Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 27

    ఏమీ చేయడానికి తోచక మళ్ళీ స్లమ్ వేపు నడిచాడతను. మెయిన్ రోడ్ ని ఆనుకునే లోపలివేపుకి కనిపించిందో లాడ్జింగ్.

    "తిరుమల లాడ్జీ! మడతమంచములు అద్దెకివ్వబడును" అని రాసి వుంది.

    అలాంటి లాడ్జీలు కూడా వుంటాయని అప్పుడే తెలిసింది రాజశేఖరానికి.

    మంచం మీద పడుకుని నిద్రపోవాలన్న కోరిక అతనిని వూగించి వేయసాగింది. మంచానికి అద్దె కట్టటానికి తన దగ్గర డబ్బు లేదని తెలిసినా ఒకసారి ఆ లాడ్జీ ఓనర్ని బ్రతిమాలితే అరువు యిస్తాడేమోనన్న ఆశతో లాడ్జ్ లోకి నడిచాడు.

    శిధిలావస్థలో వున్న రేకుల షెడ్ అది.

    ఆ హాల్లో వరుసుగా పది మంచాలు వేసి వున్నాయి.

    కొంతమంది నేలమీదే పడుకుని నిద్రపోతున్నారు.

    బల్ల దగ్గర ఓ స్టూలు వేసుకుని ఓ ముసలతను కూర్చుని వున్నాడు.

    "ఏం కావాలి?" అడిగాడతను.

    "ఈ రాత్రికి ఓ మంచం..."

    "పది రూపాయలు యివ్వు" మాట పూర్తికాకుండానే అన్నాడు.

    రాజశేఖరానికి ఆశ్చర్యం కలిగింది.

    పది రూపాయలకే బెడ్ దొరికే లాడ్జింగ్ లు కూడా వుంటాయని అతనికి తెలీదు.

    రోజుకి రెండువేల రూపాయల స్టార్ హోటల్స్ తో వీటిని ఎలా పోల్చాలో కూడా తెలీటం లేదు.

    "మీకో విషయం చెప్పాలి!" కొంచెం జంకుతూనే అన్నాడు రాజశేఖరం.

    "ఏమిటిది?"

    "నేను కోటీశ్వరుడిని! కొన్ని పరిస్థితుల్లో యిక్కడ వుండాల్సి వచ్చింది. ప్రస్తుతం నువ్వు ఒక మంచం వందరోజులపాటు నాకు కేటాయించావంటే.... ఆఖరి రోజున నీకు లక్ష రూపాయలిస్తాను- ఏమంటావ్?"

    అతను చాలా ప్రేమగా రాజశేఖరం వేపు చూశాడు.

    "అలాగా! చాలా గొప్ప రహస్యం చెప్పావు. ఓ పని చేద్దాం! నువ్వు ఆ రోజులయాకేరా! అప్పుడు నీకు ఒకేసారి వందమంచాలిస్తాను- సరేనా?"

    "ఇదిగో! నేను జోక్ చేయటంలేదు. నేను నిజంగానే కోటీశ్వరుడిని! ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరం పేరు విన్లేదూ? అది నేనే!"

    "ఓహోహో! మరి నేనెవరినో తెలుసా? బిర్లాని! ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ బిర్లా! వెళ్ళెళ్ళు! నీయమ్మ. ప్రతికొడుకూ ఫోజులు కొట్టటమే.... ఫో! ఇంకా చూస్తావేంటి?"

    "షటప్! బాస్టర్డ్! ఇష్టం వుంటే యివ్వు, లేకపోతే లేదు. పిచ్చిగా వాగావంటే తంతాను."

    "పోపోరా దొంగనాయాలా. ఫో ముందు"

    రాజశేఖరం వెనక్కు తిరుగుతూవుంటే ఆ పక్కనే వున్న మంచం దగ్గర నుంచీ ఇద్దరు మాట్లాడుకోవటం వినిపించింది.

    ఆ గొంతు ఎక్కడో విన్నాడు.

    చటుక్కున వెనక్కు తిరిగి చూశాడు.

    పేకాడుతున్నారు ఆ ఇద్దరూ మధ్యలో సారా సీసాలు!

    మొహాలు చూడగానే గుర్తుకొచ్చేసింది.

    తనను ఎటాక్ చేసి కోటూ, బూటూ, వాచీ ఎత్తుకుపోయింది వాళ్ళిద్దరే.

    అమాంతం వెనక్కు తిరిగి పరుగుతో వాళ్ళను చేరుకొని ఇద్దరి చొక్కాలూ పట్టుకుని పైకి లేపేశాడు.

    "బాస్టర్డ్ నా కోటూ, బూటూ ఎత్తుకుపోతార్రా మీరు? మీ ఇద్దరినీ మర్డర్ చేస్తాను-రాస్కెల్స్" అంటూ కోపం పట్టలేక కిందవున్న సారా సీసా చేతిలోకి తీసుకున్నాడు.

    అతని కోపం చూసి ఇద్దరూ బెదిరిపోయారు.

    "గలత్ అయిపోయిందన్నా! మాఫ్ కరో" అంటూ ఠక్కున కాళ్ళమీద పడిపోయారు.

    "మర్యాదగా నా బట్టలూ, బూట్లూ, వాచీ అన్నీ నాకు తెచ్చియ్యండి"

    ఇద్దరూ మొఖాలు చూసుకున్నారు.

    "ఇంకా అయ్యేడకెళ్ళి వస్తయన్నా! ఇగో- నీ కోటు, బూటు అమ్మి ఈ బాటిల్ తెచ్చినా! నీ వాచీ అమ్మి పేక తెచ్చినా-బిరియానీ తెచ్చినా"

    రాజశేఖరం వాళ్ళను వదిలేశాడు.

    వాళ్ళను తన్నినా లాభంలేదింక.

    "అన్నా! జరిగిందేదో జరిగిపాయె! నువ్వు యీ రాత్రి పండానికి మంచం గురించి కోషిష్ జేస్తున్నావు గదా! మా మంచం నీకిస్తాం! తీస్కో"

    రాజశేఖరానికి ఆ ఆలోచన వచ్చింది.

    కనీసం ఈ ఒక్కరోజయినా సుఖంగా పడుకుంటే తరువాతసంగతి తరువాత చూడవచ్చు.

    "ఆల్ రైట్-ఫోండిక్కడనుంచి"

    ఇద్దరూ బాటిల్స్, పేక తీసుకుని బయటికెళ్ళిపోయారు.

    రాజశేఖరం ఓసారి ఆ మంచంవేపు చూశాడు.

    అంతా మరకలతో, మురికితో నిండిపోయి వుంది.

    ఇదే తనింట్లో బెడ్ షీట్ కొంచెం నలిగి వున్నా నౌఖర్లను డిస్మిస్ చేసినంత పనయ్యేది.

    గత్యంతరం లేక అయిష్టంగానే దానిమీద పడుకున్నాడు.

    పడుకోగానే నిద్ర ముంచుకొచ్చేసింది. మొహంమీద ఏదో ఎగిరిపడి నట్లనిపించగానే అదిరిపడి లేచి కూర్చున్నాడు. బొద్దింకలు ఆ హాలంతా పిచ్చుకల్లా ఎగిరిపడుతున్నాయి అందరిమీదా. అందరూ లేచి వాటిని వేటాడి చంపుతున్నారు.

    తనూ రెండు బొద్దింకలను వేటాడాడు రాజశేఖరం.

    మళ్ళీ రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడో లేదో పక్కనే ఇంకెవరో పడుకున్నట్లనిపించి ఉలిక్కిపడి కళ్ళుతెరచి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS