దాసరి మరో బాంబు !
posted on Jan 7, 2013 @ 3:13PM
ఏదో వ్యాఖ్యలతో ఈ మధ్య వరుసగా వార్తల్లో ఉంటూ వస్తున్న దర్శక రత్న దాసరి నారాయణ రావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది ‘పెద్దోళ్ళు’ చిత్ర పరిశ్రమ పేరు చెప్పుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని, అయితే, వారు ఎవ్వరూ తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక్క సినిమా కూడా తమ కేరీర్లలో తీయలేదని దుయ్యబట్టారు.
వీరు చిత్ర పరిశ్రమలో వచ్చిన తమ ఆదాయాన్ని ఇతర కార్యకలాపాలలోకి మళ్లిస్తున్నారని దాసరి అన్నారు. ఇలాంటి వారంతా ధియేటర్లను, స్టూడియోలను అద్దెకు ఇస్తున్నారని దాసరి వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ళంతా, రాష్ట ప్రభుత్వం నుండి, సినీ పరిశ్రమ నుండి అనేక రకాలుగా రాయితీలు పొంది కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఏమీ చేయడం లేదని దాసరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన ‘మిధునం’ సినిమా విజయోత్సవంలో పాల్గొన్న దాసరి గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది తన వ్యతిరేకులను అప్పుడప్పుడూ ఇలా దుమ్మెత్తి పోస్తూ ఉండటం ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ తర్వాత వాళ్ళను అనలేదని సంజాయిషీ ఇవ్వడమూ ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ మధ్య సురేష్ కృష్ణ రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఏదో వ్యాఖ్య చేసి, ఆ తర్వాత అవి అక్కినేని ని గానీ, రామ్ చరణ్ ను కానీ ఉద్దేశించి చేయలేదని ‘సంజాయిషీ’ ఇచ్చేసారు.
మరి ప్రస్తుతం దాసరి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేసిన్చినవో తెలుసుకోవాలంటే కొంచెం సమయం పడుతుందేమో !