Next Page 
సినీ బేతాళం పేజి 1

           
                                      సినీ బేతాళం
                                                                         --యర్రంశెట్టి శాయి

                                             

                                        
    
    పూర్వము కృష్ణా నదీ తీరమందు సకల సంపదలు కలిగిన విజయవాడ పట్టణమందు రాజా అను కోటాదికారి (అనగా కోటీశ్వరుడు అని చదువుకోనవలెను) యుండెను. అతడొకనాడు వినోదార్ధమై మిత్రులతో బార్ కెళ్ళి అచట ఎవరెన్ని జోకులు వేసినను కించిత్తుయు నవ్వక చింతాక్రాంతుడయి యుండుట చూచి ఒకానొక మిత్రరాజము కడుంగడు ఆందోళన చెంది ఇట్లనియె-
    "మిత్రమా కోటాదికారీ! ఎల్లప్పుడును పున్నమి చంద్రునివలె వెలుగాడు నీ ముఖారవిందము నేడు అమావాస్య చీకటిని బోలి యున్నది. మేమెవ్వెరమెన్ని విధముల జోకినా గాని నీవు యిసుమంతయిన నవ్వకున్నావు దీనికి కారణము బెద్ది?"
    అందుకు కొటాదికారి భోరున ఏడ్చి కన్నీరు తుడుచుకొనకయేఇట్లనియె.
    "అక్కటా! నా పరిస్థితి ఏమని చెప్పుదును? సారా వ్యాపారము నందు నేను ఆర్జించిన నల్లధనము మిక్కిలి మిక్కుటమును పుండు వలె సలుపుతున్నది. నేడో రేపో ఇన్ కం టాక్స్ వారు దాడి జరిపి నన్నూ నా నల్లధనమునూ వేరు చేయకమానరు. ఆ నల్ల ధనమంతయూ ఏదేని ఒక విధమున వ్యయము చేసి వారికీ దక్కనీయరాదనీ ఎనిమిది ప్రొద్దుల నుండి యోచించుచుంటిని. అయినను ఇంత దనుక యొక్క యుపాయమును తోచలేదు. ఇదియే నా చింతకు కారణము"
    ఆ మిత్ర రాజము భళ్ళున నవ్వి "పిచ్చివాడా! అందుకింత యోచించ బని ఏమున్నది! చలన చిత్ర రంగమును మరచితివా? ఎవరెంత వ్యయము చేసినను కడకు చిప్ప్ చేతికి రావలేనన్న అద్దానిని మించిన వ్యాపారము మరొకటి లేదని అనుభవజ్ఞులు చెప్పెదరు. నీ నల్ల ధనమంతయూ అచ్చోట నిశ్చింతగా కరిగించవచ్చు." అని ఉపాయము చెప్పెను. కోటాదికారి సంతసము పట్టలేక ఆ మిత్ర రాజమును కౌగలించుకొని మరియొక సారి ఏడ్చి మద్రాసు నగరమునకు రైలేక్కెను.

                                    *    *    *    *

    "నేను సారా యాపారం సేత్తుండా! నల్ల డబ్బు తెగపోగయింధనుకో! ఆ డబ్బు ఆళ్ళ కియ్యమని ఇంకంటాక్సోళ్ళు పీక్కు తింటుండారు. నేను సంపాదించింది. ఆళ్ళ ఎదరెట్టడానికి నాకు మనసొప్పడం లేదహ! అందుకని ఓ సినిమా తీద్దామని ఇటోచ్చా! ఎవంటావ్?" చుట్ట కాలుస్తూ అడిగాడు నిర్మాత త్రీస్టార్ హోటల్రూములో.
    "అద్భుతమైన ఆలోచనండీ !" అన్నాడు డైరక్టర్ తబ్బిబ్బయి.
    "ఇప్పుడు మనం కోట్లు ఖర్చు పెట్టి సాలా పెద్ద సినిమా తియ్యాలాహ! తెలిసిందా?" డైరక్టర్ ఆ మాట వింటూనే మూర్చపోయాడు. నిర్మాత వెంటనే పక్కన గ్లాసులో ఉన్న ఐస్ నీళ్ళు అతని మొఖం మీద కొట్టాడు.
    "నేనెక్కడున్నాను ?" అన్నాడు డైరక్టర్ కళ్ళు విప్పి.
    "నీ యవ్వ లేహ! ఇదేం సినివానా ఏమిటి - కళ్లిప్పగానే ఎక్కడున్నారో సేప్పడానికి!" విసుక్కున్నాడు నిర్మాత.
    డైరక్టర్ ఠపీమని లేచి కూర్చున్నాడు.
    "ఏదీ - ఇందాకనే విన్నమాట మరోసారి చెప్పండి. ఈ సినివారి కోట్ల రూపాయలు ఖర్చేడతానన్నది మీరే కదూ?"
    "ఇదిగో - ఇలా సేప్పిందే సెప్పడం నా కలవాటు లేదు. అది తాగి నోళ్ళు సేసేపని , నేను సారా అమ్ముతాను గానీ , తాగను! తెలిసిందా!" మళ్ళీ విసుక్కున్నాడు నిర్మాత.
    "తెలిసిందండీ" వినయంగా అన్నాడు డైరక్టరు.
    'ఇంకో విషయం కూడా గురుతెట్టుకో! మనం ఈ సినీవాడబ్బు కోసం తీత్తం లేదు...."
    'అయ్యా బాబోయ్- తెలిసిందండీ! కేవలం కళను పోషించాలని తవరి కోరికండీ! చూస్తూండండీ! మీ చిత్రం ఖచ్చితంగా శతదినోత్సవాలు చేసుకుంటుందండీదేశమంతానూ"
    "ఇదిగో - ఇలా తాగినోడు లాగా మాటాడితేనే వొళ్ళు మండేది. నేను సినిమా తీసేది కళా, కరకరకాయ కోసం కాదహ...."
    "ఒహోహో- అర్ధమయిపోయిందండీ! ఫక్తు వ్యాపారం అన్నమాటండీ! కమర్షియల్ సినీవా తీసి డబ్బు చేసుకోవాలన్న మాటండి అంటే...."
    "అపహ....." గట్టిగా అరిచాడు నిర్మాత.
    డైరక్టర్ ఆపేశాడు.
    "నేను సినీవా తీసేది డబ్బు కోసం కాదు. వదిలించుకోవడం కోసం -తెలిసిందా? నాకు ఈ సినీవా మూలాన కోట్లు నట్టం రావాలి. ఈ సినిమా సేసుకోవాల్సింది శతదినోత్సవాలు కాదు జతదిననోత్తవాలు . అంత సెత్త సిత్రం తీయాలన్న మాట. అందుకే డైరెట్రుగా నిన్ను మాట్లాడుకున్నాను తెలిసిందా?"
    "తెలిసిందండీ...."
    "ఏటి తెలిసింది ?"
    "మనం పెద్ద ప్లాప్ సినిమా తీయాలండీ! అది రిలీజవకుండానే ఇంకా ఇంకా ఖర్చునిస్తూనే ఉండాలండీ! అలా బోలెడు నష్టం తెచ్చు కోవాలండీ! దాంతో మీకు ఇన్ కమ్ టక్స్ వాళ్ళ  గొడవ వదిలిపొతుందండీ.
    "అద్గదీ సంగతి ....." ఆనందంగా అన్నాడు నిర్మాత. "అయితే సెప్పు! కోట్లు కరుసెట్టి ప్లాప్ సినిమా ఎట్టా తీయాలో...."
    "దానికి చాలా రూల్స్ ఉన్నాయండీ! మొదటిదేమిటంటే - చెప్పే ముందు నేను కొంచెం మూడ్ లో కొస్తే బావుంటుంది కదండీ - అంచేత బాటిలూ, సిగరెట్టూ, బాటిలూ, కాబరేలూ , బీచ్ షికార్లూ, బాటిలూ, చికెనూ, ఫ్రాన్సు బాటిలూ బీచ్ షికార్లు , బాటిలూ , చికెనూ, ఫ్రాన్సు బాటిలూ - ఆఖర్లో ఇంకో బాటిలూ - ఇవన్నీ ఏర్పాటు చేయిస్తే ...." అంటూ నసిగాడతను.
    నిర్మాత "ఎవడురా అక్కడ?" అని అరిచాడు.
    "చిత్తం మహారాజా" అని ఓ బాయ్ గదిలో కొచ్చాడు.
    "అర్జంటుగా బాటిలూ, సిగిరెట్లూ, బాటిలూ కాబరేలూ, బీచ్ షికార్లూ, బాటిలూ చికెనూ, ఫ్రాన్సు బాటిలూ ఆఖర్లో ఇంకో బాటిలూ ఇవన్నీ తీసుకురా!' అంటూ ఓ గొనె సంచీలో నుంచి గుప్పెడు నోట్లు తీసి అతనికిచ్చాడు.
    డైరెక్టరు మళ్ళీ స్పృహ తప్పబోయాడు. గాని నిర్మాత ఎదురుగ్గా బావుండదని ఆ ఆలోచన పోస్ట్ పోన్ చేసుకున్నాడు.  
    బాయ్ మరుక్షణంలో నిర్మాత చెప్పినవన్నీ ఓ పెద్ద ప్లేట్లో పెట్టుకోచ్చాడు.
    "ఇదేమిటి? బాటిల్సూ, సిగరెట్లూ, చికెనూ, ఫ్రాన్స్ తెచ్చావ్? కాబరేలూ బీచ్ షికార్లూ కూడా రెండు ప్లేట్లూ తీసుకురా?" అన్నాడు నిర్మాత.
    "అవి ఆ బాతిల్లోనే మిక్స్ చేసేశారండీ! పుచ్చుకుంటే కళ్ళముందు స్పష్టంగా కనవదతాయ్" వినయంగా చెప్పాడు బాయ్.
    "ఔనాను" అనేసి పైకెత్తిన బాటిల్ దించి మూడ్ లోకి వచ్చాడు డైరక్టర్.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS