"నిజం చెప్తున్నాను. నేను ఈశ్వర్ నే! నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. అందుకని నా భార్యా, పిల్లలూ భయపడి నన్నిక్కడ వదిలేశారు" అన్నాడు మధ్య మధ్యలో మాట్లాడుతూ.
"అంటే ఏం జబ్బు?" అనుమానంగా రాజశేఖరాన్ని అడిగింది సోనీ.
"ఎయిడ్స్ అంటే చాలా భయంకరమైన జబ్బు! ఇతను చనిపోవటం ఖాయం! దీనికి వైద్యం లేదు జాగ్రత్తగా వుండకపోతే ఇతనిని అంటి పెట్టుకుని వుండేవారిక్కూడా ఈ జబ్బు రావచ్చు."
అందరూ రాజశేఖరం వేపు నిశ్చేష్టులయి చూస్తుండిపోయారు. అతని మాటలు అందరికీ భయం కలిగించాయి.
"అయితే మనకెందుకొచ్చిన కిరికిరి? పదండి! పోదాం" అన్నాడు యాదగిరి.
ఎవర్దారిన వాళ్ళు వెళ్ళిపోతూంటే ఈశ్వర్ బిగ్గరగా ఏడ్చేయసాగాడు.
"వెళ్ళిపోకండి! నన్ను దయతల్చండి! దణ్ణం పెడతాను."
రాజశేఖరానికి అతనలా ఏడుస్తూంటే వదిలి వెళ్ళడానికి మనసొప్పలేదు.
"నీకేం పర్లేదులే! నేనొచ్చి చూస్తుంటాను" అతనితో అన్నాడు.
అతని కళ్ళల్లో ఆశ కనిపించింది.
"నిజంగానా?"
"ప్రామిస్! నీకేమయినా కావాలంటే చెప్పు.... తెచ్చిస్తాను."
"గొంతు తడారిపోతోంది. కొంచెం 'చాయ్' కావాలి."
"సరే."
సోనీతోపాటు వెనక్కు తిరిగాడు.
రాజశేఖరం ఆలోచనలన్నీ ఆ ఎమ్మెల్యే మీదే వున్నాయి. అంత బ్రతుకూ బతికి చివరికి ఈ చావేమిటి? అతని భార్యా పిల్లలూ, బంధువులూ ఎందుకలా కుక్కను తెచ్చి పారేసినట్లు పారేశారు?
ముందు నడుస్తున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
"ఈడు తక్కువోడేం కాదులే! పదవిలో వున్నన్నాళ్ళూ ఎవడినీ లెక్క చేయలేదు. ఇరవై నాల్గంటలూ, పేకాట, తాగుడూ, ముండలూ- ఇలాంటోడిని ఎవరు మాత్రం ఎందుకు చూస్తారు?"
"ఏంటాలోచిస్తున్నావ్?" అడిగింది సోనీ.
"వాడి గురించే!"
"గొప్పోళ్ళిళ్ళల్లో ఎప్పుడూ ఇలాంటివి జరుగుతూనే వుంటాయిలే- కొత్తేం లేదు"
టీ బండి దగ్గర కొచ్చాక ఆగిపోయాడు రాజశేఖరం.
"ఏమిటి నిలబడ్డావ్?"
"నా మకాం ఆ చెట్టుకిందేగా?"
"నీకు అన్నం పెడతాను- ఇంటికి రా!"
రాజశేఖరం ఆశ్చర్యపోయాడు.
అంతవరకూ మర్చిపోయిన ఆకలి ఒక్కసారిగా విజృంభించింది.
"అలా చూస్తావేంటి? నాతోపాటు ఆ బస్తా నువ్వూ మోశావ్ గా! అందుకని."
రాజశేఖరానికి ఆమె మీద కృతజ్ఞతా భావం కలిగింది.
"థాంక్యూ" అన్నాడు ఉత్సాహంగా.
ఇంటికి తీసుకెళ్ళి ఓ అట్టముక్క నేలమీద పరచిందామె.
"కూసో! అన్నం వండుతా" అంటూ లోపలికెళ్ళి ఏరుకొచ్చిన పుల్లలతో పొయ్యి రాజేసింది.
రాజశేఖరం వెనుక వున్న చెత్త బస్తాల మీదకు వాలాడు భారంగా.
ఎదురుగ్గా వేలాడుతున్న అద్దం ముక్కలో తన రూపం కనిపించే సరికి ఉలిక్కిపడ్డాడు. లేచి అద్దం దగ్గరకెళ్ళి మొఖం చూసుకున్నాడు.
అసలు తనను తనే గుర్తు పట్టలేని స్థితిలో వున్నాడు.
నల్లని మరకలతో, మొఖం, దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు, మట్టి మరకలతో నిండిపోయి చిరిగి పీలిక లవుతున్న బట్టలు.
తను సాధారణంగా రోడ్ మీద చూసే బిచ్చగాళ్ళ కన్నా అన్యాయంగా వుంది తన రూపం!
అసలు తన బట్టల వంక చూసుకోడానికే అసహ్యంగా వుంది.
అందుకే తన కెవ్వరూ వుద్యోగం ఇవ్వడానికి వప్పుకోలేదేమో!
మళ్ళీ వెనక్కు జారగిల బడ్డాడతను. వళ్ళంతా తేళ్ళు పాకుతున్నట్లనిపిస్తోంది.
ఎన్ని రోజులయిందా బట్టలు వేసుకుని---
అసలు తను ఇక్కడికొచ్చి ఎన్ని రోజులయింది?
రాజశేఖరానికి గుర్తు రావటం లేదు. నాలుగయిదు రోజులయిందేమో! కానీ సంవత్సరం నుంచీ ఇక్కడే వున్నట్లనిపిస్తోంది.
అంత భయంకరమయిన నరకం-
అతికష్టం మీద గుర్తు తెచ్చుకున్నాడతను.
నాలుగురోజులు--
సున్నం గోడమీద బొగ్గుతో వంద అంకెలు వేసి అందులో నాలుగు కొట్టేశాడతను ఇంకా తొంభయ్ ఆరురోజులు గడపాలి.
ఇద్దరికీ రెండు వంకర్లు తిరిగిపోయిన జెర్మన్ సిల్వర్ ప్లేట్లలో నూకలన్నం వేడి వేడిగా తీసుకొచ్చింది సోనీ.
ఇంకో ప్లాస్టిక్ సంచీలోనుంచి సాంబార్ ఇద్దరి ప్లేట్లలోనూ పోసింది.
