అభ్యర్దుల ఎంపికలో బాల కృష్ణ బిజీ ?
posted on Dec 26, 2012 9:13AM
వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సరైన అభ్యర్దులను ఎంపిక చేసే పనిలో ఎన్టిఆర్ కుమారుడు, చంద్ర బాబు వియ్యంకుడు బాల కృష్ణ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్దుల గురించి ఆయన ఆరా తీస్తునట్లు సమాచారం.
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్. 10 లోగల తన స్నేహితుని నివాసంలో తన సన్నిహితులతో ప్రతి రోజూ ఆయన సమావేశం అవుతూ ఈ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజక వర్గం నుండి ఉన్న ఆశావహుల జాబితా, వారి ఆర్ధిక పరిస్థితి, రాజకీయానుభవం వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాలను సేకరించి, అభ్యర్దుల ఎంపికలో ఓ తుది నిర్ణయానికి రావాలని ఆయన భావిస్తున్నారు. ఇలాంటి సమావేశాలతో పాటు, అభ్యర్దుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నందమూరి అభిమాన సంఘాల నుండి కూడా బాల కృష్ణ విషయ సేకరణ చేస్తున్నారు.
ఇలా సేకరించిన అభిప్రాయాలతో టికెట్ ఖాయమని ఆయన కొంతమందికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీఫై పట్టు సాధించడం కోసం కూడా ఆయన అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.