'షో'కు'' ‘కారు’ రెడీ?
posted on Nov 1, 2012 8:06AM
ప్రదర్శనకు కారు సిద్ధమైంది? అదేనండీ బాబూ! తెరాస(టిఆర్‌ఎస్) ఎన్నికల సింబల్ కారే కదా! అది ఇప్పుడు కొత్తగా బలప్రదర్శన చేయాలని నిశ్చయించుకుంది. తెలంగాణాలో ఉన్న నేతలందరినీ తన కారులోనే ఎక్కించేసుకోవాలని కేసిఆర్ ముచ్చటపడుతున్నారు. ఆయనకు తెలంగాణామార్చ్ తరువాత నేతలందరూ కలిసి ఉంటే తెలంగాణా వచ్చేసినట్లుంటుందనిపిస్తోందంట. అందుకే చిన్ననేతనైనా కలవటానికి కేసిఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇకపెద్దనేతనైతే తన లాబీయింగ్ కళంతా ప్రదర్శించి లొంగదీసుకుంటారన్న మాట. అందుకే నిన్నటికి నిన్న పరిగి తెలుగుదేశం ఎమ్మెల్యే కె.హరీశ్వరరెడ్డిని లైనులో పెట్టారు. తాజాగా ఏమో తెలుగుదేశం నేత నాగం జనార్దనరెడ్డిని, వేణుగోపాలరెడ్డిని కూడా వశపరుచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారట. కేసిఆర్ తనకున్న వశీకరణ శక్తులతో తెలంగాణాలో ఇంకో పార్టీ మిగల్చకుండా కలిపేసుకోవాలని ఆత్రుత పడుతున్నారు. ఎందుకంటే ఇంకో పార్టీ ఉంటే ఎన్నికలు లేకపోతే ఏకగ్రీవమే కదా! అందుకని అన్ని పార్టీల నేతలను కలిసి తనతో పాటు ఉద్యమించాలని కోరుతున్నారట. ఏమైనా టిఆర్‌ఎస్ కోరినట్లు చేసేందుకు ఈ చేతులు కలిపిన నేతలందరూ సిద్ధమయ్యారు. ఇంకా మరింత మందిని తమ నేత కలుస్తాడని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. వైకాపా తమపై ఏ ప్రభావం చూపలేదంటూ పరకాల ఎన్నికల్లో చెమటలు తుడుచుకున్న కారు నేతలందరూ జగన్ బాటలో నేతలను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారన్న మాట.