‘నామినేటేడ్’ కోసం నేతల కుస్తీ
posted on Dec 26, 2012 5:51AM
రాష్ట్రంలో నామినేటేడ్ పదవుల భర్తీ త్వరలో జరుగుతుందని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఆ పదవులను పొందేందుకు నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పదవులకు తమ పేర్లు పరిశీలించాలని ఆశావహులు కిరణ్ కుమార్ వద్ద, ఢిల్లీ లో పార్టీ పెద్దల వద్ద ఫైరవీలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు.
మిగిలిన పదవుల భర్తీ కాస్త ఆలస్యం అయినా మహిళా కమీషన్, బిసి కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మైనారిటీ కమీషన్ ల చైర్మన్ పదవులను మాత్రం వెంటనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మహిళా కమీషన్ కు నేదురుమల్లి రాజ్య లక్ష్మి, మజ్జి శారద ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
మైనారిటీ కమీషన్ చైర్మన్ పదవికి అబిద్ రసూల్ ఖాన్ పేరు పరిశీలిస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ భర్త, మాజీ ఐ ఆర్ టి ఎస్ అధికారి పనబాక కృష్ణయ్య పేరు వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు.
గత ఐదు సంవత్సరాల నుండి ఈ పదవుల భర్తీ జరగకలేదు. దీనితో, ఈ పదవుల కోసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులంతా కన్నేసినట్లు తెలుస్తోంది.