"ఓ.కె. నీకంత అనుమానంగా వుంటే అంతవరకూ నా ఆస్థి పాస్తులన్నిటి మీదా నీకే పవరాఫ్ అటార్నీయిస్తాను. ఇంక నేను మిస్ చీఫ్ చేయడానికి స్కోప్ వుండదు కదా!"
"అవును! వెరీగుడ్ అయిడియా! అప్పుడింక నీ ఆటలేం సాగకుండా నేను చూసుకుంటాను. అయితే ఎప్పుడెళతావక్కడికి?"
"రేపే"
కనకారావు నవ్వాడు.
"ఒరేయ్! ప్రతిసారీ నువ్వే గెలుస్తున్నావ్ గానీ ఈసారి మాత్రం గెలుపు నాదిరా!"
"ఓటమి మన జన్మలో లేదురా"
"చూద్దాంగా"
"ఎస్! చూద్దాం!"
కనకారావు వెళ్ళిపోయాడు.
రాజశేఖరం ఆఫీస్ కి బయల్దేరాడు.
సీట్లో కూర్చోవటంతోనే ఫోన్ లు మోగటం మొదలయిపోయింది.
కొద్దిసేపు మాట్లాడటం పూర్తయ్యేసరికి ఎదురుగా ప్రమీల కూర్చుని వుండటం కనిపించిందతనికి.
ఆమె అందం చూసి థ్రిల్ అయిపోయాడతను,
"ప్రమీలా!"
"ఎస్సర్!"
"ఓ విషయం చెప్తాను! మీరేమీ అనుకోరుకదా?"
"వెల్ కమ్ సర్!"
"యూ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వొమన్ ఇన్ ది వరల్డ్"
ప్రమీల సిగ్గుపడింది.
"థాంక్యూ సార్!"
"ఈ విషయం ఇంతకు ముందెవరయినా మీకు చెప్పారా?"
"మీరే చెప్పారు!"
అతను ఆశ్చర్యపోయాడు.
"నేనా?"
"ఎస్సర్"
"ఎప్పుడు?"
"నిన్న"
"మైగాడ్! నాకు గుర్తు లేదే!"
ఆమె చిన్నబుచ్చుకుంది.
"మీరు చాలా బిజీ కద్సార్! అందుకని గుర్తుండకపోవచ్చు."
"అంటే నాకు మతిమరుపు వుందంటావా?"
"కొంచెం సర్"
"ఏ మాత్రం లేదు. ఏ విషయమయినా ఖచ్చితంగా గుర్తుంటుంది. కావాలంటే బెట్ కట్టు. నువ్వు గెలిస్తే పదివేలిస్తాను. నేను గెలుస్తే ఒక రూపాయ్ యివ్వు"
ప్రమీల నవ్వేసింది.
తన బ్యాగ్ లో నుంచి రూపాయ్ తీసి యివ్వబోయింది.
"తీసుకోండి సార్! పందెం కడితే మీతో ఎవరూ గెలవలేరు."
"నోనోనో! పందెం కట్టాక తేలకముందే మీరు ఓడిపోయినట్లు వప్పుకోవడం మనకు నచ్చదు. అన్నట్లు మీకు చెప్పానా? నిన్నే ఓ బ్రహ్మాండమయిన పందెం కట్టాను. ఏమిటో తెలుసా? వంద రోజుల పాటు...." అంతవరకూ చెప్పి ఠక్కున ఆగిపోయాడు.
"అఫ్ కోర్స్! అది సీక్రెట్! ఎవరికీ చెప్పకూడదు. బైదిబై నేను రేపటినుంచీ ఆఫీస్ కి రాను మా ఫ్రెండ్ కనకారావుకి పవర్ యిస్తున్నాను. నేను తిరిగొచ్చేవరకూ వాడే చూస్తుంటాడన్నీ....ఓ.కె."
"ఓ.కె. సార్!"
"ఆల్ రైట్! కారీ ఆన్! నిన్నెందుకు పిలిచాను నేను?"
"తెలీదు సార్! డిక్టేషన్ తీసుకోమన్నారు."
"ఓ.కె. ఏ కంపెనీ లెటర్ రాయాలో మర్చిపోయాను-ఐ మీన్ మర్చిపోలేదు గానీ ఏది ముందు, ఏది వెనుక అనే ప్రిఫరెన్స్ గుర్తులేదన్న మాట" అంటూండగానే మళ్ళీ ఫోన్ మోగింది.
ఫోన్ అందుకున్నాడు.
"హలో! ఎస్ రాజశేఖర్ స్పీకింగ్"
మరి కాసేపటికి పూర్తిగా ఫోన్స్ తో మునిగిపోయాడతను.
సాయంత్రం ఇంటికి బయలుదేరుతూంటే సడన్ గా మళ్ళీ కనకారావుతో తన పందెం విషయం గుర్తుకొచ్చిందతనికి.
మనసంతా ఆనందంతో నిండిపోయింది.
అమెరికాలో కూడా ఛాన్స్ దొరకలేదు. నిజంగానే ఈ పందెం తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా వుంది. వంద రోజులు ఆ స్లమ్ లో గడపటం పెద్ద కష్టమేమీ కాదు. తను ప్రాక్టికల్ మాన్! కనుక ఎలాంటి లైన్ అయినా ఫేస్ చేయగలడు.
ఇంటికి చేరుకునే సరికి లాయర్ తన కోసం ఎదురు చూస్తున్నాడు.
"పవరాఫ్ అటార్నీ రాసి తీసుకొచ్చాను సార్"
"థాంక్యూ"
తన గదిలోకి నడిచి సర్వెంట్ బెల్ మోగించాడు.
అందరూ పరుగుతో వచ్చి నిలబడ్డారు.
"నేను కొద్దిరోజుల వరకూ ఇంటికి రాను అంతవరకూ మా ఫ్రెండు కనకారావు యిక్కడ వుంటాడు. అతనే మీకు యజమాని ఓ.కె."
అందరూ వినయంగా తలూపారు.
తన జేబులోని బ్యాంక్ కార్డులు, పాకెట్ కంప్యూటర్ అన్నీ తీసి తన పర్సనల్ అల్మారాలో పడేశాడతను.
గదిలో నుంచి బయటకు నడవబోతుంటే కనకారావు ఎదురు వచ్చాడు.
పవరాఫ్ అటార్నీ కాగితం అతని చేతికిచ్చాడు రాజశేఖరం.
"నా జేబులు కూడా చేసుకోరా! డబ్బేమయినా తీసుకెళుతున్నానీ నీకు అనుమానం రావచ్చు."
