాన్ వెడతారు.  కానీ ఇటీవ‌ల కాలంలో ఇరాన్  కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది.  దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా  ఉండటంతో  ఇరాన్   ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి. ల‌క్ష‌లాది  రోడ్ల‌పైకి వ‌చ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను విధ్వంసానికి దారి తీస్తున్నాయి. దీంతో నిరసనకారులపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇరాన్ నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ  12 వేల మందికి పైగా నిర‌స‌న కాల్పుల్లో హతమయ్యారు ఇక అమెరికా రంగంలోకి దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించింది. తద్వారా దేశంలో హింసను రెచ్చగొట్టేలా ప్రకటనలు గుప్పిస్తోంది. నిరసనలు కొనసాగించాలనీ, నిరసనకారులకు పూర్తి సహకారం అందిస్తామనీ, భద్రత కల్పిస్తామని అగ్రదేశాధినేత ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో, ఆ దేశంలో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ వెంటనే  స్వదేశానికి వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చింది. ప్ర‌త్యేక విమానాల ఏర్పాటు షెడ్యూల్ ను నేడో, రేపో ప్రకటించనుంది. 

జగ్నన్న తోట ప్రభల తీర్థం.. ప్రత్యేకతలు.. విశిష్టతలు!

దేశమంతా జరుపుకునే పండుగ సంక్రాంతి .. ప్రాంతాన్ని బట్టి పండుగ ఒక్కో విధంగా జరుపుకుంటారు.  ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు సంక్రాంతి పండుగను తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్రాంతి పండుగ తరువాత వచ్చే కనుమ పండుగ కోససీమ వాసులకు ఒక అద్భుత ప్రత్యేక తీర్థాన్ని తీసుకువస్తుంది. కొబ్బరాకుల పందిరి వేసినట్లుండే కోనసీమలో కనుమ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది.   ఈ జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.  అసలింతకీ ఈ జగ్గన్న తోట తీర్ధం ప్రత్యేకతలు, విశిష్ఠతలు ఏంటంటే..  కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుంచి జనం ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన ఏ చిహ్నాలూ కనిపించవు.   భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. శివుని వాహనంగా భావించే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని కొలుస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలతో ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో  తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్య గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలను జనం మోస్తారు. అలా మోయడం ఈశ్వర  సేవగా భక్తులు భావిస్తారు.  నాలుగు శతాబ్దాలుగా  ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోందంటారు.  ఈ ప్రభల తీర్థానికొక  గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ ఒక కారణం ఉందంటారు.   మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే  వ్యక్తి ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించిన స్థానికులు అప్పటి నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారట. దీంతో  వాళ్ళు ఈయన్నిఅడ్డుకుని నిజాం నావాబు వద్దకు తీసుకెళ్లారట. ఆ సందర్భంగా ఈ జగ్గన్న   పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే జగ్గన్న ఈ ప్రభల తీర్థం జరిపాడని అంటారు.  దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ ఉండదనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పేందుకే  ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు. ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొ విశేషం  కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీక  లోతు కౌశిక ప్రవాహాన్ని దాటుకుంటూ, పొలాల మధ్య నుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒకసారి ఎత్తిన తరువాత  ఈ ప్రభలను  కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీటి చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు.   గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలను ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు.  తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువు ఉంటాయి. అయినా వాటిని అవలీలగా దాటించగలగడం మాత్రం ఈశ్వరానుగ్రహం వల్లనేనని చెబుతారు వాటిని మోసే వాళ్లు.  మొత్తంగా శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జగ్గనతోట ప్రభల తీర్ధం వైభవం ఎంత చెప్పినా తక్కువే. 

నిఘా సంస్థల డైరెక్టర్ జనరల్‌‌లను మార్చిన కేంద్రం

  జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఐఏ  కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్‌ఐఏ డైరెకర్ట్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ను నియమించింది. ఆయన ఈ పదవిలో 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనున్నారు. హిమాచల్‌ క్యాడర్‌కు చెందిన అగర్వాల్‌ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఎన్‌ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశం ఈ నియామకాన్ని ఆమోదించింది. ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపింది. దీంతో ఎన్ఐఏ డీజీగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎన్ఐఏతోపాటు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్‌ జనరళ్లనూ కేంద్రం నియమించింది. సీనియర్‌ ఐపీఎస్‌ శతృజీత్‌ సింగ్‌ కపూర్‌ను కేంద్రం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను బీఎస్‌ఎఫ్‌ కొత్త చీఫ్‌గా నియమించింది.

జన నాయగన్ రిలీజ్ వాయిదా.. విజయ్‌కు చేదు అనుభవం

  దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతను నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేయమంటూ నిర్మాతలు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టగా, అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.  దాంతో పిటీషనర్ తరఫు న్యాయవాది రోహత్గి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, వీలైనంత త్వరగా తీర్పు ఇచ్చేలా చూడమని న్యాయమూర్తులకు విన్నవించుకున్నారు. రోహత్గి అభ్యర్థన మేరకు ఈ కేసును మద్రాసు హైకోర్టు లోనే తేల్చుకోమని, అయితే ఈ నెల 20లోగా తీర్పును వెలువర్చమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషి పేర్కొన్నారు. మద్రాస్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ప్రతికూల తీర్పుపై సి.బి.ఎఫ్.సి. ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళింది. కేసును ప్రాధమికంగా విచారించిన న్యాయమూర్తులు సినిమా విడుదల అనుమతిపై స్టే విధించి, కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు. దాంతో 'జన నాయగన్' నిర్మాత సుప్రీమ్ కోర్టు కు వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరారు.  కానీ అక్కడ కూడా వారికి చుక్కెదురై తిరిగి ఈ వ్యవహారం చెన్నయ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టులో పడినట్టు అయ్యింది. ఈ లోగా రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. వాటిని నిర్మాతలు అంగీకరిస్తే, సినిమా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కోర్టు కూడా సుప్రీమ్ కోర్టు సూచనలను అనుసరించి, 20వ తేదీకి తుది తీర్పు ఇచ్చినా... ఈ నెల 23వ తేదీ లేదా 30న 'జన నాయగన్' జనం ముందుకు రావచ్చు.  

ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్‌

  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత నెలల్లో పార్టీ ఫిరాయింపుకు సరైన ఆధారాలు లేవని ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్ తమ అనర్హతపై ఇంక సభాపతికి వివరణ ఇచ్చుకోలేదు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి..  10మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. ప్రతీ నెలా బీఆర్ఎస్‌ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. సీఎం రేవంత్‌ను కలిశామని వారు తెలిపారు  

కడపను తాకిన కోస్తా కోడి కత్తి...కొక్కరోకో అంటున్న కోడిపందాలు

  కోడిపందేలు అంటే కోస్తా గుర్తుకొస్తుంది. పందెం రాయుళ్ళు తెలుగు రాష్ట్రాలనుంచి అక్కడికి చేరుకొని సంక్రాంతి కోడిపందేలతో జోష్ మీద ఉంటారు...ఈ సారి కోస్తా కోడి కత్తి కడపకు చేరింది. భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి. లక్షలకు లక్షల పందేలు తో సంక్రాంతి రోజున కోళ్ళ పందేలు జోరుగా జరిగాయి. కోడిపందేలు ఆడకుండా చర్యులు తీసుకోవాలని కోర్టులు చెప్పినా , కోడిపందాలు ఉండకూడదన్న నిభంధనలున్నా  పలుచోట్ల మాత్రం కోడి కత్తులు ఆడాయి.ఈ ప్రాంతంలో  సుశిక్షితులైన పందె ఆర్గనైజర్ లు లేక పోవడంతో కొందరు కోస్తా నుంచి ఆర్గనైజర్ లను రప్పించి నట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడిపందాలు ఆడించడం ,పందెం రాయుళ్లు, వాటి తిలకించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది *నేతలే అండగా ! ఉమ్మడి కడప జిల్లాలో యధేచ్చగా కోడి పందేలు సాగాయి. అధికార నేతల  అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహించారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో, పులివెందులలో కోడిపందాలు టిడిపి నేతలే ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.పులివెందుల నియోజక వర్గంలో వేంపల్లి, లింగాల మండలాల్లో కోడిపుంజులు కాలు దువ్వాయి.  లింగాల మండలం దొండ్ల వాగులో భీమవరం నుంచి ఆర్గనైజర్లతో కోడి పందేలు ఆడించినట్లు సమాచారం. కొన్ని చోట్ల కోడి పందేలతో పాటు ఇతర ఆటలు ఆడించినట్లు గా తెలుస్తోంది.వేముల మండలం భూమయ పల్లె, పార్నపల్లి ,అలవలపాడు, పాములూరు, ఎర్రబెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరిగాయి.రాజంపేట అత్తిరాల అమగంపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు జరిగినట్లు సమాచారం. *ఆటగాళ్ళు కు సదుపాయాలు. ఆటగాళ్లకు సకల సదుపాయాలు కల్పించారు. ఒక్కో ఆట రెండు నుంచి ఐదు లక్షలు పలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి కదిరి తదితర  ప్రాంతాల నుంచి పులివెందుల, రాజంపేట లకు పందెంకాసేవారు, జూదరులు రావడం జరిగింది..సంక్రాంతి ఆటవిడుపు గా అని చెబుతున్న నేతలు పండుగ సంబరాల మాటున కోస్తాకు దీటుగా భారీ మొత్తంలో  కోడి పందేలు నిర్వహించడం కడప జిల్లాలో సంక్రాంతి కోస్తా కోడి పందేలను తలిపించింది. *పోలీసు ఆంక్షలను లెక్క పెట్టకుండా పోలీసు ఆంక్షలను లెక్క చేయని పందెం రాయుళ్లు యదేచ్చగా ఆటసాగించారు. కొన్ని చోట్ల కోళ్ల పందేలు ప్రత్యేక వీడియో షూట్ చేసి మరీ ఆడించడం జరిగింది. *పోలీసుల దాడులు  కోస్తా బరుల కు తీసిపోని రీతిలో కోడి పందేలు జరగడంతో వీటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొండాపురం మండలం ఓబన్న పేట గ్రామ పొలాల్లో కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్టు చేశారు. టీ.కోడూరు కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురు అరెస్టు చేశారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో కోడిపందాలు జరగడం గమనార్హం.

మున్సిపల్‌ ఎన్నికల్లో వివాదం...సిరాకు బదులు మార్కర్ పెన్నులు!

  మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టేందుకు సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని బృహన్ముంబయి మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా అంగీకరించారని విపక్షాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు  ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకైనా పాల్పడేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు.  వ్యవస్ధను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికి ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.అయితే, ఈ ఆరోపణలను బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఖండించింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది

స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికలు సుసైడ్

  కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు మైనర్ ట్రైనీ బాలికలు (17, 15 ఏళ్లు) ఇవాళ ఉదయం తమ గదిలో ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోజికోడ్‌, తిరువనంతపురానికి చెందిన వీరు ఒకరు అథ్లెటిక్స్, మరొకరు కబడ్డీ క్రీడాకారిణి.  మార్నింగ్ ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది. ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదేపదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు తలుపు పగలగొట్టి చూశారు. గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పదో తరగతి చదువుతోంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజ్‌కోట్‌లో రికార్డు సృష్టించిన యువ బ్యాటర్ రాహుల్

  అంతర్జాతీయ క్రికెట్లో భారత్ యువ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్(112*) సెంచరీతో అజేయంగా నిలిచాడు. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.  దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో శతక్కొట్టి.. అరుదైన ఘనతను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56), కేఎల్ రాహుల్(112*) అజేయ శతకంతో చెలరేగి ఆడారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చారు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ ఆఖరి వరకు పోరాడాడు. దీంతో భారత జట్టు ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.  ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 96 వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రాహుల్‌కి ఇది వన్డేల్లో 8వ సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు కూడా ఇతడిదే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ దీన్ని అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు

నారావారిపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ కులదైవం నాగాలమ్మకు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తండ్రి ఖర్జూరనాయుడు, తమ్ముడు రామ్మూర్తి సమాధుల వద్ద నివాళులు అర్పించారు.అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. వారిరి స్మరించుకున్నారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేశారు.  పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, నారా రోహిత్, నందమూరి రామకృష్ణ, ఎంపీ భరత్  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.