పులివెందులలో బీటెక్ రవి గెలుపు ధీమా.. కారణమదేనా?
posted on May 30, 2024 @ 3:49PM
ఎన్నికల ముందు వరకూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా వైనాట్ 175 అంటూ ఊదరగొట్టిన జగన్ పోలింగ్ తరువాత కంటే గతం కంటే ఎక్కువ స్థానాలు అంటూ ప్లేటు ఫిరాయించారు. అంటే వైసీపీ మొదటి నుంచీ చెప్పుకు వస్తున్న వైనాట్ 175 వట్టి మైండ్ గేమ్ నినాదమే అని స్వయంగా జగనే తేల్చేశారు. అయితే ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ ఆ నియోజకవర్గం నుంచి జగన్ కు ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన బీటెక్ రవి ధీమాగా చెబుతున్నారు. ఇంత కాలం అక్కడ అంటే పులివెందులలో జగన్ కు ప్రత్యర్థి ఎవరైనా అది నామమాత్రపు పోటీగానే ఉండేది. ఎందుకంటే నియోజకవర్గంలో జగన్ కు లేదా వైఎస్ కుటుంబానికి ఎదురు నిలబడటమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమేననే భయం అందరిలో ఉండేది. అయితే ఐదేళ్ల జగన్ పాలన పులివెందులలో ఆ భయాన్ని పోగొట్టేసింది. సొంత మనుషులే ఆయన తీరు పట్ల అయిష్టతతో, అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు వైఎస్ కుటుంబమే నిట్టనిలువుగా చీలిపోయింది. జగన్ తల్లి, చెల్లి కూడా జగన్ శిబిరంలో లేరు. షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా జగన్ పైనే విమర్శల బాణాలు గుప్పించారు. స్వయంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి.. జగన్ కు సవాల్ విసిరారు. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల సెగ్మెంట్ లో కూడా షర్మిల ప్రభావం బలంగా కనబడింది.
వీటన్నిటికీ మించి రాష్ట్రంలో జగన్ ప్రతిష్ట బాగా మసకబారడంతో పరిశీలకుల నుంచి అందరూ మరోసారి జగన్ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్ గాలి పోయినట్లు కనిపించింది. సరిగ్గా ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పులివెందులలో పోలింగ్ అనగానే ఇప్పటి వరకూ ఏకపక్షంగా జగన్ కు అనుకూలంగా జరిగేదనీ, కానీ ఈ సారి మాత్రం జగన్ వర్గీయులే తనకు రాయబారాలు పంపారని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అనవసరంగా మనం గొడవలకు దిగొద్దు. ఎన్నికలలో దౌర్జన్యాలకు తాము దూరంగా ఉంటాం, మీరు కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి అంటూ రాయబారాలు చేశారని బీటెక్ రవి చెప్పారు. ఎప్పుడూ ఎన్నికలు అనగానే చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలూ, బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడే వైసీపీ మూకలు పులివెందులలో ఈ సారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూద్దాం అంటూ కాళ్లబేరానికి వచ్చారంటే రాష్ట్రంలో జగన్ అధకారం కోల్పోవడం ఖాయమన్న నిర్ణయానికి వారు వచ్చేశారని అర్దం అని బీటెక్ రవి వివరించారు. ఎటూ జగన్ అధకారం కోల్పోతారు.. అటువంటి జగన్ కోసం తాము గొడవలకు పడితే వచ్చే ప్రభుత్వం తమను వదలదన్న భావన వారిలో కలిగిందనీ, అందుకే మాచర్లలో పోలింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లితే ఎన్నికల హింసకు కేరాఫ్ అడ్రస్ లాంటి పులివెందులలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నియోజకవర్గంలో భారీ పోలింగ్ జగరడం కూడా జగన్ వ్యతిరేకతకే అద్దం పడుతోందని ఆయన వివరించారు.
గతంలో జగన్ భయంతో ఓటు వేయడానికి ముందుకు రాని వారంతా ఇప్పుడు ధైర్యంగా పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటేశారని, అందుకే పులివెందులలో తన విజయంపై ధీమాగా ఉన్నానని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా పోలింగ్ బూత్ లలో కూర్చోవడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదనీ, ఈ సారి మాత్రం తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా రావడానికి పోటీలు పడ్డారనీ, అదే పులివెందులలో జగన్ సీన్ అయిపోయిందని చెప్పడానికి తార్కాణంగా రవి ఉదహరించారు. అంతే కాకుండా పోలింగ్ రెండు రోజుల ముందు ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ అధికారులు కడపలో పర్యటించి, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించడం కూడా స్థానిక వైసీపి నేతలను వెనక్కు తగ్గేలా చేసిందన్నారు.