నిబంధనలు లేవు
posted on Mar 30, 2011 @ 10:32AM
హైదరాబాద్: నియమ నిబంధలను రూపొందించుకోకపోవడం వల్ల, శాస్త్రీయంగా చూడకపోవడం వల్ల భూకేటాయింపుల్లో హేతుబద్దత లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. భూకేటాయింపులపై దుమ్మెత్తిపోసుకోవడం, రాజకీయ లబ్ధి పోసుకోవడం కాకుండా భూకేటాయింపులకు అనుసరించాల్సిన నియమనిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భూ కేటాయింపులపై శాసనసభలో మంగళవారం చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఓ సాంఘిక వసతి గృహం నిర్మించడానికి హైదరాబాదులో భూమి దొరకలేదని, అప్పుడు చాలా బాధేసిందని ఆయన అన్నారు. భూముల కేటాయింపుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం గానీ తమ ప్రభుత్వం గానీ హేతబద్దతను పాటించలేదని, ఏ పరిశ్రమకు ఎంత భూమి కేటాయించాలనే నిబంధనలను రూపొందించుకోలేదని ఆయన అన్నారు. ఓ విండ్ పవర్ మిల్లుకు 13 ఎకరాలు కేటాయించిన సందర్భాలున్నాయని, తీరా చూస్తే విండ్ పవర్ మిల్లుకు మూడు నుంచి మూడున్నర ఎకరాలు సరిపోతుందని ఆయన అన్నారు.