వైఎస్ భూపందేరంఫై బాబు ధ్వజం
posted on Dec 25, 2012 5:58AM
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనంతా అవినీతిమయమని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాఫియాలను తయారు చేసి దివంగత నేత ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్నారని బాబు విమర్శించారు.
కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తన పాద యాత్రలో బాబు మాట్లాడుతూ, వైఎస్ తాను ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 117 సెజ్ ల పేరిట 2.75 లక్షల ఎకరాలను ప్రజల నుండి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, ఇందులో హైదరాబాద్ నుండే ఎనిమిది వేల ఎకరాలున్నాయని అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఒక్క ఎకరం ఇస్తే, వేయి ఉద్యోగాలు ఇవ్వాలనే షరతు పెట్టానని, వైఎస్ మాత్రం కొన్ని లక్షల ఎకరాలను వాటికి దారాదత్తం చేసినా, ఒక్క ఉద్యోగం కూడా తెప్పించలేకపోయారని బాబు విమర్శలు చేశారు. చివరకు అసైన్డ్ భూములను కూడా వారు స్వాధీనం చేసుకున్నారని చంద్ర బాబు వైఎస్ భూపంపకాలఫై తీవ్ర విమర్శలు చేశారు. కలెక్టర్లతో కాకుండా, ప్రైవేటు వ్యక్తులతో భూసేకరణ చేయించారని ఆయన అన్నారు.