చిరంజీవి ఫై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on Jan 3, 2013 @ 9:53AM
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవిఫై మాజీ మంత్రి, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామజిక న్యాయం పేరు చెప్పి సొంత పార్టీని స్థాపించి, పదవుల కోసం అదే పార్టీని అమ్ముకొన్న చిరంజీవి ఎలా గొప్ప వ్యక్తి కాగలడని ఆయన ప్రశ్నించారు.
ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చినంత మాత్రాన సామజిక న్యాయం వచ్చినట్లా అని కోమటిరెడ్డి అన్నారు. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న చిరంజీవి, ఆ మాట తప్పితే, హైదరాబాద్ నగరంలో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. తన కుమార్తె ఇంట్లో రూ.80 కోట్లు పట్టుబడితే, సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఆమెను బతిమలాడి విడిపించుకొన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
చిరంజీవిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్ప వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పు బట్టారు. చిరంజీవి ఇలాగే ఉంటే, రాజకీయాలు వదిలేసి మళ్ళీ మద్రాసు కు వెళ్లి సినిమాల్లో నటించాల్సి ఉంటుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అయితే, చిరంజీవిని రాజకీయంగా విమర్శిస్తే తప్పు ఉండదని, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను ఇలా ఓ ప్రాంతంలో తిరగనివ్వబోమని వ్యాఖ్యానించడం మాత్రం సరి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.