Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 36

    రాజశేఖరానికి కోపం వచ్చింది.

    "షటప్!" అన్నాడు బిగ్గరగా.

    "అయ్యేం? అన్నీ అర్ధంలేని మాటలే! ఖచ్చితంగా పిచ్చాసుపత్రి కేసే నువ్వు! లేకపోతే అలా కార్ల వెనుక ఎవరయినా 'కనకారావ్' అని అరుస్తూ పరిగెడతారా?"

    "సర్లే పద" విసుక్కున్నాడు.

    ఆమె నెత్తిమీద గోనె సంచీ పెట్టుకుని మోస్తూ నడుస్తుంటే తను వెనుక నడవసాగాడు.

    సోనీ ఏవేవో కబుర్లు చెప్తోంది.

    "ఇవన్నీ పోగుచేసి అమ్మితే ఒక్కోసారి ఇరవై రూపాయల వరకూ వస్తుంది తెలుసా? అందులో కొంచెం కొంచెం దాచుకుంటున్నా! బోలెడు డబ్బు పోగయ్యాక అప్పుడు కోటి వెళ్ళి చీర కొనుక్కుంటా."

    "ఏ చీర?"

    "అదే ఒక షాపులో బొమ్మకు కట్టార్లే! ఎంత బాగుందో తెలుసా? కానీ చాలా ధర చెప్పాడు."

    "ఎంత?"

    "నూట అరవై.... ఎప్పటికి పోగయేను? ఈ బస్తా కాసేపు నువ్వెత్తుకోకూడదూ? మెడ నొప్పెడతాంది."

    రాజశేఖరానికి ఆమె మీద జాలి వేసింది.

    అది తన భుజం మీద కెత్తుకున్నాడు. తనూహించిన దానికంటె బరువు ఎక్కువగానే వుంది.

    ఇద్దరూ ఆమె ఇంటికి చేరుకునేసరికి అందరూ ఓవర్ బ్రిడ్జ్ కిందకు పరిగెడుతూ కనిపించారు.

    గోనెసంచీ ఇంటి దగ్గర పడేసి ఇద్దరూ ఆ గుంపు దగ్గరకు పరుగెత్తారు.

    మధ్యలో ఓ వ్యక్తి చాలా ఖరీదయిన దుస్తుల్లో పడి వున్నాడు. కళ్ళు తెరచి చూస్తున్నాడు గానీ మాట రావటంలేదు.

    "ఎవరతను?" గుంపులో నిలబడ్డ గడ్డపాడుని అడిగాడు రాజశేఖరం.

    "మామూలే! ఎవరికీ పనికిరాకపోతే ఆళ్ళను ఇక్కడే పడేసి పోతుంటారు."

    "అంటే?"

    "రాత్రి ఎవరో వీడిని కార్లో తెచ్చి ఓవర్ బ్రిడ్జి కింద పడేసి వెళ్ళిపోయారట! బద్మాష్ చూసిందట."

    "అవును! నేను అర్ధరాత్రి బ్రిడ్జి మీద నిలబడి గిరాక్ కోసం చూసున్నా! ఒక్కళ్ళు కూడా దొరకలేదని బ్రిడ్జి దిగుతుంటే కింద కారు కనిపించింది. అందులో నుంచి ఈడిని తీసి కింద పడేశారు.... కారెళ్ళి పోయింది. మామూలుగానే ఎవర్నయినా సంపి శవాన్ని తెచ్చి పడేశారనుకుని నా దారిన నేనొచ్చా! పొద్దున్న చూస్తే ప్రాణం వుంది" అంది బద్మాష్.

    ఆ రాత్రి లాడ్జ్ లో తను మడతమంచం మీదకు చేరిన వ్యభిచారిణి నీ పేరు బద్మాష్ అని తెలిసింది రాజశేఖరానికి.

    "ఈడినెందుకు పారేసిన్రంటావ్?" యాదగిరి అడిగాడు.

    "మనకేమెరుక? దొరళ్ళిల్ల గిసంటి దందాలు మస్తుగ జరుగుతుంటాయి" అన్నాడు డప్పుకొట్టే వాడు.

    "ఆడికేదో అంటురోగం వచ్చుంటది! అందుకనే ఈడకు తెచ్చి పారేసిన్రు" అన్నాడు గడ్డపాడు.

    ఆ మాటతో అందరికీ భయం వేసింది.

    ఒక్కొక్కడు నెమ్మదిగా వెనక్కు జరగసాగారు.

    "అవును! కిందటిసారి ఆడెవడో కలరా పేషెంట్ ని తెచ్చి పడేశారుగా! తెలీక ఆడికి మందేయబోతే ఆడితోపాటు నర్శింహగాడు కూడా చచ్చాడు" గుర్తు చేసింది సోనీ.

    "ఏయ్.... నువ్వెవరు? నీ పేరేంటి?" అడిగింది బద్మాష్.

    అతను మాట్లాడ్డానికి విశ్వప్రయత్నం చేసి చివరకు చెప్పగలిగాడు సన్న గొంతుతో "ఈశ్వర్"

    "నిన్నెవరు పడేశారిక్కడ?"

    అతని కళ్ళవెంబడి నీళ్ళు కారిపోయినాయి.

    వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నాడు.

    "మీ ఇల్లెక్కడ?"

    "హిమయత్ నగర్."

    "నువ్వెవరివసలు?"

    "ఈశ్వర్! ఎమ్మెల్యే"

    గడ్డపాడు ఆశ్చర్యంగా రెండడుగులు ముందుకేసి అతని ముఖంలోకి చూశాడు.

    "అవును! పదేళ్ళ కిందట ఈశ్వర్ అని ఎమ్మెల్యే వుండేవాడు" అన్నాడు రాములు.

    "అంతా అబద్ధం! వీడెవడో పిచ్చాడయి వుంటాడు. ఎమ్మెల్యే అయితే ఇలా ఎందుకు తెచ్చి పడేస్తారు? వాళ్ళకేం తక్కువని?" అంది సోనీ.

    "అవును! ఆ మాట అబద్ధమే" అన్నాడు రాజశేఖరం.

    అతను మళ్ళీ ఏడ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS