ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి వివరాలు వెల్లడించండి
posted on Jan 6, 2013 @ 2:32PM
ఢిల్లీలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 23 ఏళ్ళ యువతి కేసును శనివారం కోర్టు విచారణకు తీసుకునే ప్రక్రియలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితురాలి వివరాలను బహిర్గతం చేయాలని ఒక వ్యక్తి డిమాండ్ చేశారు. అత్యాచార బాధితుల కోసం ఒక సంస్ధను నిర్వహిస్తూ దానికి వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్న స్వామి ఓం జీ కోర్టుకు చేసుకున్న దరఖాస్తులో బాధితురాలి వివరాలను, సమాచారాన్ని బహిర్గతం చేయాలని కోరారు.
అంతేకాక ఛార్జిషీటు కాపీలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు పంపిణీ చేయాలన్నారు. ”నేను భారత దేశ పౌరుడ్ని. అత్యాచారానికి లోనై హత్య చేయబడిన యువతి భారత దేశానికి కూతురులాంటిది. ఆమె స్నేహితుడు శుక్రవారం టివి ఛానల్‌లో కనిపించాడు. అందువలన ఇందులో దాచాల్సినదేమీ లేదు” అని ఆయన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ నమ్రత అగర్వాల్ కోర్టులో ఆయన వాదించారు. అయితే స్వామి ఓం జి అభ్యర్థనకు ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో అతని ఆసక్తిని ప్రశ్నించింది.