"ఛట్! అలాంటి పని చేస్తే చేయను"
"చేయకపోతే ఆకలితోటి చస్తావ్"
"చచ్చినా సరేగానీ చేయను"
"అయితే చావ్"
ఆ రాత్రంతా ఆకలి బాధ ఓ పక్క దోమలు-బొద్దింకల బాధ మరోపక్క పీడిస్తోంటే నిద్ర లేకుండా గడిపాడతను. అయితే అంతకు ముందు రోజులా చలి మాత్రం లేదు.
పొద్దున జైలు 'టీ' తాగేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లైంది.
"ఏయ్ రాజూ! నువ్వేం పరేషానవ్వకు. మధ్యాహ్నం భోజనం పెడతారు వీళ్ళు! నువ్వురెండు దినాలకెళ్ళి తినలేదంటివిగా?"
అతనికి ఆశ కలిగింది.
అవును జైల్లో వున్నందుకు భోజనం పెట్టాలికదా!
ఒక విధంగా తనను జైల్లో వేయటం మంచిదే అయ్యింది.
లేకపోతే ఆ చలికీ, ఆకలికీ చచ్చేవాడు.
మధ్యాహ్నం భోజనం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు.
రెండయిపోయినా భోజనం రాకపోయేసరికి అందరికీ అనుమానం వచ్చేసింది.
"ఇంక భోజనం పెట్టరు" అన్నాడు రాములు.
అతను ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి? జైలులో వున్నవాళ్ళందరికీ భోజనం పెట్టాలిగా?"
"మనలాంటి ఏక్ దిన్ కా సుల్తాన్ గాళ్ళకు పెట్టరు" యాదగిరి విచారంగా అన్నాడు.
"ఎందుకని?"
"మననెలాగూ సాయంత్రం వదిలేస్తారు కదా! అందుకని ఒకపూట రేషన్ కాజేస్తారన్నమాట యీ జైలు వాళ్ళు" ఇంకో ఖైదీ అన్నాడు.
ఈలోగా సెంట్రీలు అటు వచ్చేప్పటికి అందరూ సెంట్రీ వెంబడి పడ్డారు భోజనం కోసం.
"ఆజ్ ఖానా నహీ హై" ఖండితంగా చెప్పాడతను.
"అదేంటి? ఎందుకు లేదు? గవర్నమెంటు రేషన్ అంతా ఏమయిపోయింది?" ఎవరో అరిచారు.
"ఏయ్! లొల్లీ పెట్టిన్రంటే లాఠీతోటి ఎడతా భోజనం! సమజయ్యిందా?"
అంతే! ఆ తరువాత ఎవరూ మాట్లాడలేదు.
ఆ సాయంత్రం ఏడు గంటలకు సెంట్రీ భోజనం ప్యాకెట్లు తెచ్చి ఆ గదిలో వున్నాళ్ళందరికీ తలోటి యిచ్చాడు.
రెండు రొట్టెలు, కొంచెం కూరా వున్నాయి అందులో.
రాజశేఖరం ఆతృతగా తినేశాడవి.
జీవితంలో అది మొదటిసారి అలాంటి ఆహారం తీసుకోవటం.
పోయిన సత్తువలో కొంచెం తిరిగొచ్చినట్లనిపించిందతనికి.
ఆ రాత్రి రాములు, యాదగిరి పాటలు పాడుతూంటే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. తెల్లారేసరికల్లా అందరినీ బయటకు గెంటేశారు.
రాజశేఖరానికి ఇంకా నమ్మబుద్ధి కావటంలేదు.
ఎంతమంది పలుకుబడి వున్న గూండాలు, ఇతర నేరస్తులు తమ బదులుగా డమ్మీలా జైలుశిక్ష అనుభవించేట్లు చేస్తున్నారో తెలీదు.
రాములు, యాదగిరితోపాటు స్లమ్ కి తిరిగొచ్చాడతను.
సోనీ భుజానికి గోనె సంచీ తగిలించుకుని ఎదురయింది.
"నీయవ్వ! కాగితాలు, ప్లాస్టిక్ లు ఏరుకొద్దామంటే జమీందార్ లెక్కన నకరాల్జేశావు... జైలు మంచిగుందా?" అడిగింది హేళనగా.
"ఇవాళ్టి నుంచీ నీతో వస్తా."
"అయితే పద."
ఆమెతోపాటు రోడ్ల వెంబడి నడవసాగాడతను.
కొద్ది దూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు పట్టుకున్నాయి.
"ఇంక నేను రాలేను" అన్నాడు ఆగిపోయి.
"సరే ఇక్కడే కూర్చో నేను మార్కెట్ అంతా చూసుకొస్తాను."
బస్ స్టాప్ లో కూర్చున్నాడు రాజశేఖరం.
"రోడ్ చాలా రద్దీగా వుంది.
హఠాత్తుగా ఎగ్జట్ మెంట్ తో లేచి నుంచున్నాడు రాజశేఖరం.
తన బెంజ్ కారు వేగంగా వస్తోంది.
ఎంత లగ్జరియస్ కారది?
ఆ కార్లో తిరగాల్సిన వాడికిదేం ఖర్మ?
ఎందుకిలాంటి తెలివితక్కువ పందెం కట్టాడు తను? తిరిగి ఇంటికెళ్ళిపోతే? నో! పందెం ఓడిపోవడానికి వీల్లేదు. ఇంతవరకూ ఎప్పుడూ ఓడిపోలేదు.
ఆ కారు తన ముందు నుంచీ వెళ్ళిపోతోంది.
లోపల కనకారావు దర్జాగా కూర్చుని వున్నాడు.
మార్క్సిస్ట్ కనకారావు.
"ఒరేయ్ కనకారావ్?" కారు పక్కన చేయి వూపుతూ పరుగెత్తాడు గానీ అతను తనవంక కూడా చూడలేదు.
"ఏయ్! ఏమిటా పిచ్చి చేష్టలు? ఇక్కడికొచ్చే ముందు పిచ్చాసుపత్రిలో వుండేవాడివా?" పక్కకొచ్చి నిలబడుతూ అడిగింది సోనీ.
