చిరు, బాబుల పలకరింపులు
posted on Mar 30, 2011 @ 10:23AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మంగళవారం శాసనసభ ఇన్నర్ లాబీల్లో ఎదురు పడ్డారు. పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగానే వారిద్దరు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న విషయాలను పరస్పరం పంచుకున్నారు. చిరంజీవి కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే కూటమి పక్షాన ఏప్రిల్ అయిదు నుంచి అక్కడ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయనున్నారు. తాను కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న విషయాన్ని చంద్రబాబు చిరంజీవికి చెప్పారు. అక్కడే ఉన్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి స్పందిస్తూ - అలాగైతే మంచి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుని సీపీఎం కోసం ప్రచారం చేయండన్నారు. తాను తృణమూల్ కాంగ్రెస్ మంచి పార్టీగా భావిస్తున్నానని, ఆ పార్టీకి ప్రచారం చేస్తానని చిరు వ్యాఖ్యానించారు. ఈ విషయాల్ని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చిరంజీవే మీడియాకు వివరించారు.