జగన్ పార్టీలోకి చింతల రామ చంద్ర రెడ్డి
posted on Jan 3, 2013 @ 10:39AM
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత,మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్ర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం అయింది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని ఆయన నేడు చంచల్ గూడ జైలులో కలవనున్నారు. ఆ వెంటనే పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కూడా కలుస్తారు. ఈ నెల మూడో వారంలోగానీ, నాలుగో వారంలోగానీ ఆయన పీలేరులో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వై ఎస్ విజయమ్మ సమక్షంలోఆ పార్టీలో చేరాలని చింతల భావిస్తున్నారు.
ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో చింతల కు దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. అయితే, కిరణ్ తో తాను చేస్తున్న రాజకీయ పోరాటానికి చంద్ర బాబు నుండి, టిడిపి నేతల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉండటంతో జగన్ పార్టీలో చేరాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. 2004లో పార్టీ చింతలకు బదులుగా పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తికి టికెట్ ఇచ్చింది. అలాగే, 2009 ఎన్నికల్లో కూడా పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించింది. దీనితో, ఆయన ప్రజా రాజ్యం పార్టీలో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేశారు.
చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో, ఆ పార్టీలో చేరడం ఇష్టం లేని చింతల కొంత కాలం తటస్థంగా ఉండిపోయారు. ఆ సమయంలో చంద్ర బాబు నాయుడు తిరిగి ఆయనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆయన తెలుగు దేశం పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
గత కొంత కాలంగా జగన్ పార్టీలో చేరే విషయాన్ని చింతల పరిశీలిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఆయన మద్దతుదారులు చింతలకు జగన్ పార్టీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది.