ఆ గుంపు లోపల ఎవడో డప్పు వాయించటం, ఓ పిల్ల డాన్స్ చేయటం కనిపిస్తోందతనికి.
తనూ కుతూహలంగా వెళ్ళి ఆ గుంపులోకి జొరబడి చూశాడు.
ఓ ముసలాడు డప్పు వాయిస్తున్నాడు లయబద్ధంగా.
దాని ప్రకారంగా ఓ పదేళ్ళ పిల్ల చెంగున ఎగురుతూ డాన్స్ చేస్తోంది.
చూడ్డానికి చాలా హుషారుగా, సరదాగా వుందా నృత్యం.
మెయిన్ రోడ్ మీద నడుస్తున్నవారంతా మధ్యలో ఆగి కాసేపు ఆ డాన్స్ చూసి మరీ వెళ్తున్నారు.
డాన్స్ ముగిసింది.
అందరికీను సలాం చేసిందా పిల్ల.
అందరూ చిల్లర ఆమె వేపు విసిరేసి వెళ్ళిపోతున్నారు.
అన్నీ ఏరుకుంటోందామె. త్వరత్వరగా ఆ చిల్లరంతా ఈ లోపలే లెక్కబెట్టాడు రాజశేఖరం.
మొత్తం పది రూపాయలుంటుంది.
రాజశేఖరానికి ఆశ్చర్యం కలిగింది.
ఆమె అలా నాలుగుచోట్ల డాన్స్ చేస్తే చాలు.... రోజుకి యాభై సంపాదించుకోవచ్చు.
అందరూ వెళ్ళిపోయారు.
ఆ ముసలాడూ, పిల్ల కూడా డప్పు తీసుకుని వెళ్ళిపోసాగాడు.
రాజశేఖరం వారిని వెంబడించి ఆపాడు.
"హలో బ్రదర్! ఒక చిన్న మాట."
"ఏమిటది?"
"అదే.... మనం కొంచెం ట్రబుల్స్ లో వున్నాం. అందుకని డ్రమ్ సాయంతో నేనూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను ఏమంటావ్?"
వాడు నవ్వాడు.
"నువ్వు డాన్స్ చేస్తావా?"
"అవును! ఏం?"
"చూసేవాళ్ళు ఏమయిపోవాలని నీ వుద్దేశ్యం? రక్తం కక్కుకుని చస్తారు. ఎందుకంత పాపానికి పాల్పడతావు?"
రాజశేఖరానికి కోపం ముంచుకొచ్చింది.
"అంటే? నాకు డాన్స్ చేతకాదనా నీ వుద్దేశ్యం? అంతేనా?"
"నిజం చెప్పు! ఏనాడయినా డాన్స్ చేశావా నువ్వు?"
"చేశాను."
"ఎక్కడ?"
"అమెరికాలో వున్నప్పుడు క్లబ్ లో చాలాసార్లు చేశాను."
వాడు విరగబడి నవ్వాడు.
"నీ ముఖానికి అమెరికానా? పిచ్చి వాగుడు వాగకు.... ఎవడయినా వింటే నవ్వుతాడు."
"ఏయ్! నాతో పనిచేస్తే చేయి. లేకపోతే ఫో. ఊరికే అతిగా మాట్లాడకు."
ఆ పిల్లకు అతనిని చూస్తే జాలివేసింది.
"పోన్లే అన్నా.... ఒకసారి సాయం చేయకూడదా?"
"సరే కానీ.... నాదేం పోయింది?" అంటూనే డప్పు మోగించటం ప్రారంభించాడు.
రాజశేఖరం డాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. అమెరికాలో వున్నప్పుడు తను బ్రేక్ డాన్స్, హిస్సీ డాన్స్ అన్నీ నేర్చుకున్నాడు గానీ దాని బీట్ వేరు. ఈ డప్పుకి ఏ మాత్రం కుదరటం లేదు. దారినపోయే నలుగురైదుగురు వచ్చి నిలబడి డాన్స్ చూడసాగారు.
రాజశేఖరానికి సంతోషం కలిగింది.
ఫరవాలేదు! ఇంకొంతమంది వస్తే చాలు.
కనీసం ఓ అయిదు రూపాయలయినా దొరకవచ్చు.
తన శక్తినంతా కూడదీసుకుని గాల్లోకి ఎగురుతూ తన యిష్టమొచ్చినట్లు డాన్స్ చేయటం మొదలుపెట్టాడు.
ఉన్న నలుగు రయిదుగురు కూడా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు.
ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించిందతనిని.
దానికితోడు కాళ్ళ నొప్పులు, ఆయాసం.
ఇంక ఎగరలేక ఒగరుస్తూ నిలబడిపోయాడు.
ఆ పిల్ల నవ్వుతూ దగ్గరకొచ్చింది.
"ఏయ్! మగాడు డాన్స్ చేస్తే ఎవడూ చూడడు. ఇంకేదన్నా పనిచేసుకో ఫో."
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
రాజశేఖరం మళ్ళీ స్లమ్ లోకి నడిచాడు.
ఉండుండి కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఏ క్షణాన్నయినా కింద పడిపోయేట్లున్నాడు.
సోనీ భుజానికి గోనెసంచీ తగిలించుకుని వస్తూ కనిపించింది.
తనను చూస్తూనే నవ్వింది.
"ఏయ్ రాజూ! పనేమయినా దొరికిందా?" అడిగింది జాలిగా.
"లేదు"
"నీ పిచ్చిగానీ పనెక్కడ దొరుకుద్ది? నువ్వు కూడా నాలాగా వూరంతా తిరిగి చెత్త కాగితాలు, ప్లాస్టిక్ సామాన్లు, సీసాలు ఏరుకో. లేకపోతే తిండిలేక చస్తావు."
రాజశేఖరానికి ఆ పని చాలా అసహ్యమనిపించింది.
"అలాంటి పనులు చేయటం నాకిష్టంలేదు."
సోనీ కోపంగా చూసింది.
"ఇష్టం లేకపోతే చావు" అనేసి వెళ్ళిపోయింది విసురుగా.
