పాతికేళ్ళ యువతి తనమీద ఓ కాలువేసి నెమ్మదిగా గుండెలమీదకి పాకుతోంది.
అదిరిపోయి లేచి కూర్చున్నాడు.
ఆమె నవ్వేసింది. గారపట్టిన ఆమె పళ్ళు చూసేసరికి రాజశేఖరానికి వళ్ళంతా పురుగులు పాకినట్లయింది.
"ఏమిటా కంగారు? నిన్నేం తినెయ్యనులే! పడుకో" ఆమె రాసుకున్న చీప్ సెంటువాసన వాంతి కలిగిస్తోంది అతనికి.
"నా మంచం మీద నీకేం పని? లే ఇక్కడినుంచి" కోపంగా అన్నాడు.
"అరెరె! మగాడివి కానట్టు మాట్లాడతావేమిటి? అయిదురూపాయిలివ్వు చాలు"
"ఏమిటి అయిదు?"
"అన్నీ అలా కారాలూ, మిరియాలూ నూరతావేం? పోనీ నాలుగు రూపాయలివ్వు"
"ముందిక్కడినుంచి వెళ్తావా లేదా?"
"ఇదిగో-ఇవాళ నీదే బోణి! నాలుగివ్వకపోతే పోనీ ఎంతో కొంత ఇచ్చి త్వరగా కానీ. పొద్దున్నుంచీ అన్నంలేదు. నిన్న రాత్రి కూడా ఒక్కడు దొరకలా" అతని చేయిపట్టుకుని మంచం మీదకు లాగింది నవ్వుతూ.
రాజశేఖరం వళ్ళు ఆ స్పర్శతో గగుర్పొడిచింది.
ఇంకొక్క క్షణం కూడా అక్కడ వుండబుద్ధి కాలేదు.
వడివడిగా నడుస్తూ లాడ్జింగ్ బయటకు నడిచాడు.
వెనుకనుంచీ ఆమె అరుస్తూనే వుందికానీ వినిపించుకోలేదు.
రాత్రి పన్నెండు దాటివుంటుందనిపించింది.
విపరీతమయిన చలి!
ఇదే జీవితంలో మొదటిసారి ఇంత చలిని ఎదుర్కోవటం.
ఆ చలిలో రాత్రంతా గడిపితే పొద్దున్నకల్లా బిగిసిపోయి చావటం ఖాయం మరి ఆ ఫుట్ పాత్ మీదా, ఈ చెట్లకిందా పడుకునేవాళ్ళంతా యీ చలిలో ఎలా తట్టుకుంటున్నట్లు?
దూరంగా గుడి కనబడుతోంది అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ గుళ్ళో పడుకోవచ్చేమో!
ఈ స్లమ్ ని ఆనుకుని ఒక గుడి వున్నట్లే తెలీదు తనకి.
పరుగుతో గుడి దగ్గరకు చేరుకున్నాడు. లోపల చాలామంది పడుకుని వుండటం కనబడుతూనే వుంది. తనూ లోపలకెళ్ళబోతూంటే ఆ పక్కనే మంటపం మీద కూర్చున్న పూజారి దిగి ఎదురొచ్చాడు.
"ఏయ్! ఎవర్నువ్వు? ఎక్కడికొస్తున్నావ్?"
పూజారిని చూస్తూనే గుర్తుపట్టాడు రాజశేఖరం.
తను అమెరికా నుంచి వచ్చాక రెండు మూడుసార్లు తనను డబ్బు అడగడానికొచ్చాడు. తన తాత కట్టించిన గుళ్ళో పూజారిననీ, గుళ్ళో పూజలకూ, ప్రసాదాలకూ తన తండ్రి ప్రతి సంవత్సరం పాతికవేల రూపాయలు ఇచ్చేవాడనీ.... అంచేత తనూ ఆ విధంగానే సాయం చేయాలనీ కోరాడు.
తను జాలిపడి పాతికవేల నుంచీ యాభైవేలకు పెంచాడా మొత్తాన్ని.
ఆరునెలలకోసారి పాతికవేలు అతనికి ముట్టే ఏర్పాటు చేశాడు.
అంటే తన తాతగారు కట్టించిన ఆ గుడి ఇదేనా?
"మాట్లాడవేరా? ఎందుకొస్తున్నావ్ లోపలికి?" తాగిన వాసనగుప్పు మంటోంది.
రాజశేఖరానికి కోపం ముంచుకొచ్చింది.
తన ఎదురుగా నిలబడ్డప్పుడు ఎంత వినయంగా, ఎంత దీనంగా మాట్లాడతాడీ రాస్కెల్! అయినాగానీ తమాయించుకుని మాట్లాడాడు.
"ఈ రాత్రికిక్కడ పడుకోవచ్చేమోనని"
"ఇదేమన్నా ధర్మసత్రంబే? ఇది గుడిరా సాలే! బిచ్చసోండ్లు ఆరామ్ జేసే జాగా కాదు. ఫో బయటకు"
"మరి ఆళ్ళందరూ పడుకున్నారుగదా?"
ఆళ్ళు పైసలిచ్చిన్రురా! నువ్వూ రెండ్రూపాయలిస్తావా మరి?"
"ప్రస్తుతం డబ్బేమీ లేదు."
"నీ తాత గుడి అనుకున్నావ్ బే! బగర్ పైసలు ఈడ గుజరాయించానికి. బయటకుపోరా నంగా బాడుకవ్" అంటూ రాజశేఖరాన్ని మెడబట్టి బయటకు గెంటబోయాడు.
రాజశేఖరానికి కోపం ఆగలేదు.
"బాస్టర్డ్! గుడి నా తాతది కాకపోతే నీ తాతదనుకున్నావురా? ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడేవాడివి నువ్వేం పూజారివిరా? రాస్కెల్! నీ అంతు తేలుస్తా" అంటూ పిడికిలి బిగించి అతని పొట్టలో బలంగా కొట్టాడు.
పూజారికి కళ్ళు బైర్లుకమ్మినాయి.
"అబ్బా!" అంటూ అక్కడే నేలమీద కూలిపోయాడు బిగ్గరగా కేకలు వేస్తూ.
రాజశేఖరం అక్కడినుంచి బయటికొచ్చేశాడు.
వస్తూంటే కనిపించింది శిలాఫలకం.
దానిమీద తన తాతగారి పేరు కనబడుతోంది.
చలి మరింత ఎక్కువయిపోయింది.
వీధిలో ఒక్కరు కూడా నడవటంలేదు.
ఇంచుమించుగా స్లమ్ చివరికొచ్చేశాడతను.
హఠాత్తుగా సిమెంట్ పైప్ ల మధ్య మంట కనిపించింది.
మంట పక్కనే ఓ ఆకారం చలి కాచుకుంటూ కనిపించింది.
ఆనందంగా అక్కడకు చేరుకున్నాడు రాజశేఖరం.
సిమెంటు పైప్స్ లో పడుకుంటే చాలావరకూ చలి బాధ తప్పించుకోవచ్చు. కానీ సిమెంటు పైపులన్నీ జనంతో నిండిపోయి వుండడం చూసేసరికి అతను నిరాశపడిపోయాడు.
మంట దగ్గర చిత్తుకాగితాలతో చలిమంట వేసుకుంటున్న గడ్డపు వ్యక్తి రాజశేఖరాన్ని చూశాడు.
"ఏంట్రా.... పడుకోటానికి స్థలం వెతుకుతున్నావా? నీయవ్వ-నీకన్న ముందునుంచీ కాసుక్కూచున్నవాడిని నేనున్నాన్రా! ఇక్కడున్నోళ్ళలో ఎవడయినా చస్తే ఆ జాగా నాకొస్తది ముందు. రెండోవాడెవడయినా ఎగిరిపోతే అప్పుడు నీ నెంబరొస్తుంది. అదిగో ఆ చివరి సిమెంటు పైపుంది చూశావా? అందులో ఓ ముసలోడున్నాడు ఆడికి జబ్బు! రేపో ఎల్లుండో తప్పకుండా పోతాడు. ఈ మూల సిమెంటు పైపులోడికి క్యాన్సర్. నెల రోజులు టైమిచ్చారంట ఆస్పత్రిలో. నీకు అదే దొరుకుతుందనుకుంటా."
