Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 30

    "అదిసరే గానీ! ఏదొక పని చేసి డబ్బు సంపాదించుకోవాలని వుంది. పనులెక్కడ దొరుకుతాయి?"

    "పనులేంటి నీ తలకాయ! అలా పనులు దొరికితే మేమంతా ఈ అడుక్కుతినే పనులెందుకు చేస్తాం!"

    "అంటే ఎప్పటికీ పని లేకుండానే వుండిపోతారా?"

    "అంతేమరి! కాపోతే ఒకోసారి ఎలక్షన్లొస్తాయి గదా! అప్పుడు మాత్రం చేతినిండా పనుంటుంది. గోడల్నిండా రంగుతో రాయటం, మీటింగులకెళ్ళి సివర వరకూ కూర్చోటం, ఎలక్షన్ రోజున దొంగ వోట్లేయడం భలే సంపాదించచ్చులే! కిందటెలక్షన్లో నేను పధ్నాలు దొంగ ఓట్లేశా- తెలుసా? ఆ ఒక్కరోజే నూట నలభై రూపాయలు సంపాదించా! ఆ రోజు ఇక్కడోళ్ళందరూ కోడి బిరియానీ తెచ్చుకుని తిన్నాం"

    "మరి మిగతారోజులు?"

    "ఒకోడు ఒకో పని చేస్తూంటారు. ఆ రోజు నీ కోటూ, బూట్లూ లాక్కుపోయి నోళ్ళను చూశావు కదా! వాళ్ళిద్దరూ జేబులు కొడుతుంటారు. నేను ఊరంతా తిరిగి ఈ విరిగిపోయిన ప్లాస్టిక్ సామాను, సీసాలు, అన్నీ ఏరుకొచ్చి పోగేస్తుంటాను. వారానికో రోజు ఒకడు లారీ తీసుకొచ్చి అవన్నీ కొనుక్కు పోతుంటాడు.

    "అదిగో! ఆ గుడిశె ముందు కూర్చుని చేపలు కోస్తోంది చూడు! దాని పేరు రాములమ్మ! స్కూలుకెళ్ళే చిన్న పిల్లలను ఎత్తుకొచ్చివ వాళ్ళ కళ్ళు పీకి మెయిన్ రోడ్ లో వున్న ఆస్పత్రిలో అమ్మేస్తుంది. కొంతమంది పిల్లలకు కిడ్నీ అని ఒకటుంటుందట లోపల- అది కూడా అమ్మేస్తూంటుంది. తర్వాత ఆ పిల్లలను అడుక్కుతినే వాళ్ళకు అమ్మేస్తుంది."

    రాజశేఖరం షాక్ తిన్నాడు.

    "మైగాడ్! అది అలా చేస్తూంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా?"

    "బాగుందయ్యోవ్! ఎవడి పని ఆడు చూసుకోవటానికే టైములేదు. ఇంకోడి సంగతి మనకెందుకు? అప్పుడప్పుడు పోలీసోళ్లొచ్చి దాన్ని తన్ని డబ్బు తీసుకుపోతూంటార్లే!

    ఆ గడ్డపోడున్నాడు చూడు! ఆడు దిక్కుమాలిన శవాలేమయినా దొరికితే మెయిన్ రోడ్ మీద పెట్టి శవాన్ని మునిసిపాలిటీ వాళ్ళకి అప్పజెప్పేస్తాడు- కొంతమంది రోజూ కూలికోసం వెళ్ళి మెయిన్ రోడ్ మీద నిలబడతారు. దొరికితే దొరుకుతుంది. లేకపోతే- నెలకు పదిహేను రోజులు పస్తులుంటారు వాళ్ళు---"


    రాజశేఖరానికి ఇంకా వినబుద్ధి కాలేదు.

    "సరే- నేను వెళ్తున్నాను"

    "ఎక్కడికి?"

    "ఏదయినా పని దొరుకుతుందేమో చూస్తాను-"

    "నీకు పిచ్చెక్కింది! లేపోతే పనికోసం వెతకడమేమిటి? తిరిగి తిరిగి నువ్వే వస్తావులే సాయంత్రానికి!"

    రాజశేఖరం మెయిన్ రోడ్ వేపు నడిచాడు.


    బోరింగ్ పంప్ దగ్గర నిలబడి వేప పుల్లతో పళ్ళు తోమిందో యువతి. మరో ఇద్దరు మొఖం కడుగుతున్నారు.

    "ఏయ్- పిరికినాయాలా! ఇట్రా!" మిగతా ఇద్దరూ పగలబడి నవ్వారు. "ఈడేనా పారిపోయింది రాత్రి?"

    రాజశేఖరం కోపంగా చూశాడామె వేపు ఆమె మొఖం ఎక్కడో చూసినట్లుంది.

    "ఎవర్నువ్వు?"

    "ఓర్నీ! రాత్రిచూసి పొద్దున్నకి మర్చిపోయావా? నేను రంగిని! రాత్రి లాడ్జ్ కొస్తే గొడ్డు బెదిరినట్లు బెదిరి పారిపోయావుగా?"

    రాజశేఖరానికి అప్పుడు గుర్తుకొచ్చింది.

    రాత్రి లాడ్జ్ లో తన పక్కలో కొచ్చి పడుకున్న యువతి.

    ఆమె మొఖంలోనే ఆమె శరీరంలో వున్న జబ్బులన్నీ కనబడుతున్నాయి.

    "ఏయ్! నా జోలికొచ్చావంటే మర్యాదగా వుండదు. పో---"

    అనేసి చకచక నడిచాడు.

    మెయిన్ రోడ్ చాలా బిజీగా వుంది.

    ఎవరిని పనడగాలో, ఎలా అడగాలో తెలీటం లేదతనికి.

    ఎప్పుడూ తనే ఒకరికి ఉద్యోగాలిచ్చే అలవాటు.

    ఓ పెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్ లోకి నడిచాడతను.

    అప్పటికే కస్టమర్స్ తో క్రిక్కిరిసిపోయి వుందది.

    'మేనేజర్' అని రాసి ఉన్న రూమ్ లోకి నడిచాడతను.

    లోపల కూర్చున్న వ్యక్తి ఆశ్చర్యంగా చూశాడు.

    "మే అయ్ కమిన్ ప్లీజ్?"

    "యస్---" అన్నాడతను అనునయంగా.

    రాజశేఖరం లోపలకు నడిచి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

    "ఏం కావాలి?" అడిగాడతను.

    "అయ్ వాంట్ జాబ్! ఏ జాబ్ అయినా ఫర్లేదు- గుమాస్తా, సూపర్ వైజర్స్, సేల్స్ మెన్, ప్యూన్ - అయామ్ రడీ టు డు ఎనీథింగ్---"

    అతని మొహంలో కోపం ముంచుకొస్తోంది.

    "ఓహో! నీకు ఉద్యోగం కావాలా?"

    "అవును! నెలకు టూ థౌజెండ్ రుపీస్ ఇస్తే చాలు! అయ్ విల్ మానేజ్---"

    "అలాగా? చాలా పొదుపుగానే బ్రతుకుతావన్నమాట--"

    "నిజానికి నాకయితే నెలకు యిరవై వేలయినా చాలదు. కానీ చెప్పాను కదా! టు థౌజెండ్ తో మానేజ్ అయిపోతాను."

    "ఏయ్! లేరా ఇక్కడ!" అతనూ కుర్చీలోనుంచి లేస్తూ అన్నాడు.

    రాజశేఖరం స్టన్నయ్యాడు.

    "ఎవర్ని?"

    "నిన్నేరా! బయటకు ఫో ముందు-"

    "దిసీజ్ టూ మచ్! గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్-"

    అతను బటన్ నొక్కాడు. బయట నుంచి ఫ్యూన్ పరుగుతో వచ్చాడు.

    "ఏమిటి సార్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS