ఇక అంధకారంలో ఐదు జిల్లాల ప్రభుత్వకార్యాలయాలు?
posted on Nov 1, 2012 8:08AM
ఇపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అంధకారంలో మగ్గనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోని కార్యాలయాల కరెంటుబిల్లులు చెల్లించకపోవటంతో ఇపిడిసిఎల్ విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. ఒక్క విశాఖ జిల్లాలోని మొత్తం 27 ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.162కోట్లు అని లెక్క తేలటంతో ఇపిడిసిఎల్ పైనిర్ణయం అమలు చేస్తోంది. ప్రతీనెల బిల్లులు వసూలు చేస్తేనే కానీ, తమ సంస్థ నష్టాల్లో ఉందో? లాభాల్లో ఉందో తెలియని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు బిల్లు చెల్లించకపోవటం సంస్థపై భారంగా ఉందని ఇపిడిసిఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆల్‌రెడీ ఈ మేరకు చర్యలు తీసుకున్నామని వారు చెబుతున్నారు. ఈ కారణంగా విశాఖ జిల్లాలోని విద్యాశాఖలో విద్యుత్తుసరఫరా నిలిచిపోవటంతో అధికారులు ఛార్జింగ్‌లైట్లు తెచ్చుకుని విధులు నిర్వహిస్తున్నారు. అలానే మేజర్, మైనర్ పంచాయతీలు కూడా విద్యుత్తు బకాయిలు చెల్లించటం లేదు. మేజర్ పంచాయతీల నుంచి రూ.43కోట్లు, వైద్యఆరోగ్యశాఖ రూ.7.50కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కింద రూ.6.63కోట్లు, మున్సిపాల్టీలు రూ.3.15కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్లు రూ.1.63కోట్లు, హోంశాఖ రూ.1.37కోట్లు బకాయి ఉన్నట్లు ఇపిడిసిఎల్ వివరించింది.