ఇంకో మాట మాట్లాడకుండా ఆత్రుతగా అన్నమంతా రెండు నిమిషాల్లో తినేశాడతను.
కడుపు పూర్తిగా నిండకపోయినా ఆకలి చాలావరకూ తీరిపోయింది.
"సోనీ! వందరోజుల తరువాత నీ జీవితం ఎంత మారిపోబోతుందో తెలుసా?" అభిమానంతో అన్నాడు రాజశేఖరం.
"ఎంత మారిపోతుంది?" హేళనగా అడిగింది.
"నువ్వు పెద్ద భవనంలో వుంటావు, కార్లల్లో తిరుగుతావు! విమానాల్లో తిరుగుతావు- పెద్ద పెద్ద హోటల్స్ లో భోజనం చేస్తావు. ఇరవై నాలుగ్గంటలూ నీ చుట్టూ, నౌఖర్లు, ఖరీదయిన చీరలు కడతావు"
సోనీ నవ్వేసింది.
"అచ్చం మా పిచ్చాడిలాగానే మాట్లాడుతున్నావు నువ్వు!"
రాజశేఖరం కోపంగా అమెవేపు చూశాడు.
"పిచ్చాడెవరు?"
"ఇక్కడే వుంటాడు. ఆ లాడ్జ్ దగ్గర కూర్చుని వుంటాడులే! మా వాళ్ళందరికి సరదా పుట్టినప్పుడు వాడి దగ్గర కెళ్ళి వాడితో వాగిస్తుంటారు. అప్పుడు వాడు కూడా అచ్చం ఇందాక నువ్వు మాట్లాడినట్లే మాట్లాడతాడు."
"ఏం మాట్లాడతాడు?" అడిగాడు కుతూహలంగా.
"ఆడు ఇమానంలో జపాన్ ఎళ్తాడంట, సింగపూర్ ఎళ్తాడంట, ఆడికి ఆరు కార్లున్నాయంట, బాంక్ లో పదికోట్ల రూపాయల డబ్బుందట!"
"వాడు పిచ్చాడయి వుంటాడు."
"నేను చెప్పేదేమిటి మరి?"
"అంటే? నేనూ పిచ్చాడినంటావా?"
"నేననేదేముంది? అలాంటోళ్ళే ఎక్కువగా ఇక్కడికొస్తుంటా రెక్కడెక్కడి నుంచో! పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అక్కడ అవసరం లేనివాళ్ళు జబ్బులోళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు-"
రాజశేఖరానికి కోపం వచ్చిందిగానీ తమాయించుకున్నాడు.
తనిప్పుడు ఏం చెప్పినా వీళ్ళు నమ్మరు.
అందుకని ఏం చెప్పకుండా వుండటం అవసరం.
"కడుపు నిండా తిన్నావా?" అడిగింది సోనీ.
"ఆ!"
"సాంబారెలా వుంది? ఇవాళ కొత్త హోటల్ నుంచి తెచ్చా!"
"హోటల్లో కొనుక్కొచ్చావా?"
"లేకపోతే నేను తయారు చేసుకొస్తాననుకున్నావా ఏమిటి? మేమందరం సెకండ్ హాండ్ సాంబారే కొనుకొస్తాం"
"సెకండ్ హాండా?"
"సెకండ్ హాండంటే తెలీదా?"
"తెలీదు-"
"అదే హోటల్లో కొచ్చే వాళ్ళంతా సగం తిని తాగి ఎంగిలిచేసి వదిలేస్తారు కదా! అలాంటి కూరలు, పప్పులూ, అవన్నీ మాలాంటి వాళ్ళకు చవగ్గా అమ్ముతున్నారన్నమాట! లేకపోతే మాకెక్కడ దొరుకుతాయి అంతమంచివి?"
రాజశేఖరానికి వాంతి వస్తున్నట్లనిపించింది.
హోటళ్ళల్లో ఎంగిలి చేసి వదిలేసిన సాంబారుతోనా తను భోజనం చేసింది.
అతని వళ్ళంతా అసహ్యంతో జలదరించింది.
ఏమిటీ దరిద్రం?
దేశంలో ఇంత దరిద్రం వుందా?
అంటే సాధారణ ప్రజలకూ, ప్రభుత్వానికీ కూడా తెలీని మరో వర్గం, ఎవ్వరికీ తెలీని భయంకరమయిన దరిద్రాన్ని అనుభవిస్తూ బ్రతుకుతోంది.
ఇంతకాలం లోక్లాస్ అంటే కార్మిక వర్గం, రిక్షావాళ్ళు, కూలీలు, ఇళ్ళల్లో పనులు చేసేవాళ్ళు, అనుకుంటూ వచ్చాడు.
'లోక్లాస్' కన్నా కూడా అండర్ గ్రౌండ్ క్లాస్ ఒకటి పెద్ద సంఖ్యలో జంతువుల కన్న హీనమయిన జీవితాలను గడుపుతున్న విషయం ఎవరికీ తెలీదు.
రాజశేఖరానికి అనుమానం వచ్చింది.
తెలీదా? తెలీనట్లు నటిస్తున్నారా?
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు.
గాఢ నిద్రలో మునిగిపోయాడతను.
సోనీ అతని వంకే చూస్తూ తను తెచ్చిన చెత్తలో నుంచి ప్లాస్టిక్ లు, సీసాలు, కాగితాలు, అన్నీ వేరు చేస్తోంది.
* * *
కనకారావ్ విశాలమయిన ఆ టేబుల్ మీద కూర్చుని రోడ్ సైడ్ వుపన్యాసం తయారు చేస్తున్నాడు. ఈసారి ఉపన్యాసం అది వరకులా కాకుండా కొత్త యాంగిల్ తో రాయాలనిపిస్తోంది.
ఒకప్పుడు ఆ భవంతులు, ఆ కార్లు, ఆ సుఖాలు అవన్నీ చూస్తుంటే వళ్ళంతా కంపరమెత్తినట్లుండేది.
కానీ ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లోనే అవి మనిషి మనుగడకు కనీసావసరాలుగా అనిపిస్తోంది.
మెత్తని ఆ పరుపుల మీద పడుకుంటే వుదయం ఎనిమిదయినా నిద్ర మెలకువ రావటం లేదు.
వంటవాడు పెట్టే అద్భుతమయిన ఫలహారాలు తింటూంటే పగలంతా మత్తుగానే వుంటుంది. అది వరకులాగా వర్కర్స్ మీటింగ్ లకూ, రోడ్ సైడ్ మీటింగ్ లకూ వెళ్ళాలనిపించటం లేదు.
