వాస్తవ వేదిక.. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం

Publish Date:Jan 9, 2026

దొంగలు దొంగలూ ఊళ్లు పంచుకున్న చందంగా ప్రస్తుత రాజకీయవ్యవస్థ తయారైంది. ఒకళ్లు చేసిన తప్పులను మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థ లొసుగులను తమకు అనుగుణంగా మలచుకుంటూ ప్రజాధనాన్ని పంచుకుంటున్నట్లుగా రాజకీయ నాయకుల తీరు తరయారైందంటూ.. వాస్తవ వేదిక లో తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ల చర్చా సారాంశం ఉంది.  వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  గురువారం ప్రసారమైంది. ఆ చర్చలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సంగ్రహంగా..  రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనలో జవాబుదారీతనం కరువవ్వడం, ప్రజాధనం దుర్వినియోగమౌతున్న తీరుపై రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ వాస్తవ వేదికలో కళ్లకు కట్టారు.   ప్రభుత్వ వ్యవస్థల్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మేధాశక్తిని సామాన్యుల బాగు కోసం కాకుండా, పాలకుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో ఐఏఎస్ అధికారులు అసెంబ్లీలో ప్రశ్నలకు భయపడేవారని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ విస్పష్టంగా చెప్పారు.  ఇక ప్రస్తుతం రాష్ట్రంలో  ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం అనిపిస్తోందన్నారు. ఇందుకు కారణాలు కూడా ఆయన ఉదహరించారు.  తాను కూటమి ప్రభుత్వాన్ని కుమ్మక్కు ప్రభుత్వంగా అభివర్ణించడానికి ఆయన కారణాన్ని కూడా వివరించారు. ప్రభుత్వ పథకాలు, పనుల కాంట్రాక్టుల అప్పగింతలో కూటమి ప్రభుత్వ లోపాలను ఎండగట్టే విషయంలో వైసీపీ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోందన్నారు. అందుకు కారణం వాటిలో వైసీపీయులకు కూడా వాటాలు ఉండటమే కారణమని ఆరోపించారు.  ఇందుకు ఉదాహరణగా గతంలో ఎలక్షన్ల సమయంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, స్మార్ట్ మీటర్ల విషయంలో గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చాక అవే సంస్థలకు టెండర్లు ఇవ్వడాన్ని చూపారు. నాడు తాను విమర్శించిన సంస్థలకే  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు.   ఇక దుర్మార్గానికి పరాకాష్ట అన్నట్లుగా ప్రజాధనం దుర్వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు.  జగన్ హయాంలో తిండి కోసం రూ. 400 కోట్లు, రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 600 కోట్లు, తిరుగుళ్ళ కోసం  250 కోట్లు, ఇక ప్రభుత్వ భవనాలు, పాఠశాలలకు పార్టీ రంగుల కోసం  రూ. 5000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయితే.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి సర్కార్ లో కూడా పాలకులు స్టార్ హోటళ్లలో భోజనానికి రోజుకు నలభై నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇది వారి కష్టార్జితం కాదు కనుకనే యధేచ్ఛగా ఖర్చు పెట్టేస్తున్నారన్నారు. గతంలో అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో   రూపాయిలో 6 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవనీ అదే ఇప్పుడైతే..   పద్దుల్లో లెక్కలు తప్ప ఒక్క పైసా కూడా ప్రజలకు అందకుండానే మాయమౌతోందన్నారు.  గతంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి జీవో సమాచారం ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు తెలిసేదనీ, నేడు  ప్రభుత్వం జారీ చేసే జీవోలు చాలా వరకూ రహస్యంగానే ఉంటున్నాయన్న డోలేంద్ర ప్రసాద్.. అత్యధిక జీవోలను వెబ్సైట్లలో అప్‌లోడ్ చేయడం లేదని విమర్శించారు.  తప్పుగా జారీ చేసే ఏ జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో కనిపించడం లేదన్నారు.  ఇప్పటికే ఆర్టీఐ  చట్టాన్ని 90 శాతం నిర్వీర్యం చేసేశారనీ, ఆ చట్టం ద్వారా  సమాధానాలు రావడం లేదనీ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..  పోలీసుల ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన నియంతృత్వ పోకడ అని విమర్శించారు,. దీనికి బాధ్యత ఎవరిదన్న రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ గత మూడు దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ వ్యవస్థ పతనానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.   ప్రజలు మేల్కొని ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోకపోతే పరిస్థితులు మారవని, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ తరహా తిరుగుబాటు వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ లు రాజకీయ నేతలకు హితవు చెప్పారు.  రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే, "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు" ఉంది. ఒకరు చేసే తప్పును మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సామాన్యుడి సొమ్మును పంచుకుంటున్నారు.  

కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!

Publish Date:Jan 6, 2026

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు.  ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు. అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు.   అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో  గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని   విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!

Publish Date:Jan 9, 2026

ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.
[

Health

]

ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం!

Publish Date:Jan 9, 2026

చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.  మందం పాటి దుస్తులు దరించినా,  స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది.  అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు  వైద్యులు.  అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే.. మానవ శరీరంలో  అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సంక్లిష్టమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను ఉపయోగించబడుతుంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించుకుంటుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు,  ఖనిజాలు అవసరం. శరీరంలో ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది,  జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరిగవచ్చు.  ఇలా జరిగితే మనిషిలో  సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట. ఐరన్,  విటమిన్-బి12 లోపం.. చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్  లోపమట. ఐరన్ బాగుంటేనే  హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలి పెరగడానికి దారి తీస్తుంది.   విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు,  కాళ్ళు తిమ్మిరిగా ఉండటం,  చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం,  ఫోలేట్ కూడా కండరాల సంకోచం,  శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని  ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే.. అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త  వ్యాయామం చేయడం మంచిది.  లేదంటే శరీరాన్ని  సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు. ఆహారంలో మార్పులు.. శరీరం వెచ్చగా ఉండటానికి  ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం,  మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి,  అల్లం తీసుకోవడం పెంచాలి.  ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి,  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.  ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి,  వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...