తెలంగాణ ఆర్టీసీలో మార్పు మొదలైంది... కేసీఆర్ చెప్పినట్లే వెల్ఫేర్ బోర్డులు...
posted on Jan 4, 2020 9:22AM
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు టీఎస్-ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు అయ్యాయి. ప్రతి డిపోలో ఇద్దరు కార్మికుల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 202మందిని ఎంపిక చేశారు. డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో ఈ సంక్షేమ మండళ్లు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. కార్మికుల సమస్యలను ఈ బోర్డులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతాయని తెలిపారు. డిపో, రీజియన్, జోనల్, కార్పొరేషన్ స్థాయి సమస్యలను ఈ వెల్ఫేర్ బోర్డులు పరిష్కరిస్తాయి. అందుకోసం ప్రతి డిపోలో ఈ-బాక్సులు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు తమ సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను ప్రతి రోజూ తెరుస్తారు. డిపో స్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించి సమాచారాన్ని ఆ ఉద్యోగికి తెలియజేస్తారు. రీజియన్, జోన్, కార్పొరేషన్ పరిధిలో సమస్యల్ని ఉన్నతాధికారులకు బదిలీ చేస్తారు.
ఇక, డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లు వారానికోసారి సమావేశమవుతాయి. వేతనాలు, అలవెన్సులు, సెలవులు, రీఎంబర్స్ మెంట్ వంటి సమస్యలు మండళ్ల పరిధిలో పరిష్కరిస్తారు. ఇక, రీజియన్ మేనేజర్లు నెలకోసారి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వెల్ఫేర్ బోర్డుల సభ్యులు, డివిజనల్ మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్లు, అకౌంట్ ఆఫీసర్లు పాల్గొని రీజియన్ స్థాయి సమస్యలను పరిష్కరిస్తారు. ప్రధానంగా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ జాబితాల తయారీ తదితర అంశాలను పరిశీలిస్తారు. హైదరాబాద్ జోన్‌కు సంబంధించి రెండు నెలలకోసారి సమావేశం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో నగర పరిధిలోని సంక్షేమ మండళ్ల సభ్యులు పాల్గొంటారు. ఇక్కడ, రీజియన్, డిపో స్థాయి సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే, ఆయా జోన్ల ఈడీలు కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించి, తమ పరిధిలోని సమస్యలను క్లియర్ చేస్తారు.
ఇక, కార్పొరేషన్ స్థాయి సమావేశం మూడు నెలలకోసారి బస్ భవన్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ హాజరై సమస్యలను పరిశీలిస్తారు. అయితే, ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం యూనియన్లు పనిచేసేవి, కానీ, ఇప్పుడు వాటి స్థానంలో ఏర్పాటైన వెల్ఫేర్ బోర్డులు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నాయి.