తొలిరోజు 8.5 కి.మీ. పాదయాత్ర చేసిన బాబు
posted on Oct 3, 2012 @ 10:00AM
హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు అడుగడుగునా జన నీరాజనం మధ్య సాయంత్రం ఐదు గంటలకు హిందూపురం చేరుకున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, జాతీయ నాయకుల విగ్రహాలను ఆవిష్కరించి, రాత్రి 7.07 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి రోజే విమర్శకులకు దీటైన జవాబు ఇచ్చారు. "ముఖ్యమంత్రి పదవి కోసం నేను ఈ యాత్రకు రాలేదు. అది నాకు కొత్త కాదు. దానిని నేను ఇప్పటికే తొమ్మిదేళ్ల పాటు చేశాను. పదవీ కాంక్షతో, అధికారం కోసం నేను మీ దగ్గరకు రాలేదు. రాజకీయ ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దోపిడీలను ప్రజలకు వివరించడానికే వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీపై ప్రజలను చైతన్యపరచడానికే వచ్చాను'' అని వివరించారు.
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మంగళవారం రాత్రి 7.07 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేద పండితులు బాబును ఆశీర్వదించారు. అక్కడినుంచి పొట్టి శ్రీ రాములు సర్కిల్ మీదుగా 7.48 గంటలకు జామియా మసీదుకు చేరుకున్నారు. అక్కడ ప్రార్థనలు జరిపి ముతవలీ ఆశీస్సులు పొందారు. గాంధీసర్కిల్ మీదుగా రాత్రి 8.50 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రసంగించారు. రాత్రి 9.52 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్ మీదుగా ప్రఖ్యాత సీఅండ్ఐజీ మిషన్ చర్చికి చేరుకున్నారు. చర్చిలో ప్రార్థనలు జరిపి ఫాదర్ల ఆశీర్వాదం పొందారు. అనంతరం మేళాపురం క్రాస్‌లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి చేనేత కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీఎంటీ లే అవుట్‌లో భోజనం చేసి బసచేశారు. పాదయాత్ర తొలిరోజు చంద్రబాబు 8.5 కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం ఉల్లాసంగా కనిపించారు.