Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 23

    కనకారావు నవ్వాడు.

    "నువ్వు దోచుకునేవాడివేగానీ అబద్దాలు చెప్పేవాడివి మాత్రం కాదులే! నాకా నమ్మకముంది" నవ్వుతూ అన్నాడు.

    "రూపాయ్ రెడీగా పెట్టుకో! ఓడిపోతున్నావ్!"

    "నువ్వు పదివేలు రెడీగా పెట్టుకోవటం బెటరనుకుంటాను."

    ఇద్దరూ నవ్వేశారు.

    "ఓ.కె. బెస్టాఫ్ లక్."

    రాజశేఖరం బయటకు నడిచాడు.

    కారు డ్రయివర్ సెల్యూట్ కొట్టి డోర్ తెరిచాడు.

    "వద్దు! నడిచే వెళతాను"

    డ్రయివర్ ఆశ్చర్యపోయాడు.

    "నడిచా సార్?"

    "అవును"

    రోడ్డుమీద కొచ్చాడతను.

    బాగా రద్దీగా వున్నాయి రోడ్లు.

    బస్ స్టాఫ్ దగ్గరకెళ్ళి నిలబడ్డాడతను.

    రోడ్డుమీద పోయే వాహనాల వల్ల దుమ్ము భయంకరంగా లేచి కళ్ళలోకి, ముక్కుల్లోకి జొరబడుతూంటే కళ్ళు మంటలు పుట్టటం, దగ్గు రావటం ప్రారంభమయ్యింది.

    ఏ.సి. కార్లో వెళుతూంటే దుమ్ము ఎలా వుంటుందో తెలిసేది కాదు.

    పాపం స్కూలుకెళ్ళే పిల్లలు, మిగతా జనం దీన్నెలా భరిస్తున్నారో---

    జనానికి రకరకాల రోగాలు వస్తున్నాయంటే ఎందుకు రావు మరి?

    స్లమ్ దగ్గరకెళ్ళే బస్ కోసం పావుగంట నిలబడ్డాక వేలాడుతున్న జనంతో వచ్చింది.

    "నేను బస్ ఎక్కాలి! దారి ఇవ్వండి" అన్నాడు ఫుట్ పాత్ మీదున్న వాళ్ళతో.

    అందరూ అతనిని చూసి నవ్వారు.

    కండక్టర్ బెల్ కొట్టాడు.

    కంగారుగా అందరినీ తోసుకుంటూ బస్ ఎక్కటానికి ప్రయత్నించసాగాడతను.

    ఒక కాలు ఫుట్ బోర్డ్ మీద అనింది గానీ రెండోకాలు వెనుక ఎక్కిన జనంలో ఇరుక్కుపోయింది. చేతికి డోర్ పక్కనే వున్న రాడ్ దొరకలేదు. ఏ క్షణాన్నయినా వెనక్కు పడిపోవచ్చని అర్ధమయిపోయిందతనికి.

    కానీ వెనుక ఎక్కిన జనం బలంగా నొక్కేయడంతో ఎటూ పడకుండా గాలిలో బ్యాలెన్స్ అయిపోయాడు.

    భయంగానూ, తమాషాగానూ కూడా వుందా అనుభవం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎలా వుంటుందో తెలిసి వచ్చింది---
    కానీ ఆ తరువాత బస్ స్టాఫ్ చేరుకుంటుండగానే కొంతమంది రన్నింగ్ లో బస్ దిగేయటంతో ప్రెజర్ తగ్గిపోయి తను వెనక్కుండి పోవాల్సి వచ్చింది.

    నడుము విరిగినంత పనయింది.

    ఆ పక్కనే నిలబడ్డావాళ్ళొచ్చి లేపి నిలబెట్టారు.

    "నువ్వు కూడా రన్నింగ్ లో దిగటమేమిటి గురూ? ఆగాక దిగలేవూ?"

    "షటప్" అన్నాడు రాజశేఖరం కోపంగా.

    అతను చటుక్కున చొక్కా కాలర్ పట్టుకున్నాడు.

    "పోనీలే గదాని లేపి నుంచోబెడితే నన్నే షటప్ అంటావా? నీయమ్మ! అందుకే వెధవలకు సహాయం చేయగూడదంటారు!" అన్నాడు కోపంగా.

    "వాట్? నేను వెధవనా?"

    "వెధవన్నర--అట్టే మాట్టాడితే-"

    రాజశేఖరం బలంగా పిడికిలితో అతని డొక్కలో కొట్టాడు.

    వాడు దానికి రడీగానే ఉండటం చేత తప్పుకుని మొఖం మీద అరచేత్తో కొట్టాడు. రాజశేఖరంకి కళ్ళు బైర్లు కమ్మినాయి.

    ఈలోగా ఇంకో బస్ రావడంతో అందరూ పరుగెత్తుకెళ్ళిపోయారు. తనూ పరుగెత్తి ఠక్కున ఆగిపోయాడు.

    అప్పుడు గుర్తుకొచ్చింది.

    బస్ టికెట్ కి కూడా తన దగ్గర డబ్బు లేదు.

    చేసేదిలేక నెమ్మదిగా నడక ప్రారంభించాడు.

    కోటూ ప్యాంటూ దుమ్ము కొట్టుకుపోయి క్షణాల్లో షాబీగా అయిపోయాయి.

    జీవితంలో ఎప్పుడూ ఇలాంటి బట్టలు వేసుకోలేదు.

    కొద్దిదూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు పుట్టుకొచ్చాయి.

    ఇంతదూరం నడవటం అలవాటు లేదు.

    కార్లో వెళితే ఇంతదూరం అయిదు నిమిషాల్లో వెళ్ళిపోయేవాడు.

    దూరంగా స్లమ్ కనబడుతూనే వుంది.

    చిన్నప్పుడెప్పుడో అందులోకి వెళ్ళాడు తను అందులో అన్నీ చెట్లు వుండేవి! అంతే!

    కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో దొంగతనంగా చెట్లన్నీ కొట్టేశారెవరో! వాటి స్థానంలో పాకలు వెలిసినాయి.

    శక్తినంతా కూడదీసుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాడతను.

    మరో పావుగంట తర్వాత స్లమ్ దగ్గరికి చేరుకున్నాడు. సగం విరిగి పోయిన బోర్డ్ ఇంకా కనబడుతూనే ఉంది. 'రాజశేఖరం ఎస్టేట్' అన్న అక్షరాలతో.

    ఆ బోర్డ్ ని లేపి సరిగ్గా పెట్టడానికి ప్రయత్నించేసరికి మొత్తం పడిపోయింది.

    చేసేదిలేక స్లమ్ లోకి నడిచాడతను.

    కార్పోరేషన్ వాళ్ళు పడేసే చెత్త ఓ పక్క, మధ్యగా ఓ నదిలా పారుతోన్న మురికి కాలువ ఓ పక్కా దానికి రెండువేపులా శిధిలావస్థలో వున్న గుడిశెలూ, కొన్ని పాతకాలం నాటి పగిలిపోయిన ఇళ్ళూ, చూస్తుంటేనే భయం కలిగించింది రాజశేఖరంకి.

    అక్కడ వందరోజు లక్కర్లేదు---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS