తెలంగాణాకు కట్టుబడని బిజెపి? అధికారం కోసమేనా అప్పుడు లొంగింది?
posted on Nov 1, 2012 8:04AM
దేశంలోనే ప్రత్యేక తెలంగాణా డిమాండును ఆదరించిన పార్టీ బిజెపి. ఇది అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకమునుపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయ సమావేశాలను నిర్వహించుకుంది. ఆ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణా ఇస్తామని ప్రకటించుకుంది. అనంతరం అధికారంలోకి ఎన్‌డిఎ కూటమి వచ్చింది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. ఆ పార్టీ మద్దతు వల్లే కేంద్రంలో అధికారం అనుభవించిన బిజెపి ఆ తరువాత ఎన్నికల్లోనే ఓటమి పాలైంది. జాతీయస్థాయి పార్టీ కాస్తా ప్రాంతీయపార్టీలతో పోటీపడే స్థాయికి చేరింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ నేత లాల్‌కృష్ణ అద్వానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి ఉంటే తెలంగాణా ఇచ్చేసి ఉండేవారమంటున్నారు. అప్పట్లో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవసరమైతే తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కానీ, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రానికి మద్దతు ఇవ్వబోమని నిర్ణయాన్ని వెల్లడిరచింది. తాజాగా పెరిగిన ఒత్తిడులకు తెలుగుదేశం పార్టీ కొంత లొంగినమాట నిజమే. కానీ, ఇప్పటికీ సమైక్యతాభావనలను ఆ పార్టీ ప్రతిబింబింపజేస్తోంది. అందువల్ల అప్పట్లో అధికారం కోసం బిజెపి తమ తీర్మానాన్ని గాలికి వదిలేసింది. ఎక్కడ తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటుందోనని అసలు ఆ రాష్ట్ర ప్రతిపాదనే పెట్టలేదు. అధికార కాలం ముగిశాక మళ్లీ నెపం మాత్రం తెలుగుదేశం పార్టీపైకి నెడుతోంది.