11 గంటలకు పూర్తికానున్న నిమజ్జనం
posted on Sep 30, 2012 @ 10:05AM
ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనం కోసం నిన్న బయలుదేరిన విగ్రహాలు ఇంకా ఆదివారం ఉదయం కుడా ట్యాంక్ బండ్ వద్ద బారులు తీరాయి. ఆదివారం 11 గంటలకు మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది.
హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది. ఖైరతాబాద్‌లో 58 అడుగుల మేర ఏర్పాటుచేసిన భారీ గణనాథుని ఊరేగింపు కూడా ఈసారి తొందరగా మొదలైంది. ఉదయం మంత్రి దానం నాగేందర్, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, డీజీపీ దినేశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 2.50 ప్రాంతంలో క్రేన్ ద్వారా లడ్డూను తీశారు. మధ్యాహ్నం 3.45కు గణపతిని క్రేన్‌తో 26 చక్రాల ట్రాలర్ మీదకు చేర్చారు. దాదాపు 3 గంటలు సాగిన వెల్డింగ్ పనుల అనంతరం రాత్రి 7గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభమైంది.