రాత్రిళ్ళు తనకు బ్రెడ్, ఆమ్లెట్ తినడం అలవాటు.
తను తప్పుపని చేశాడు.
రాత్రికి ఇంటినుంచే ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకోవలసింది.
భోజనం ఉండదన్న విషయం గుర్తుకి రాగానే ఆకలి మరింత విజృంభించింది. కాళ్ళనొప్పులు ఎక్కువయిపోయినాయి.
తన జన్మలో నడువలేదింత దూరం.
దూరంగా మెయిన్ రోడ్డు కనబడుతోంది.
రంగురంగుల లైట్లతో, వాహనాల రద్దీతో షాపింగ్ కాంపెక్స్ లతో-
ఎందుకో ఆ స్లమ్ నుంచి పారిపోయి ఆ మెయిన్ రోడ్డు చేరుకోవాలనిపించిందతనికి! తను ఆ జీవితానికి చెందిన వాడన్న ఫీలింగ్.
ఈ మురికి గుంటలూ, ఈ పాడుబడ్డ ఇళ్ళకూ, ఈ దుర్గంధానికీ, ఈ దరిద్రానికీ దూరంగా వుండాలి తను.
అతి కష్టంమీద నడిచి మెయిన్ రోడ్డు చేరుకున్నాడతను.
ఇంక నడవలేక ఫుట్ పాత్ మీద కూర్చోవటం చాలా అసహ్యం కలిగించింది. అక్కడే వుచ్చలు పోసేవాళ్ళూ, ఉమ్మి వేసేవాళ్ళూ-
అయినా తప్పదు.
ఇంకొక్క అడుగు కూడా వేసే స్థితిలో లేడు తను.
అయితే ఆ నరకం కంటే యిక్కడనయం.
కూర్చునేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. తనకు తెలీకుండానే నిద్రతో కళ్ళు మూసుకుపోతున్నాయి.
తనకే ఆశ్చర్యంగా వుంది.
రోజూ రాత్రి ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటేనేగానీ నిద్రపట్టేది కాదు. ఇవాళ అది లేకుండానే కళ్లెలా మూసుకుపోతున్నట్లు?
మెల్లగా ఆ ఫుట్ పాత్ మీదే పడుకోవాలనిపిస్తోంది.
కానీ మనసు వప్పుకోవడం లేదు.
ఎలా పడుకోగలడు?
ఆ దుమ్ము, ధూళి, ఆ అపరిశుభ్రత....
ఆలోచిస్తుండగానే నిద్రపట్టేసింది.
గట్టిగా నడుము మీద ఏదో తగిలినట్లయి కళ్ళు తెరిచాడు.
ఎదురుగ్గా చింతమొద్దులా వున్న వ్యక్తి నిలబడి వున్నాడు. తన నడుము మీద వాడు తన్నాడనడానికి నిదర్శనంగా వాడి కాలు యింకా తన మీదే వుంది.
"ఏయ్ లేబే! లే నీ యవ్వ!"
రాజశేఖరానికి ఏమీ అర్ధం కాలేదు.
వాడెవడో తనమీద కాలు పెట్టడం, తన్నడం, అమితమయిన ఆగ్రహం కలిగించింది.
"బాస్టర్డ్! నన్ను తంతున్నావా? నేనెవడనుకుంటున్నావ్ రా?...." అంటూ అమాంతం ఆ కాలు పట్టుకుని మెలికలు తిప్పేయసాగాడు.
అకస్మాత్తుగా జరిగిన యీ సంఘటనకు దభేలున కిందపడి కాలు వదిలించుకోడానికి విశ్వప్రయత్నం చేయసాగాడు వాడు.
కానీ రాజశేఖరం కోపం తాలూకూ పిచ్చి బలంముందు వాడి బలం పని చేయలేదు.
"ఏయ్ యిడు బే! సాలే! నిన్ను ఖతమ్ జేస్తా! ఇడురా!" అంటూ గావుకేక వేయసాగాడు.
రాజశేఖరం బలంగా తన కాలితో వాడి మోకాలిమీద కొట్టాడు.
'అబ్బా' అంటూ విదిలించుకుని దూరంగా పడి లేచి నిలబడ్డాడు మళ్ళీ---
అమాంతం వాడిచేతిలో కత్తి వచ్చింది.
"సాలే! నిన్ను ఖతమ్ జేస్తా" అంటూ మీదకొస్తుంటే రాజశేఖరం భయంగా లేచి నిలబడి కత్తివంక చూశాడు.
అది కూడా అంచులు లేకుండా తుప్పుపట్టుపోయి వుంది.
"బాస్టర్డ్! తుప్పుపట్టిన కత్తులు పట్టుకొస్తారేరా? సెప్టిక్ అవుతుందన్న జ్ఞానం కూడా లేని రాస్కెల్స్...." ఒక్కొక్క అడుగే వెనక్కు వేయసాగాడతను.
ఆ దృశ్యం చూసి కొంతమంది జనం మూగారక్కడ.
వాళ్ళందరినీ చూసి కత్తి తీసి జేబులో దాచేశాడు వాడు.
చటుక్కున వచ్చి రాజశేఖరం కాలర్ పట్టుకున్నాడు.
"ఏడకెళ్ళి వచ్చినావ్ బే నువ్వు?" కోపంగా అడిగాడు.
"నీకెందుకది?"
"నాగ్గాకపోతే ఇంకెవ్వళికి బే! ఈ జాగా ఎవళ్ళదనుకున్నావ్? నీ తాతగాని సొమ్మా?"
రాజశేఖరానికి ఏమీ అర్ధంకాలేదు.
"ఈ ఫుట్ పాత్ నీదా?"
"హౌరే సాలే! ఇక్కడ పడుకోవాల్నంటే ఒక్క రాత్రికి రూపాయి నాకియ్యాలె! సమజయిందా?"
"ఎందుకు? ఇది నీ గ్రాండ్ ఫాదర్ కట్టించాడా?"
"ఏయ్! ఈడకెళ్ళిపోతావా లేదా నువ్వు?" అంటూ రాజశేఖరాన్ని ఒక్క తోపు తోశాడతను. రాజశేఖరం వెనక్కు పడిపోయాడు.
కొంచెంలో తలకు దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు.
వాడు యింకో బిచ్చగాడి దగ్గర రూపాయి తీసుకుని వాడికి ఆ స్థలం కేటాయించాడు.
"ఈ రాత్రికి యీ జాగా నీది! మళ్ళీ యీ ముసలాడేమయినా నకరాలు జేస్తే నాతో జెప్పు! సాలేగాడిని ఖతమ్ జేస్తా"
బిచ్చగాడు ఆ స్థలంలో తన బిచాణా పరుచుకుని పడుకున్నాడు. జనమంతా ఎవర్దారిని వాళ్ళు వెళ్ళిపోయారు.
రాజశేఖరం యింకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.
భారతదేశాన్ని గూండాలు పరిపాలిస్తున్నారని తెలుసుగానీ గూండాయిజం యిలా ఫుట్ పాత్ లు అద్దెకు యిచ్చే లెవల్లోకి కూడా పాకిపోయందని తెలీదు.
అంతవరకూ నిద్రలో మర్చిపోయిన ఆకలి, కాళ్ళ నొప్పులు తిరిగి వచ్చేసినాయి అతనికి. దానికితోడు భయంకరమైన అలసటతో కూడిన నిద్ర-
ఫుట్ పాత్ అంతా నిద్రపోతున్న బిచ్చగాళ్ళతో నిండిపోయి వుంది.
బహుశా అందరూ ఆ ఏరియా గూండాలకు అద్దెకట్టి వుంటారు.
