నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు కష్టకాలమే
posted on Oct 18, 2012 @ 9:46AM
వచ్చే నెల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తామని పది నెలల నుంచి నెట్టుకొస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధాని సాయంతో ఈ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉందన్న విషయాన్ని జీవవైవిధ్య సదస్సు కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా సిఎంకు చెప్పారు. దీంతో వేడి మీద ఉండగానే పనులు చక్కబెట్టుకోవాలన్న సామెత చందంగా సిఎం హుటాహుటిన ఢల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీతోనూ, ఇతర నాయకులతోనూ ఈ నామినేటెడ్ పదవులపై చర్చిస్తారు. ప్రత్యేకించి ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల అవసరం తెలియజేసేందుకు సిఎం స్వయంగా రూపొందించుకున్న ఒక డిజైన్‌ను కూడా కాంగ్రెస్ అధిష్టానంకు చూపనున్నారు. ఈ డిజైన్ ఆధారంగా వివరణ ఇస్తే అధిష్టానం ఖచ్చితంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తుందని సిఎం భావిస్తున్నారు. అందుకే ఆయన ఇంకా తెలివిగా ఓ కొత్త ఎత్తుగడ కూడా వేశారు. కేంద్ర మంత్రుల గురించి తనతో చర్చించేటప్పుడు రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తే వారి ద్వారా కూడా నామినేటెడ్ పదవుల అవసరాన్ని చెప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇకనైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోతే నాయకలను, కార్యకర్తలను కట్టడి చేయడం కష్టమని ఆయన అధిష్టానానికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సిఎం ఆశిస్తున్నారు. ఏమైనా ఢల్లీలో ఈ నామినేటెడ్ పోస్టులపై ఒక ఖచ్చితమైన హామీ పొందాలని సిఎం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.