జగన్ నివాసాల్లో సోదాలు జరగాలి : యనమల
posted on Dec 25, 2012 @ 10:47AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంకర్లలో అక్రమంగా కోట్లాది రూపాయలు దాచిపెట్టారని వాటిని వెలికి తీసేందుకు సిబిఐ, ఈడి, కేంద్ర విజిలెన్స్ సంస్థలు రంగంలోకి దిగాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు అన్నారు.
ఇడుపులపాయ, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, పులి వెందుల బంగాళా, బెంగుళూరు ప్రాంతాల్లోని జగన్ నివాసాల్లో ఈ తరహా సంస్థలు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాల్లో గల ఆయన నివాసాల్లోని బంకర్లలో అక్రమంగా దాచిన డబ్బును వెలికితీయాలని యనమల డిమాండ్ చేశారు.
ఈ తనిఖీలు జరపకుండా ఉండే విషయంలో కాంగ్రెస్ పార్టీతో జగన్ పార్టీకి ఓ ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. వీటిని చేపట్టేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించాలని ఆయన కోరారు. ఈ విషయాల్లో తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారిని అందులో నియమించాలని యనమల సూచించారు.
జగన్ కు చెందిన కేవలం రూ. 43,000 కోట్ల రూపాయలను మాత్రమే సిబిఐ ఇప్పటివరకూ కనుగొందని, మిగిలిన విచారణ అంతా పూర్తి అయితే, ఈ సంఖ్య లక్ష కోట్లు దాటుతుందని యనమల వ్యాఖ్యానించారు.