ఒక్కగంట వుంటే చాలు! ఏదో ఒక జబ్బు రావటం ఖాయం.
కొంతమంది ఓ చెట్టుకింద కూర్చుని సారా తాగుతున్నారు. కొంతమంది దూరంగా చెట్టుకింద కూర్చుని పేకాటాడుతున్నారు.
పిల్లలు కొంతమంది మురుగ్గుంటలో కాగితం పడవలు చేసి వదుల్తున్నారు.
అందరూ రాజశేఖరం వంక ఆశ్చర్యంగా చూశారు.
రాజశేఖరం పట్టించుకోలేదు.
ఇలాంటి వాతావరణంలో వుండటమా? పందెం ఓడిపోయి పరుగెత్తటమా అనే ఆలోచనలో వున్నాడు.
కొద్దిదూరం నడిచేసరికి హఠాత్తుగా ఓ బిచ్చగాళ్ళ తోపుడుబండి ఎదురొచ్చింది.
తోపుడు బండిమీద ఒకడు కళ్ళు మూసుకుని కూర్చుని వున్నాడు.
"ఆడు గుడ్డాడండీ! నేను సెవిటోడిని! దానం చేయండి బాబూ!" అన్నాడు చెవిటోడు.
రాజశేఖరం అలవాటు చొప్పున జేబులో చేయిపెట్టి పర్స్ కోసం వెతుకుతూంటే గుర్తుకొచ్చింది తన దగ్గర ఒక్క పైసా కూడా లేదని.
"డబ్బుల్లేవు!" అంటూ ముందుకు నడవబోయాడు.
వాడు బండి వదిలేసి ఠక్కున ఎదురుగ్గా వచ్చి అడ్డుపడ్డాడు.
"పోనీ ఆడు సెవిటోడు- నేను కుంటోడిననుకోండి! ఎంతో కొంత ధర్మం సేయండి."
"నా దగ్గర లేవని చెప్పానుగా?"
"సెప్పినా వినబడదు బాబూ! పోనీ ఆ గుడ్డోడికి ఇనబడిందేమో కనుక్కుందాం! ఏరా? నీ కినబడిందా కిట్టిగా?"
"నీకే ఇనపడకపోతే నాకేం ఇనపడద్దిరా!"
రాజశేఖరానికి అర్ధమయిపోయింది- వాళ్ళిద్దరూ నాటకమాడుతున్నారని.
"నాకు తెలుసురా మీ సంగతి! ఎన్ని నాటకలయినా వేస్తారు. ఎన్ని మోసాలయినా చేస్తారు గానీ కష్టపడి పని చేసుకు బ్రతకటం మాత్రం మీ కిష్టం వుండదు" అన్నాడు కోపంగా.
వాళ్ళిద్దరూ అమాంతం రాజశేఖరం కోటు కాలర్ పట్టుకున్నారు.
"మర్యాదగా నీ వాచీ, ఆ కోటూ తీసెయ్--- లేకపోతే చస్తావు" అంటూ ఒకడు సగం విరిగి తుప్పుపట్టి పోయిన కత్తి తీసి రాజశేఖరం పొట్టకు ఆనించాడు.
"ఏయ్ ఇడియట్! అది తుప్పు పట్టిన కత్తిరా! గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది"
"అయితే మర్యాదగా పైసల్దియ్యి."
"పైసలు లేవని చెప్తే బుద్ధి లేదు మీకు?"
అమాంతం వాడు రాజశేఖరం కోటు పట్టుకుని వెనక్కులాగాడు. రెండోవాడు అతని వాచీ ఊడదీసుకున్నాడు-బూట్లు లాక్కున్నాడు.
రాజశేఖరం ప్రతిఘటించబోతుండగా వెనక నుంచి లాగి మోకాళ్ళ వెనుక తన్నాడొకడు.
దాంతో అక్కడే కూలబడిపోయాడు రాజశేఖరం.
ఒకడు కోటుతోనూ రెండోవాడు వాచీతోనూ పరిగెడుతూంటే రాజశేఖరం వెంటపడ్డాడు.
ఇద్దరూ ఆగి మళ్ళీ కత్తితో రాజశేఖరం మీద కొచ్చారు.
"ఒరేయ్! నిన్ను ఓ పోటు పొడిస్తేగానీ మా వెంట పడటం మానవురా!" అంటూ మీద మీదకొస్తుంటే రాజశేఖరం వెనక్కు నడవసాగాడు.
కత్తిపోటు తగలకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూంటే హఠాత్తుగా ఎగిరి వాళ్ళ మధ్యలోకి దూకిందో ఆకారం ఆ వ్యక్తి చేతిలో పొడుగాటి ఇనుప జల్లెడ వుంది. అది కూడా తుప్పు పట్టి కత్తికంటే భయంకరమయిన ఇనుప ముళ్ళతో నిండిపోయింది.
దాంతో వాళ్ళిద్దరినీ ఎటాక్ చేసిందామె.
ఒకటే దెబ్బకు మొదటివాడు గావుకేక వేసి బండి లాక్కుంటూ పారిపోయాడు. రెండోవాడు కాసేపు ఎదుర్కోడానికి ప్రయత్నించి జల్లెడ దెబ్బకు కత్తి ఎగిరి దూరంగా పడేసరికి తనూ పారిపోయాడు.
అప్పుడు చూశాడా వ్యక్తిని రాజశేఖరం.
కొద్దిక్షణాలు అది మగాడో, ఆడదో తెలీలేదతనికి.
చిరిగిన పీలికల్లాంటి బట్టలు చాలా వేసుకున్నట్లుంది. కొంచెం లావుగా కనబడుతోంది. కానీ చేతులూ, కాళ్ళూ, మెడా చూస్తే బక్క చిక్కిన ఆకారం అని తెలుస్తూనే వుంది. కొప్పులాగా చుట్టేసిన పొడుగాటి జుట్టు చూశాక నిర్ధారణ అయ్యింది ఆడదని.
"అరె నీయవ్వ--కాలికి దెబ్బ తగిలినట్లుందే" అంది రాజశేఖరం కాళ్ళవంక చూస్తూ.
అప్పుడు తన పాదం చూసుకున్నాడు రాజశేఖరం. వాళ్ళు బూట్లు కూడా ఎత్తుకుపోవడంతో ఆ పెనుగులాటలో కాళ్ళకు దెబ్బ తగిలి రక్తం స్రవిస్తోంది.
"దొంగ రాస్కెల్స్! అనుకున్నంతా అయ్యింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి టెటనస్ ఇంజక్షన్ తీసుకోవాలి."
ఆమె విరగబడి నవ్వింది,
"నీయవ్వ- నీ మొహానికి డాటరూ, ఇంజెషనూనూ-రా నేను కట్టుకడతా."
ఆమె ధోరణికి కొంచెం కోపం కూడా వచ్చింది రాజశేఖరానికి.
"ఏయ్ ఏమిటా మాటలు మంచీ మర్యాద లేకుండా?"
ఆమె విచిత్రంగా వెనక్కు తిరిగి చూసింది.
"మంచీ మర్యాదా కావాలా? ఓసారి నీ మొహం ఆ పగిలిన అద్దములో చూసుకో! అన్నీ కనబడతయ్-రా ముందు."
చిరాకుగానే ఆమె వెనుక నడిచాడు రాజశేఖరం. డాక్టర్ ఫీజుకి, ఇంజెక్షన్ కీ డబ్బుల్లేవన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది.
పడిపోతున్న ఇంట్లో సగం గది ఆ ఇల్లు. లోపల అన్నీ చిరిగిన బట్టలగుట్ట.
