'కేజీఎఫ్' బాబు.. పాత సామాన్లతో 1,740 కోట్లు.. ఎమ్మెల్సీ బ‌రిలో..

'కేజీఎఫ్'.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాఖీ భాయ్ స్టామినాను చాటిన మూవీ. అది జ‌స్ట్ సినిమా మాత్ర‌మే. మూవీకి మించిన స్టోరీ ఉంది కేజీఎఫ్‌..కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి. బంగారు గ‌నుల త‌వ్వ‌కం ఆ కంపెనీకి పెద్ద‌గా లాభాలేమీ తెచ్చిపెట్ట‌లేదు. కొన్నేళ్లు మైనింగ్ చేసి.. త‌వ్వుకున్న కాడికి బంగారం త‌వ్వేసుకొని.. ఇక ఉప‌యోగం లేద‌ని.. కేజీఎఫ్‌ను మూసేశారు. ఇక‌, మైనింగ్ కోసం తెచ్చిన మిష‌న‌రీ, ప‌రిక‌రాలు, వ‌స్తువులు అన్నిటినీ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి అమ్మేశారు. ఇక్క‌డే మ‌రో ఇంట్రెస్టింగ్ స్టోరీ మొద‌లైంది. క‌ట్‌చేస్తే.. ఆ పాత ఇనుప సామాన్ల వ్యాపారి.. ఇప్పుడు కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా బ‌రిలో నిలిచారు. 1,740కోట్ల సంప‌ద‌తో సంప‌న్న రాజ‌కీయ నేత‌గా నిలిచారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.. కేజీఎఫ్‌-3 పొలిటిక‌ల్‌ స్టోరీ ఏంటంటే....

యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు. కర్ణాట‌క‌లో ఈ పేరు తెలీని వారు ఉండ‌దు. తాజాగా, క‌ర్ణాట‌క శాస‌న మండ‌లికి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తూ మ‌రోసారి బ్రేకింగ్ న్యూస్‌గా మారారు. నామినేషన్‌ పత్రాల్లో.. తన ద‌గ్గ‌ర‌ రూ.1,643 కోట్ల స్థిరాస్తి, రూ.97 కోట్ల చరాస్తి.. మొత్తం 1,740కోట్ల సంప‌ద‌ ఉందని ఆయ‌నే వెల్లడించారు. 23 బ్యాంకు ఖాతాలతో పాటు... 2.99 కోట్ల విలువైన 3 కార్లు... రూ.1.11 కోట్ల ఖ‌రీదైన‌ చేతి గడియారం... 4.5 కిలోల బంగారం... మూడు చోట్ల 48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు... 1593 కోట్ల విలువైన 26 స్థలాలు... 3 కోట్ల విలువైన ఇల్లు... 58 కోట్ల అప్పులు... ఇదీ లెక్క‌. ఇక కేజీఎఫ్ బాబుకు ఇద్దరు భార్యలు.   

యూసుఫ్‌ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కేంద్రంగా చాలాకాలం పాత సామాను వ్యాపారం చేశారు. అంత‌కు ముందు జ‌స్ట్ పాత సామాన్లోడు. ఆ త‌ర్వాత 'కేజీఎఫ్ బాబు'గా మారిపోయారు. కేజీఎఫ్‌లో పాత ట్యాంకులు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. ఇది అతనికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత తన నివాసాన్ని బెంగళూరుకు మార్చి.. వ్యాపారాన్ని విస్తరించి, రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో అడుగుపెట్టారు. మ‌రింత సంప‌న్నుడు అయ్యారు. ఇప్పుడు వేల కోట్ల ఆస్థితో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచారు.

నామినేష‌న్ ప‌త్రాల్లో దాఖ‌లు చేసిన ఆయ‌న ఆస్తులు చూసి.. క‌న్న‌డిగులకు క‌ళ్లు తిరుగుతున్నాయి. వామ్మో.. కేజీఎఫ్ నుంచి పాత సామాన్లు అమ్ముకొని ఇంత సంపాదించారా? అంటూ జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. సినిమా అయినా, బిజినెస్ అయినా.. కేజీఎఫ్ఫా.. మ‌జాకా...
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu