కిరణ్ బలిపశువును చేశారు: మోపిదేవి
posted on Jan 3, 2013 9:26AM
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలు నుండి మధ్యంతర బెయిల్ ఫై బయటకు వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు ను నిన్న మంత్రులు బొత్స సత్యానారాయణ, ఆనం రామ నారాయణ రెడ్డిలు కలిసారు. ఆ సమయంలో మోపిదేవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు, తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.
నిన్న ఉదయం ఇద్దరు ఆయనను కలవగా, సాయంత్రం మాత్రం బొత్స ఒక్కరే మోపిదేవిని కలిసారు. ‘దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజ శేఖర రెడ్డి చెప్పినట్లే చేశాను తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఆయన చెప్పినట్లే ఫైళ్ల మీద సంతకాలు చేసాను. నన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసి సముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్తే, ఏమీ కాదని ఆయన అన్నారు. అయినా నన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం నేను బలిపశువును అయ్యాను’, అని మోపిదేవి తన మంత్రివర్గ మాజీ సహచరుల వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాద రావు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు తన విషయంలో ఎందుకు తీసుకోలేదని మోపిదేవి వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనితో వారిద్దరూ ఆయనను ఓదార్చారు. తనకు బెయిల్ ఇస్తే, జగన్ కూడా బయటకు వస్తారనే కారణంతో తనకు బెయిల్ ఇవ్వడంలేదని కొంత మంది అంటున్నారని, బెయిల్ విషయంలో తనకు, జగన్ కు ఏమి సంభందం ఉందని ఆయన మంత్రులను ప్రశ్నించారు.
బెయిల్ గడువు నేటితో ముగియనున్డటంతో మోపిదేవి ఈ రోజు కోర్టులో లొంగి పోవాల్సి ఉంటుంది.