Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 25

    "ఆ రాయిమీద కూచో" అంది తన వంటిమీదున్న డ్రెస్ లో నుంచి పొడుగ్గా ఓ ముక్క చింపుతూ.

    "ఏం చేస్తావ్ నువ్విప్పుడు?" అనుమానంగా అడిగాడు రాజశేఖరం.

    "ఏపాకేసి కట్టుకట్టేస్తా!"

    "వేపాకా?"

    "అవునహే! ఆ ఆస్పత్రిలో ఇచ్చే నీళ్ళు మందుకన్నా మంచిదేలే- కూచో ముందు-గుడ్లేసుకు చూస్తావేం?"

    రాజశేఖరానికి ఆమె డబాయింపు కోపమొచ్చింది. అదే మగాడయితే పొట్టలో ఓ బాక్సింగ్ దెబ్బ వేసేవాడు.

    మాట్లాడకుండా కూర్చున్నాడతను.

    "ఓరీ! బాగానే తగిలింది దెబ్బ" అంటూ వేపాకు గాయం మీద వేసి చింపిన బట్ట చుట్టేయసాగిందామె.

    "ఎక్కడినుంచొచ్చావ్ నువ్వు?"

    "ఈ సిటీలోనుంచే"

    "తెలుసులే! నీ మొహానికి ఈ సిటీ కాకపోతే ఇంకో సిటీనుంచి ఎవడొస్తాడుగానీ ఇంతకుముందు ఎక్కడుండేవాడివి?"

    "చార్ మినార్ దగ్గర"

    "చార్ మినార్ దగ్గరా! ఒకప్పుడు నేనూ అక్కడే ఉండేదాన్నిలే! దాన్ని సూడ్డానికి తెగొచ్చేవాళ్ళు జనం. ఎంతలేదన్నా రోజూ పది రూపాయలు బిచ్చం దొరికేది. ఆళ్ళెవరో దరిద్రం భరించలేక దానిమీదకెక్కి దూకి సచ్చారుగా! దాంతో ఆళ్ళ దరిద్రం మనకి పట్టుకుంది. దాన్ని మూసేశారు. మనకి గిరాకీ పోయింది. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి సివరికిక్కడ తేలాను. ఇదిగో-నీకెవరయినా వున్నారా?"

    "లేరు"

    "నాలాంటి దిక్కుమాలిన బతుకేనన్నమాట నీదికూడా" కట్టుకట్టటము పూర్తయిపోయింది.

    అతను లేచి నిలబడ్డాడు.

    "థాంక్యూ"

    "అంటే?"

    "ఏమీ లేదులే నేను పోతున్నా"

    "పోతే పోగానీ కొంచెం కిందా మీదా సూసుకునడు! లేకపోతేవున్న కాలుపోద్ది! ఆ దాసుగాడి కాలు యిలాగేగా తీసేశారు."

    అతనికి భయమేసింది.

    "కాలు తీసేశారా?"

    "తీయకేం చేస్తారు? మేకు గుచ్చుకుంటే కాలింత లావయిపోయింది. గవర్నమెంటు ఆస్పత్రికెళితే ఆపరేషన్ చేయాలి. రెండొందలిమ్మన్నారంట. ఆడి దగ్గర అడుక్కుని సంపాదించిన డబ్బు రెండొందలుంది. ఇవ్వరా అంటే ఇవ్వనన్నాడు. కాలుపోతే పోనీ, కుంటాడినని జాలిపడయినా బిచ్చమేస్తారు అని మొండిపట్టు పట్టాడు. 'నీ సావు నువ్వు సావరా' అని వదిలేశాను. సచ్చాడు. కాలు మొత్తం తీసేశారు."

    రాజశేఖరానికి కింద నడవాలంటేనే భయమేసింది.

    జాగ్రత్తగా నేలమీద చూసుకుంటూ రెండడుగులు వేయటం గమనించిందామె.

    "ఏయ్ ముసలోడా! ఆగు!" అంది బిగ్గరగా.

    అతనికి వళ్ళు మండిపోయింది.

    "ఏయ్! ముసలోడా ఏమిటి? అలాంటి పిచ్చివాగుడు వాగితే తంతాను."

    "ఏం? ముసలోడివి కాదా నువ్వు?"

    "కాదు"

    "నీ వయసెంత?"

    "నలభయ్"

    "థూ నీయవ్వ! నలభయేళ్ళొచ్చినా ఇంకా సిన్నపిల్లడిననుకుంటున్నావా ఏంటి? నీ మొహం ఓసారి ఆ పగిలిన అద్దంలో సూసుకో!"

    అతనికి రక్తం ఉడికిపోతోంది.

    ఊహ తెలిసిందగ్గర్నుంచీ తననెవరూ ఇంత ఇన్సల్ట్ చేయలేదు. అనుభవం కొత్తగా, వింతగా, చిరాకుగా వుంది.

    "నీ మొహం కూడా ఓసారి చూసుకో. ఆడో, మగో కూడా తెలీటం లేదు" హేళనగా, కసిగా అన్నాడు.

    ఆమె పగలబడి నవ్వేసింది.

    "తెలీకపోటమే మంచిదిలే! లేకపోతే నా వళ్ళు గుల్ల చేసేవోళ్ళు."

    "ఇంతకూ నన్నెందుకు పిలిచావ్?"

    "సెప్పుల్లేకుండా తిరుగుతే సస్తావేమోనని జాలి-ఉండు ఇప్పుడే వస్తా" అంటూ లోపలికెళ్ళి గోడకు వేలాడుతోన్న రకరకాల చెప్పులో నుంచి రెండు ఏరి పట్టుకొచ్చింది.

    రెండూ రెండు రంగుల్లోనూ, రెండు సైజుల్లోనూ వున్నాయి. చిరిగి పోయిన వాటిని తిరిగి కుట్టినట్లు తెలిసిపోతోంది.

    "ఏస్కో సూస్తావేంటింకా?"

    "ఏంటి ఈ పాత చెప్పులా?"

    "ఇదిగో! ఊరికే ఎదవమాటలు మాట్లాడకు! నువ్వేం కోటీశ్వరుడివా కొత్త చెప్పులేసుకోటానికి. మొహం సూడు.... కొత్త చెప్పులేసుకునే మొహం."

    అతను మారు మాట్లాడకుండా ఆ చెప్పులేస్కుని అక్కడినుంచి నడిచాడు.

    అప్పటికే చీకటి అలుముకుంటోంది.

    చలి మొదలయిపోయింది.


    సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఓ కప్పు టీ, స్నాక్స్ తీసుకోవటము అలవాటు తనకు. అది మిస్ అవటంతో కడుపులో దేవినట్లైంది.

    తాగి తూలుతూ నడుస్తున్నారు కొంతమంది. ఎవరి ఆకారం చూసినా అసహ్యం కలుగుతోంది. ఏ క్షణాన్నయినా చచ్చేట్లున్నారు.

    ఎవరూ తనని పట్టించుకోవటంలేదు.

    కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి నడుస్తున్నకొద్దీ.

    ఇక్కడ ఇంత దరిద్రం ఉందని తనకు తెలీదు. అతి భయంకర మైన జీవితం. వీళ్ళు మనుషుల్లా లేరు. మరో రకం ప్రాణుల్లా వున్నారు.

    ఇంతకూ రాత్రి భోజనం సంగతేమిటి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS