Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 34

    రాజశేఖరం ఇంక నడవలేక టీ బండికి దూరంగా వున్న చెట్టు కింద పడుకున్నాడు.

    కళ్ళు మూసుకుని నిద్రపోడానికి ప్రయత్నించాడు గానీ ఆకలికి నిద్ర కూడా పట్టటంలేదు.

    చీకటి పడిపోతూండగా మగత నిద్రపట్టింది.

    కర్రతో కాలిమీద ఎవరో కొట్టినట్లనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కానిస్టేబుల్ నిలబడి వున్నాడు.

    "ఎవళుబే నువ్వు?" అడిగాడు దౌర్జన్యంగా.

    "నా పేరు రాజు."

    "ఏడకెళ్ళొచ్చినావ్ రా?"

    "చార్ మినార్"

    "పిక్ పాకెటింగ్ చేస్తున్నావ్ బే? లేరా! సాలే! లేచి నిలబడి మాట్టాడు. కోటీశ్వరుడిలాగ కూసుని మాట్టాడుతున్నావ్?" అంటూ లాఠీతో భుజం మీద లాగి కొట్టాడు.

    అతనికి కోపం ఆగలేదు.

    "బాస్టర్డ్! వై ఆర్ యూ చీటింగ్ మీ? ఎవడిచ్చాడ్రా పవర్స్ నీకు? పద రాస్కెల్! ఇప్పుడే మీ కమీషనర్ సక్సేనాతో మాట్లాడతాను" అంటూ లేచి నిలబడ్డాడు.


    "అరె స్సాలే! ఇయాళ్ళ్రేపు బెగ్గర్ గాళ్ళు కూడా ఇంగ్లీషు మాట్లాడుతున్రురే! ఏమిరా! కమీషనర్ గారికి చెప్తావ్- నీ యవ్వ - నీకే యింత రువాబు వుంటే యింక మేము కొలువులెట్ట జెయ్యాల్రా? నడువ్ బే స్టేషన్ కి" అంటూ ఒక్క తోపు తోశాడు.

    రాజశేఖరం కింద పడబోయి నిలదొక్కుకుని నిలబడ్డాడు.


    ఈసారి కానిస్టేబుల్ కొట్టటానికి లాఠీ ఎత్తేసరికి ఇంక ఎదురు మాట్లాడలేకపోయాడు.

    "సాలే-నడువ్"

    "ఎందుకూ? నేనేం జేశాను?"

    "నోరు తెరిచినావంటే లాఠీ దించుతా--సాలే! ఖామోష్ నడువ్"

    ఇద్దరూ దూరంగా ఆగివున్న పోలీస్ జీప్ దగ్గరకు నడిచారు.

    ఇన్స్ పెక్టర్ కోపంగా చూశాడు.

    "ఎంతసేపు? నీకేం తెలివున్నదా లేదా? జల్దీ జీపెక్కించు"

    అతడ్ని బలవంతంగా జీప్ లోకి తోశాడు కానిస్టేబుల్.

    జీప్ పోలీస్ స్టేషన్ చేరుకుంది.

    అక్కడ లాకప్ లో మరి కొంతమంది వున్నారు.

    రాజశేఖరాన్ని చూడగానే గుర్తుపట్టారు అతని కోటు కాజేసిన వాళ్ళిద్దరూ.

    "అరె! నిన్నుగూడా తెచ్చిన్రా! మంచిగయిందిలే!" అన్నాడొకడు.

    "ఎందుకు తీసుకొచ్చారు మనని?" అడిగాడు రాజశేఖరం అనుమానంగా.

    "అరే-ఇది నడుస్తూనే ఉంటది భాయ్! ఏదోక కేస్ కింద ఎవర్నోకరిని బుక్ చేయాలి లేదా దాన్దిక్కుకెళ్ళి మన తానకొచ్చి మనల్ని తీసుకొచ్చి జైల్లో పెడతారు. ఒక్క దినం! అంతనే! ఎల్లుండికల్లా బయట పడతాము."

    అతనికి భయమేసింది.

    ఒక మామూలు పౌరుడి జీవితం ఎంత దారుణమయిన పరిస్తితిలో వుంది. వాడికి గూండాలనుంచీ, వర్తకులనుంచీ, పోలీసులనుంచీ ఎటూ రక్షణ లేదు.

    ఎవరయినా వాడి జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకోవచ్చు.

    అందరినీ తీసుకెళ్ళి జైల్లో ఓ గదిలోకి నెట్టారు.

    రాజశేఖరంకి కోపంగాను, అసహ్యంగానూ వుందా జైలు వాతావరణం.

    నేలంతా ఉమ్ములు, సిగరెట్ పీకలు, బీడీ ముక్కలు, గోడకు మరకలు.

    ఓ మూలకి చేరి కూర్సున్నాడతను.

    ఇదా డెమొక్రసీ అంటే?

    ఎవడో నేరం చేస్తే వాడి బదులు ఇంకొకడిని జైల్లో డమ్మీగా వేయటమా? ఇంత అవినీతితో నిండిన పోలీస్ తో ఏ దేశం బాగుపడుతుంది?

    "ఏయ్! నీ పేరేంటి?" అడిగాడు వాళ్ళిద్దరిలో ఒకడు.

    "రాజు"

    "నీకంత మంచికోటూ, బూటూ, వాచీ ఏడకెళ్ళొచ్చినయ్ రా రాజూ?"

    అతను చటుక్కున వాడి చొక్కా పట్టుకున్నాడు.

    "నన్ను 'రా' అంటావా రాస్కెల్! ప్రాణం తీస్తాను"

    వాడు విరగబడి నవ్వాడు.

    "రా అనకపోతే 'సార్' అంటారేం బే? ఇడు" అంటూ లాగి చేతిమీద కొట్టాడు.

    కాసేపు ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుండిపోయాడుగానీ చివరకు వాళ్ళిద్దరే మళ్ళీ దగ్గరకొచ్చారు.
    కాసేపట్లో వాళ్ళతో స్నేహం కలిసిపోయింది.

    వాళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసి బ్రతుకుతుంటారనీ, వాళ్ళ పేర్లు రాములు, యాదగిరీ అని తెలిసిందతనికి.

    "ఇగో రాజు! మా మాటిను! నీకెవ్వడూ కొలువివ్వడు నీకిష్టం వుంటే మాతోటి దొంగతనాలకు రా! మంచిగ పైసల్దొరుకుతయ్" చెప్పాడు రాములు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS