రాజశేఖరం షాక్ తిన్నాడు.
"అంటే అంతవరకూ నిద్రపోడానిక్కూడా వీల్లేదా?"
గడ్లపాడు పగలబడి నవ్వాడు.
"ఓర్నీయవ్వ.... నువ్వేం జమీందారువేరా రోజూ నిద్రపోడానికి? ఒరేయ్! మనలాంటి బిచ్చగాళ్ళకు నిద్రేమిట్రా? నేను నిద్రపోయి మూడు నెలలయి పోయింది తెలుసా?"
"అంటే మూడు నెలల క్రితం పడుకున్నావన్నమాట! ఎక్కడ పడుకున్నావో చెప్పు! నేను అక్కడికయినా వెళ్తాను"
"ధర్మాసుపత్రిలో! నీయవ్వ! భలే సుకంగుంటాదిరా అక్కడ. ఆ పరుపూ, పైన ఫ్యానూ కాపోతే కొంచెం ఎలుకల బాధా, నల్లుల బాధా, దోమల బాధా ఎక్కువనుకో. అయితేనేం? సుభ్రంగా కాపీ, ఫలహారం, భోజనం నిజం చెప్తున్నా మనలాంటోళ్ళకది దేవాలయంరా!"
"అయితే మరి అక్కడే ఎందుకుండటం లేదు?"
"దొంగనాకొడుకులు.... మన ముఖాలు చూడగానే కనిపెట్టేస్తారు. తిండి కోసం, పడక కోసం,వచ్చామని ఎలా తెలుస్తుందో ఏమో, వాచ్ మెన్ తో బయటకు గెంటించేస్తున్నారు"
రాజశేఖరం నిరుత్సాహపడ్డాడు.
తను కనకారావుతో అనవసరంగా పందెం వేశాడేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది.
ఒక్క రోజుకే ఇన్ని అవస్థలు పడుతుంటే వంద రోజులు ఎలా గడపటం?
తను బీదాళ్ళ గురించి అనుకున్నదొకటి.... ఇక్కడ వాళ్ళు అనుభవిస్తున్న జీవితం మరోటి.
సుఖంగా పడుకోవడానికి కూడా చోటు లేని బ్రతుకులు.
"ఏంట్రా అలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? రా! కూర్చో! వెచ్చగా వుంటుందిక్కడ. కనీసం ఇంకో రెండు గంటల వరకూ మండటానికి చెత్త సరిపోతుందిలే!"
రాజశేఖరానికి ఆ గడ్డపాడు దేవుడిలా కనిపించాడు.
పెళ్ళి మంట దగ్గర కూర్చున్నాడు.
అంతవరకూ వణికించిన చలి హఠాత్తుగా దూరమయిపోయింది.
ఆహా! జీవితంలో ఇంత సుఖం ఎప్పుడయినా అనుభవించాడా?
ఆ మంట వేడి కాళ్ళకు తగులుతుంటే అంతవరకూ పీడిస్తున్న కాళ్ళ నొప్పులు కొంచెం కొంచెంగా దూరమవుతున్నాయి.
గడ్డపాడు పాట ఎత్తుకున్నాడు.
"తల్లి దండ్రులు లేకనే భువిమీద పడ్డాము
ఈ బతుకేమి బతుకురా రామా!
తిండి తిప్పలు లేక గాలితిని పెరిగాము
ఈ బతుకేమి బతుకురా రామా!
ఎండకెండాము వానలో నానాము
గూడనేది ఎరుగము రామా!
చిన్న నీడనేది ఎరగమురా రామా!
ఆ పాట వింటూంటే రాజశేఖరం మనసంతా కలచివేసినట్లయింది. నిజంగా ఎంత దుర్భరంగా వున్నాయి వీళ్ళ బ్రతుకులు? రోజూ ఆ మెయిన్ రోడ్ మీద నుంచే తను కార్లో తిరుగుతున్నా రోడ్ కి పక్కనే జీవితాలున్నాయని ఎలా తెలుసుకోలేక పోయాడు?
ఎందుకు పుట్టామో, ఎక్కడ చస్తామో
ఎవరు చెప్పగలర్రా రామా
చావుకీ, బతుక్కీ తేడా ఎరగమురా రామా."
రాజశేఖరానికి నిద్ర మూసుకొచ్చేసింది. అక్కడే మట్టిలోనే వాలిపోయి ముడుచుకుని నిద్రలో మునిగిపోయాడు.
ఉదయం ఏడవుతుండగా తెలివి వచ్చింది రాజశేఖరానికి.
చలి ఎక్కువయి పోవడంతో నిద్ర పాడయిపోయింది.
"బెడ్ కాఫీ!" అన్నాడు అలవాటు ప్రకారం కళ్ళుమూసుకునే చెయ్యిచాపుతూ.
గడ్డపాడు వులిక్కిపడ్డాడు అతనికేమీ అర్ధంకాలేదు.
"బెడ్ కాఫీ" మళ్ళీ అన్నాడు రాజశేఖరం.
కాఫీ అన్నమాట అర్ధమయింది గడ్డపాడుకి.
లాగి రాజశేఖరం చేతిమీద కొట్టాడు.
"నీయవ్వ! కాఫీ కావాలంట కాఫీ, ఒరేయ్! పేద్ద దొరబాబులాగా లేవగానే కాఫీ అంటున్నావు.... నీకేం ఇక్కడ నౌఖర్లున్నారనుకున్నావా? నా కొడకా ఆ సోకులకేం తక్కువ లేదురా."
రాజశేఖరం ఉలిక్కిపడి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు.
గడ్డపాడు లేచి వడివడిగా బోరింగ్ పంప్ దగ్గరకెళ్తున్నాడు. అప్పటికే పెద్ద క్యూ వుందక్కడ.
చాలామంది వేప పుల్లలతో పళ్ళు తోముకుంటున్నారు. దానికి కొద్ది దూరంలోనే పబ్లిక్ లావెటరీ!
తమ నౌఖర్లు చాలామంది వేప పుల్లలతో పళ్ళు తోముకోవటం తను చూశాడు. బ్రష్, టూత్ పేస్ట్ లేకుండా ముఖాలు ఎలా కడుక్కుంటారో తనకో పట్టాన అర్ధమయ్యేదికాదు.
కానీ ఇప్పుడు తనూ ఆ సిస్టమ్ ఫాలో అవక తప్పదు.
దగ్గర్లోనే వున్న వేపచెట్టు దగ్గరకెళ్ళి ఓ వేప పుల్ల విరుచుకుని దాంతో పళ్ళు తోముకోవటం మొదలు పెట్టాడు.
గంటసేపు పట్టింది ఆ కార్యక్రమం ముగుంచుకుని బయటపడేప్పటికి.
అప్పటికే ఆకలి దహించి వేస్తోంది.
తన భవనంలో అయితే ఈపాటికి కాఫీ, ఫలహారాలు చేయటం కూడా అయిపోయేది.
కొద్దిదూరం నడిచేసరికి చెట్టుకింద ఓ 'టీ' బండి కనిపించింది. అందరికీ ఆ బండి ముసలమ్మ 'టీ' యిస్తోంది.
రాజశేఖరానికి కనీసం ఆ 'టీ' అయినా తాగాలనిపించింది.
ఒకసారి ఆఫీస్ లో వుండగానే నౌఖరుని 'టీ' తెమ్మంటే ఇరానీ హోటల్ 'టీ' తెచ్చాడని వాడిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఇరానీ హోటల్ 'టీ' హైజనిక్ గా వుండదని తన అనుమానం.
బండి దగ్గరకొచ్చి నిలబడ్డాడతను.
"చాయ్ కావాలా?" అడిగింది ముసలమ్మ.
"అవును!"
"ముప్ఫయ్ పైసలివ్వు."
జేబులో పర్స్ కోసం చెయ్యి పెట్టి ఖాళీ చెయ్యి బయటకు తీశాడు.
"డబ్బేదయ్యా?"
రాజశేఖరానికేం చెప్పాలో తెలీలేదు.
"లేదు"
"పైసల్లేకుండా ఫుల్ 'టీ' చాయ్ తాగుదామనుకున్నావా? ఇంత వయసొచ్చింది సిగ్గులేదు నీకు? ఫో ఈడకెళ్ళి."
రాజశేఖరానికేం చేయాలో తోచలేదు.
ఇక లాభంలేదు. ఎలాగోలా డబ్బు సంపాదిస్తేగానీ తిండి దొరకదు.
డబ్బు సంపాదించాలంటే కష్టపడి పని చేయాల్సిందే.
ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదే సమస్య.
మెయిన్ రోడ్ వేపు నాలుగు అడుగులు వేసేసరికి కళ్ళు తిరిగి ధబేల్ మని పడిపోయాడు. తిరిగి లేచి కూర్చుంటుంటే అందరూ నవ్వటం వినిపించింది. అందులో తన కాలికి కట్టుకట్టిన యువతి కూడా వుంది.
"నీయవ్వ! పొద్దున్నే గుడుంబా కొట్టమందెవర్రా నిన్ను? నాలుగు డబ్బులు దొరికితే సాలు! నాయాళ్ళందరూ తాగటమే" అందామె.
రాజశేఖరానికి కోపం ముంచుకొచ్చింది.
"ఏయ్! 'రా' 'గీ' అన్నావంటే మర్యాదగా వుండదు. అయినా నేను గుడంబా తాగానని ఎవరు చెప్పారు?"
"తాగందే ఎవడయినా దభేల్ మని పడిపోతాడా?"
"నిన్నటి నుంచీ కడుపులోకి ఏమీ లేక కళ్ళు తిరిగినాయి."
ఆమె నవ్వు ఎండిపోయింది.
"ఏం ఎవ్వడూ ధర్మం చేయలేదా?"
"ఛీ! నేనేం ముష్టాడిననుకున్నావా?"
ఆమె విరగబడి నవ్వసాగింది.
"ఓర్నీయవ్వ! ఎంత కోపమొచ్చిందిరా నాయనా నీకు! ముష్టాడివి కాపోతే నువ్వేం జమీందారువా? అందుకే రోజు ముఖం ఓసారి అద్దంలో చూసుకోరా అని చెప్పాను?"
"ఇదుగో.... ఇంకోసారి 'రా' అన్నావంటే వూరుకోను?" పిడికిళ్లు బిగించి కోపంగా అన్నాడు.
"అంటాను.... ఏం చేస్తావేంటి?" దగ్గరకొచ్చి ఛాతీ విరిచి నిలబడింది.
రాజశేఖరానికేం చేయడానికి తోచలేదు.
"మెడ పిసుకుతాను. జాగ్రత్త" అన్నాడు బెదిరింపుగా.
ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది.
"ఇలా అడ్డమయినోడితో మెడ పిసికించుకుంటే ఏనాడో చచ్చేదాన్ని- ఏయ్! నా సంగతి నీకు తెలీదనుకుంటా ఇంకా! ఇద్దరు గూండాలు అర్ధరాత్రొచ్చి నన్ను బలవంతం చేయబోతే ఒకడి ఆయుధాన్ని నొక్కి పారేశాను. నా కొడుకు అక్కడికక్కడే కోడిలాగా కొట్టుకుని చచ్చాడు. రెండోవాడు ఇంక పరిగెత్తాడు సూడు! మళ్ళీ జన్మలో ఎవడూ మన జోలికి రాలే!"
రాజశేఖరం బెదిరిపోయాడు.
"అందుకని- నాతో పెట్టుకోకు! పోనీ నీ పేరేంటో చెప్పు! 'రా' అనకుండా పేర్తో పిలుస్తా!"
"నా పేరు రాజశేఖరం---"
"ఏడ్చావ్! పిచ్చివాగుడు వాగకు! అడుక్కుతినే నాయాలక్కూడా అంత మంచి పేరుంటుందేమిటి? నిజం చెప్పహ---"
"రాజు---"
"అవున్లే! అడుక్కుతినే వాళ్ళందరికీ ఇలాంటి పేర్లే పెట్టుకోవాలనుంటుంది."
"నీ పేరేంటి?" అడిగాడు రాజశేఖరం.
"సోనీ--- పేరు బాగుందా?"
"బాగానే వుంది."
"అదిసరే గానీ నిజంగానే ఆకలితో కళ్ళు తిరిగి పడ్డావా ఇందాక?"
"అవును!"
"అంటే ఇంతకు ముందెప్పుడూ ఇలా పస్తులుండటం అలవాటు లేదా?"
"లేదు---"
సోనీ టీ బండి ముసలిదాని వేపు తిరిగింది.
"ఏయ్! ఈడికి ఒక 'టీ' అంట ఇవ్వు! డబ్బు నేనిస్తాను."
ముసల్ది 'టీ' తెచ్చి రాజశేఖరాని కిచ్చింది.
'టీ' తాగుతుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తున్నట్లనిపించింది.
భోజనం లేకపోయినా ఫర్లేదు గానీ 'టీ' కాఫీలు తనకు బాగా అలవాటు. దానికి తోడు రోజూ రాత్రి ఓ పెగ్గు ఫారిన్ విస్కీ తాగే అలవాటు కూడా వుంది.
'టీ' తాగి సోనీవేపు కృతజ్ఞతతో చూశాడతను. అతని కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయి-- ఎంత గొప్ప సహాయం చేసింది?
"థాంక్యూ" అన్నాడు అభిమానంతో.
"అంటే?"
"నీకు చాలా ఋణపడి వుంటాను అని!"
"అచ్చం సినిమాల్లో మాట్టాడతన్నట్లు మాట్టాడుతున్నావే! ఒళ్ళు బాగా పొగరెక్కినట్టుంది నీకు-" నవ్వుతూ అంది.
