"వీడిని బయటకు గెంటు-"
"బాస్టర్డ్! నన్ను బయటకు గెంటమంటావా? నీ అంతు చూస్తాన్రా" అంటూ అతని చొక్కా పట్టుకోబోయాడు.
ప్యూన్ చటుక్కున మధ్యకొచ్చి రాజశేఖరాన్ని బయటకు తోసేశాడు.
"పోరా సాలే-ఫో బయటకు"
"ఏయ్! మీద చేయి వేశావంటే చంపేస్తాను" అతని చేయి విదిలించి కొట్టాడు.
ప్యూన్ కొంచెం భయపడ్డాడు.
రాజశేఖరం బయటికొచ్చేశాడు.
పనుంటే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదనాలి. అంతేగానీ తనతో అంత ఇన్సల్టింగుగా మాట్లాడి బయటకు గెంటించాల్సినంత పని తనేం చేశాడో తెలీటంలేదు.
మరో పెద్ద ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఫరమ్ కనిపించింది అక్కడికి దగ్గర్లోనే.
అతనికి ఒకసారిగా ఆశ కలిగింది.
అందులో తప్పకుండా తనకు ఉద్యోగం దొరుకుతుంది.
తనకు వాళ్ళకవసరమయిన క్వాలిఫికేషన్స్ అన్నీ వున్నాయి.
గేటు దగ్గర వాచ్ మెన్ ఆపేశాడు.
"ఏం కావాలి?"
"MD గారిని చూడాలి."
"ఎందుకు?"
"ఉద్యోగం కోసం!"
"ఇంటర్వ్యూ లెటర్ వుందా?"
"లేదు"
"అయితే లోపలికెళ్ళడానికి వీల్లేదు"
అతనికేం చేయడానికి తోచలేదు.
రోడ్డుకి అవతలివేపు బస్ స్టాప్ లో నిలబడి ఆ వాచ్ మెన్ వంకే చూడసాగాడు. అరగంట తర్వాత అతనెదురు చూస్తున్న అవకాశం వచ్చింది.
వాచ్ మెన్ ఆ పక్కనే ఉన్న పాన్ డబ్బా దగ్గరకెళ్ళి ఏదో కొంటున్నాడు.
రాజశేఖరం అమాంతం రోడ్డుకి అడ్డంగా పరుగెత్తి మెరుపు వేగముతో ఆఫీస్ రూమ్ లోకి జొరబడ్డాడు.
ఎదురుగా MD రూమ్ కనబడుతూనే వుంది.
అమాంతం డోర్ తెరుచుకుని లోపలికెళ్ళాడు.
లోపల MD వళ్ళో అతని సెక్రటరీ కూర్చునుంది. M.D ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నాడు.
రాజశేఖరాన్ని చూడగానే ఇద్దరూ అదిరిపడి కౌగిలినుంచి విడివడ్డారు.
తను చాలా ఆక్ వార్డ్ పరిస్థితిలో ఇరుక్కున్నట్లు రాజశేఖరానికి అర్ధమయ్యింది.
"అయామ్ సారీ" అన్నాడు చప్పున కోలుకుని.
సెక్రటరీ పిల్ల బయటకెళ్ళిపోయింది కంగారుగా.
"ఎవర్నువ్వు?" కోపంగా అడిగాడు ఎమ్ డి.
"నా పేరు రాజశేఖరం! కన్సల్టింగ్ ఇంజనీర్ గా నాకేమయినా జాబ్ దొరుకుతుందేమోనని వచ్చాను."
"నువ్వు కన్సల్టింగ్ ఇంజనీర్ వా?" నమ్మలేనట్లు అడిగాడు.
"ఎస్! నా క్వాలిఫికేషన్స్ ఎమ్ ఎస్, ఎం.బి.ఏ."
"ఎం ఎస్ అండ్ ఎం.బి.ఏ. నా?"
"ఎస్!"
"నువ్వా?"
"ఎస్!"
అతను వెంటనే బటన్ నొక్కి ఫోనందుకున్నాడు.
ఎవరిదో గొంతు వినిపించింది ఫోన్ లో.
"త్వరగా నా రూమ్ కి రా" అని ఫోన్ పెట్టేశాడు.
"ఇన్ ఫాక్ట్ - అమెరికాలో నాకు స్వంతంగా ఒక ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ వుంది. కానీ నేను కొన్ని కారణాల వల్ల ఇండియా రావాల్సి వచ్చింది. అఫ్ కోర్స్! ఎక్కువ కాలం యిక్కడుండను లెండి. ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టి, ఎగెయిన్ ఐ వాంట్ టు గో టు అమెరికా."
"ఐ సీ"
"అన్నట్లు నాకు ఎక్కువ జీతం కూడా అక్కర్లేదు. రెండు మూడు వేలు చాలు. ఐ కెన్ మానేజ్"
"ఓహో! అలాగా?"
"నా సీట్ ఎక్కడో చెప్తే ఇప్పుడే జాయినవుతాను. నాకేం జాయినింగ్ టైమ్ కూడా అక్కర్లేదు."
"ఆహా! మరింకేం! జాయినవ్వచ్చు- ఇంతకూ మీ సర్టిఫైకెట్స్ తెచ్చారా?"
రాజశేఖరం నిరాశపడ్డాడు.
తనా విషయమే మర్చిపోయాడు.
సర్టిఫికెట్లు చూడందే వుద్యోగం ఎవరిస్తారు?
"సర్టిఫికెట్స్ ప్రస్తుతానికి లేవు. మూడు నెలల తర్వాత తప్పకుండా తెచ్చి చూపిస్తాను ప్రామిస్!"
"మూడు నెలల తర్వాతా?"
"అవును అంతవరకూ ఒబ్లయిజ్ చేస్తే...."
వాచ్ మెన్ హఠాత్తుగా తలుపు తెరుచుకుని లోపలికొచ్చి సెల్యూట్ కొట్టాడు.
"ఈ పిచ్చాడినెందుకు లోపలకు రానిచ్చావ్?"
అప్పుడు చూశాడు వాచ్ మెన్ అతనిని. చూస్తూనే వులిక్కిపడ్డాడు.
"వీడెలా వచ్చాడు! ఇందాకొకసారి వస్తే లోపలకెళ్ళడానికి వీల్లేదని గెంటాను కదా."
ఎమ్ డి మొహం కోపంతో జేవురించింది.
"నీ కాపలా అంత అద్భుతంగా అఘోరించిందన్నమాట ఇడియట్! అడ్డమైనాడినీ లోపలకు పంపడానికి నీకు బుద్ధుండఖ్ఖర్లేదూ? వాడి అవతారం చూస్తే తెలీటంలేదూ? వీడు పెద్ద పిచ్చాడని? నిన్ను డిస్మిస్ చేస్తాను యింకోసారిలా జరిగిందంటే."
