అందుకే తను ఇంతవరకూ ధనవంతులమీదా, వాళ్ళ ఆడంబరాల మీదా, వాళ్ళ ఆస్తుల మీదా, నిప్పులు కక్కుతూ ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు పూర్తిగా మారక తప్పదు.
ఒకప్పుడు తాను కారు, ఏసి, విమాన ప్రయాణాలు, భవంతుల్లో నివాసం, సోఫాలు, కుషన్ లు, రుచికరమయిన భోజనాలు వీటన్నిటినీ బూర్జువాల చిహ్నాలుగా ప్రబోధించేవాడు. దోపిడీదారుల ఆడంబరాలుగా వర్ణించేవాడు. వాటిని ఎటాక్ చేయమని కోరేవాడు. కానీ అవన్నీ ఇప్పుడు ప్రతి మనిషీ సుఖంగా బ్రతకడానికి అవసరమనీ, కనుక అవి ఇకనుంచీ ప్రతి ఒక్కరికీ కనీసావసరాలనీ చెప్పదలచుకున్నాడు.
నౌఖరు వచ్చాడతని దగ్గరకు.
"సార్!"
"ఏమిటి కామ్రేడ్?"
"మన ఇండస్ట్రీ వర్కర్స్ యూనియన్ లీడర్స్ వచ్చారు సార్! మీతో మాట్లాడాలంట"
"ఏరీ? ఎక్కడున్నారు?"
"విజిటర్స్ రూమ్ లో వున్నారు సార్!"
"ఎంత తప్పు చేశావ్ కామ్రేడ్! నేను కాపిటలిస్ట్ రాజశేఖరాన్ని కాదు. వర్కర్స్ ని విజిటర్స్ రూమ్ లో కూర్చోపెట్టటానికి. వెంటనే అందరినీ లోపలకు రమ్మను. నేనిక్కడున్నంత కాలం యీ భవనమంతా వారందరికీ చెందుతుంది. రమ్మను వెంటనే."
నౌఖరు బయటకు వెళ్ళాడు.
మరుక్షణంలో యూనియన్ లీడర్స్ అంతా ఆనందంగా లోపలి కొచ్చేశారు.
కామ్రేడ్ కనకారావ్-జిందాబాద్.
వర్కర్స్ యూనిటీ-జిందాబాద్.
అందరూ కనకారావుని కౌగిలించుకున్నారు.
"కామ్రేడ్! అన్ని ఇండస్ట్రీస్ లో వర్కర్స్ కి జీతాలు, బోనస్ లు పెరిగాయిగానీ మన ఇండస్ట్రీలో మాత్రం సంవత్సరంనుంచీ ఏమీ పెరగలేదు. కనుక వెంటనే జీతాలు పెంచాలని అడగడానికొచ్చాం."
"ఎంత కావాలో అంత తీసుకోండి కామ్రేడ్స్! నేనీ స్థానంలో వుండే మూడు నెలల్లోనయినా సర్వమానవ సమానత్వం అమలుచేస్తాను. యజమానీ, కార్మికుడూ ఒకటేనని ఋజువు చేస్తాను. ఇప్పుడే మేనేజర్ కి ఫోన్ చేసి చెప్తాను" అంటూ ఫోను అందుకున్నాడతను.
మేనేజర్ చెప్పిన జవాబు అతనికి కలవరం కలిగించింది.
మాట్లాడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
"ఫ్యాక్టరీ గత రెండేళ్ళుగా నష్టాలతో నడుస్తోందనీ, రాజశేఖరమే పర్సనల్ గా డబ్బు తెచ్చి ఫ్యాక్టరీ మూతపడకుండా నడుపుతున్నాడనీ చెప్తున్నాడు. నేను ఇప్పుడే ఫ్యాక్టరీకెళ్ళి అవన్నీ స్వయంగా చెక్ చేసి రేపు చెప్తాను."
యూనియన్ లీడర్స్ నవ్వారు.
"నువ్వు చెక్ చేయాల్సిందేమీ లేదు కామ్రేడ్! మన ఇండస్ట్రీ నష్టాలతో నడుస్తున్న మాట నిజమే! మాకూ తెలుసా విషయం అదంతా మాకెందుకు? మాక్కావలసింది మేము బ్రతకటం. అంటే జీతాలు పెంచాలి, బోనస్ ఇవ్వాలి."
కనకారావుకి అర్ధం కాలేదు.
"నష్టాలు వస్తూంటే బోనస్ ఎలా ఇస్తారు కామ్రేడ్?"
"అదంతా మాకు తెలీదు కామ్రేడ్! ఇవ్వాలి అంతే!"
"అలా మొండివాదన చేయటం నాకిష్టంలేదు. బోనస్ గురించి మాట్లాడటమే మీనింగ్ లెస్" అన్నాడు కనకారావు.
యూనియన్ లీడర్స్ ఇద్దరూ అతనికి చెరోవేపూ వచ్చి నిలబడ్డారు.
"ఇవన్నీ మాకూ తెలుసు! వర్కర్స్ నోరు మూయించే బాధ్యత మాది. మా ఇద్దరికీ చెరో ఏభై వేలు ఇప్పించు చాలు."
కనకారావు ఉలిక్కిపడ్డాడు.
ఆ యూనియన్ లీడర్లిద్దరూ ఎలా కార్లు కొన్నదీ అప్పుడర్ధమయిందతనికి.
"ఓహో! అలాగా! అయితే ప్రతిసారీ పార్టీ తరపున వర్కర్స్ తో సమ్మె చేయించింది నేనూ, మేనేజ్ మెంట్ తో కుమ్మక్కయి లంచాలు తినేది మీరన్నమాట. యూనియన్ లీడర్లందరూ ఇంతంత ఆస్తులు ఎలా సంపాదిస్తోంది నాకిప్పుడర్ధమయింది. వెంటనే యీ విషయాలన్నీ పార్టీ లీడర్స్ తో చెప్తాను."
అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు.
"కనకారావ్- ముర్దాబాద్
మేనేజ్ మెంట్ - డౌన్ డౌన్
వర్కర్స్ స్ట్రగుల్-కొనసాగాలి"
కేకలు వేస్తూ బయటకు నడిచారు.
కనకారావు నిశ్చేష్టుడయి చూస్తుండిపోయాడు. అప్పటికప్పుడే ఫ్యాక్టరీ చేరుకుని మేనేజర్ తో పాటు ఫ్యాక్టరీ ఎకౌంట్స్ అన్నీ చెక్ చేశాడతను ఫ్యాక్టరీ పరిస్థితి మేనేజర్ చెప్పిన దానికంటే కూడా అధ్వాన్నంగా వుంది. అందుక్కారణం కార్మికులు తక్కువ గంటలు పనిచేయటం అప్పటికప్పుడే ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటించాలనిపించిందతనికి. కానీ ఏమీ చేయకుండానే ఇంటికొచ్చేశాడు.
ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపట్టిందతనికి. నిద్రలోనే ఏవో కేకలు వినిపిస్తున్నాయి.
