నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్ మహాగణపతి
posted on Sep 29, 2012 @ 6:17PM
రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. విజ్ఞేష్వరున్ని తరలించడానికి 26 టైర్ల లారీని సిద్ధం చేశారు. 11 రోజుల పాటు అశేష పూజలందుకున్న మహా గణపతి శోభయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగనుంది. 56 అడుగుల ఎత్తున్న వినాయకుడి నిమజ్జనాన్ని దర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులతో ఖైరతాబాద్ ప్రాంతం నిండిపోయింది. భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి బయల్దేరాడు. గణనాధున్ని భారీ వాహనంపైకి ఎక్కించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వెళ్లి హుస్సేన్ సాగర్ లో మహా గణపతి నిమజ్జనమవుతాడు. మహా గణపతి ఈ అర్ధరాత్రికి ట్యాంక్‌బండ్‌కు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున తరలివస్తున్న వినాయక విగ్రహాలతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా మారాయి. నిమజ్జన దృశ్యాలను చూసేందుకు జనం వెల్లువలా వస్తున్నారు.