Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 21

    "ఆల్ రైట్! మిగతా మేనేజర్సందరికీ ఫోన్లు చేసి మన ఇండస్ట్రీస్ మొత్తం ఇన్ డెఫినెట్ గా క్లోజ్ చేసేయమని చెప్పు! ఈ సోమరిపోతులను ఎలా దెబ్బ కొట్టాలో నాకూ తెలుసు."

    "అలాగే సార్!"

    "ఇంకో విషయం. నన్ను ఇంక ఏడు గంటల వరకూ ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడు."

    "ఓ.కె. సర్."

    ఫోన్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ నిద్రలోకి జారిపోయాడతను.

                  *    *    *    *    *

    ఉదయం మెలకువ వచ్చేసరికి నౌఖరు ఎదురుగా బెడ్ కాఫీతో నిలబడి వున్నాడు.

    టైమ్ చూశాడు రాజశేఖరం.

    సరిగ్గా ఏడుగంటలే అయింది.

    ఆరు నూరయినా నూరు ఆరయినా తనకు మాత్రం ఖచ్చితంగా ఏడు గంటలకల్లా మెలకువ వచ్చి తీరుతుంది.

    త్వరగా బెడ్ కాఫీ తాగేసరికి మరో నౌఖర్ న్యూస్ పేపర్ తీసుకొచ్చి అందించాడు. వెంటనే బాత్రూమ్ లోకి నడిచాడు.

    న్యూస్ పేపర్లో మొదటి పేజీలోనే వేశారు.


    "రాజశేఖరం పరిశ్రమలన్నీ లాకౌట్. మేనేజ్ మెంట్ దురాగతం."

    ఆ వార్త చూస్తూనే కోపంతో న్యూస్ పేపర్ చింపి అవతల పారేశాడతను.

    ఈ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ ల గురించి తనకు బాగా తెలుసు.

    మగ, ఆడ విషయంలో తప్పు ఆడదానిది వున్నా మగాడికి వ్యతిరేకంగానే న్యూస్ రాస్తారు.

    గొప్ప, బీద విషయంలో తప్పెప్పుడూ గొప్పోడిదే.

    యజమానీ, కార్మికుడు విషయంలో దుర్మార్గుడెప్పుడూ యజమానే.

    పోలీసు, దొంగ విషయంలో తప్పెప్పుడూ పోలీసుదే.

    అందుకే తను జర్నలిస్ట్ లెవరినీ తన ఆఫీస్ చుట్టు పక్కలకు కూడా రానీడు.

    ఏదేమయినా తను సోమరిపోతు వర్కర్స్ కి, లంచగొండి యూనియన్ లీడర్స్ కీ చావుదెబ్బ కొట్టినందుకు ఆనందంగా వుంది.

    స్నానం చేసి వచ్చేసరికి నౌఖర్లు తన డ్రస్ పట్టుకుని నిలబడి వున్నారు.

    త్వరగా డ్రస్ చేసుకుని డ్రస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రడీ అయి డైనింగ్ హాల్ కి చేరుకున్నాడు.

    ఫలహారం చేస్తూండగానే వచ్చాడు కనకారావు.

    "నాకు తెలుసురా! ఎంత స్నేహం వున్నా పాము ఎప్పటికీ తన సహజ గుణం మర్చిపోదు. పాలుపోసిన చేతినే కాటు వేస్తుంది. నీలాంటి కాపిటలిస్ట్ గాళ్ళు కూడా అంతే! రాత్రింబగళ్ళు నీకోసం చెమటోడ్చి లాభాలను తెచ్చిపెట్టే కార్మికులకు ఇంత అన్యాయం చేస్తారా?"

    "ఒరేయ్! వీళ్ళు డబ్బున్నవాడిని దోచుకు తినాలనే క్రూల్స్ కనీసం వందలో పదిమంది కష్టపడి పనిచేసేవాళ్ళున్నా ఈ రోజు ఇండియా పరిస్థితి ఇలా వుండేది కాదు. రా టిఫిన్ తిను."

    కనకారావుకి ఫలహారం వడ్డించాడు నౌఖరు.

    "ఆహా! అక్కడ నాలుగు రోజులకోసారి కూడా తిండి దొరక్క జనం చస్తుంటే నువ్వు చూశావా? నాలుగు రకాల ఫలహారాలు తింటున్నావు ఇందుకేరా విప్లవం రావాలంటున్నాను." అంటూ చకచకా ఫలహారాలు తినసాగాడు.

    ఇద్దరూ కాఫీ తాగాక రాజశేఖరం పోలీస్ కమీషనర్ కి ఫోన్ చేశాడు.

    "హలో! గుడ్ మాణింగ్! నాకో హెల్ప్ కావాలి అది మన స్థలంలో ఎవరో కొన్ని గుడిశెలు వేసుకుని వున్నారు. వాళ్ళను  ఖాళీ చేయించాలి. మీరోసారి వస్తే వివరాలన్నీ మాట్లాడవచ్చు."

    కనకారావు ఆశ్చర్యంగా చూశాడు.

    "అంటే పాపం అక్కడున్న బీదాళ్ళందరికీ నిలువనీడ లేకుండా చేస్తున్నావట్రా? ఒరేయ్ వాళ్ళెంత దారుణమయిన బ్రతుకులు బ్రతుకుతున్నారో తెలిస్తే నువ్వీ పని చేయవురా! నీకు బీదతనం తాలూకు ABCD లు తెలీకపోవటం వల్ల యింత రాక్షసుడివవుతున్నావు"

    "ఒరేయ్ బీదతనం గురించి పెద్ద కబుర్లు చెప్పకు. ఈ రోజుల్లో వాళ్ళే డబ్బున్నవాడికంటే సుఖంగా బ్రతుకుతున్నారు. పండగలకు గూండాయిజంతో చందాలు వసూలు చేయటం, రోజుకి యాభై రూపాయలు కూలి డిమాండ్ చేయటం, ఫ్యాక్టరీ వుద్యోగాలిస్తే యూనియన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేయటం, రోజంతా తాగి తందనాలాడటం. ఇదా బీదతనం?"

    "కామెర్ల కళ్ళవాడికి లోకం పచ్చగా కనపడుతుందనీ.... డబ్బు మదంతో తాగి తందనాలాడేవాడికి లోకమంతా అలాగే కనబడుతుంది. ఒరేయ్! ఆ బ్రతుకులు అంత తేలికయితే నువ్వు ఒక్కరోజు ఆ స్లమ్ కి వెళ్ళి బ్రతకరా చూద్దాం! ఆ నరకం అనుభవించలేక అయిదు నిమిషాల్లో వచ్చి నీ యింట్లో పడతావు"

    "ఒక్కరోజు కాదు! వందరోజులు గడుపుతాను. పందెం కడతావా? నేను గెలుస్తే ఒక రూపాయ్ యివ్వాలి నువ్వు! ఓడిపోతే నేను పదివేలిస్తాను. దమ్ముందా?"

    "ఆల్ రైట్! పందెంరా!"

    రాజశేఖరానికి పట్టుదల పెరిగిపోయింది.

    "కమాన్ చేయి కలుపు."

    "కాపిటలిస్ట్ తో చేతులు కలపటం మన పాలసీకి వ్యతిరేకం" నవ్వుతూ అన్నాడు కనకారావు.

    "పోనీ ఎడమచేయి కలపరా! లెఫ్టిస్టులకు మీకు పేరుందికదా!"

    కనకారావు చేయి కలిపాడు.

    "కానీ ఓ సంగతి గుర్తుంచుకో! ఆ స్లమ్ లో వెళ్ళినప్పుడు నువ్వు ఒక్క పైసాకూడ తీసుకెళ్ళకూడదు. కేవలం వంటిమీద జత బట్టల్తో వెళ్ళాలి. నీ సిబ్బందినీ, ఇన్ ఫ్లుయెన్స్ నీ ఏదీ వుపయోగించకూడదు. నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలి! వంద రోజులు బ్రతకాలి. ఓ.కె."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS