Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 20

    "ఏయ్ మిస్టర్! ఇంకోసారి డిస్టర్బ్ చేశావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వెవడివో నాకు తెలీదని ఇందాకొకసారి చెప్పాను."

    "నేనే సార్! మీ మేనేజర్ లక్ష్మణరావ్ ని."

    "లక్ష్మణరావ్ అనే పేరుగల మేనేజరెవడూ లేడు నాకు."

    "నేనున్నాను సార్!"

    "షటప్! లేవని ఒకసారి చెప్పాను"

    "నేను మన ఆనందా ఇండస్ట్రీస్ మేనేజర్ లక్ష్మణరావ్ ని సార్!"

    "ఆనందా ఇండస్ట్రీసా? ఆ పేరుకూడా నేనెప్పుడూ వినలేదు.... రాంగ్ నెంబర్" అనేసి మళ్ళీ ఫోన్ పెట్టేశాడు.

    మరుక్షణమే మళ్ళీ మోగసాగిందది.

    "ఏయ్ ఆర్.కె.లక్ష్మణరావ్! నీ ఫోన్ నెంబరెంతో చెప్పు.... ఇప్పుడే నిన్ను పోలీసులతో చెప్పి అరెస్టు చేయిస్తాను."

    "నేను చెప్పేది కొంచెం వినండి సార్! తర్వాత అలాగే అరెస్ట్ చేయిద్దురుగాని!"

    "ఆల్ రైట్! చెప్పు.... ఇరవై సెకనులు టైమిస్తున్నాను"

    "మీరు ఈ మధ్యే ఆనందా ఇండస్ట్రీస్ కి నష్టాలు వస్తున్నాయని నన్ను పిలిపించి మాట్లాడారుకూడా సార్! ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకున్న ఇండస్ట్రీలో ఎక్కువ నష్టం వస్తోంది ఈ ఇండస్ట్రీకే! నేను ఆ ఇండస్ట్రీ మేనేజర్ ఆర్.కె. లక్ష్మణరావ్ ని మాట్లాడుతున్నాను. ఇప్పటికయినా గుర్తుకొచ్చిందా సార్?"

    రాజశేఖరానికి గుర్తుకొచ్చేసిందిగానీ కోపం కూడా ఎక్కువై పోయింది.

    "ఎస్! రిమెంబర్! నష్టానికి తోడు తెల్లవారుజామున నా నిద్రకూడా డిస్టర్బ్ చేస్తూ ఈ ఫోన్ కాల్స్ ఏమిటి? నీకేమైనా బుద్ధుందా?"

    "అది కాద్సార్ ఓ ప్రాబ్లమ్ వచ్చింది."

    "డోంటాక్! ప్రాబ్లమ్స్ కెన్ వెయిట్! ఈజిట్ నాట్?"

    "అఫ్ కోర్స్! కానీ...."

    "డోంట్ సే కానీ"

    "ఎస్సర్"

    "డోంట్ సే ఎస్సర్"

    "ఓ.కె.సర్!"

    "దిసీజ్ లాస్ట్ వార్నింగ్ రమణారావ్!"

    "నా పేరు రమణారావ్ కాద్సార్. లక్ష్మణరావ్"

    "లక్ష్మణరావా?"

    "అవున్సార్!"

    "మరిందాకట్నుంచీ రమణారావని ఎందుకు అరుస్తున్నావు?"

    "నేను లక్ష్మణరావు అనే చెప్తున్నా సార్"

    "డోంట్ బ్లఫ్! నువ్వు రమణారావు అని చెప్పటం వల్లే నేను గుర్తుపట్టలేక పోయాను"

    "సారీ సర్! పొరబాటున వచ్చేసి వుంటుంది."


    "ఆల్ రైట్! ఇంకోసారి నైట్ టెన్ నుంచీ మాణింగ్ సెవెన్ లోపల నన్ను డిస్టర్బ్ చేశావంటే డిస్మిస్ చేస్తాను."

    "ఐయామ్ సారీ సర్."

    "ఆల్ రైట్! ఇప్పుడెలాగూ డిస్టర్బ్ చేశావు గనుక సంగతేమిటో చెప్పు! ట్వంటీ సెకండ్స్ లో కంప్లీటవాలి."

    "మన ఇండస్ట్రీ వర్కర్స్ అందరూ రాత్రి మూడింటి నుంచీ టూల్ డౌన్ స్ట్రయిక్ చేస్తున్నారండీ"

    "అయితే నన్నేం చేయమంటావు? యూనియన్ లీడర్స్ తో మాట్లాడు."

    "యూనియన్ లీడర్స్ తో మాట్లాడితే స్ట్రయిక్ ఆపుజేయాలంటే వాళ్ళకు లక్ష రూపాయల లంచం కావాలంటున్నారండీ"

    "పోలీసుల్ని పిలిచి అందర్నీ బయటకు గెంటించి ఫ్యాక్టరీ మూసి పారేయ్! ఏభై లక్షలు నష్టం వస్తే వచ్చిందిగానీ ఆ బాస్టర్డ్స్ కి ఒక్క పైసా కూడా లంచం యివ్వను"

    "వాళ్ళ డిమాండ్స్ వప్పుకోపోతే మన మిగతా ఇండస్ట్రీస్ తో కూడా స్ట్రయిక్ చేయిస్తామంటున్నారు సార్."

    "వాళ్ళ డిమాండ్స్ ఏమిటసలు?"

    "ఇంకా తెలీదు సార్! యూనియన్ లీడర్స్ అంతా కూర్చుని తయారు చేస్తున్నారు."

    "అసలు గొడవెందుకొచ్చింది వాళ్ళతో?"

    "సగంమంది వర్కర్స్ పనిచేయకుండా నిద్రపోతున్నారండి! నేనూ, అసిస్టెంట్స్ మేనేజర్స్, ఇన్స్ పెక్ట్ చేసి పట్టుకున్నందుకు టూల్ డౌన్ సమ్మె చేస్తున్నారండీ. నైట్ షిఫ్టులో కనీసం రెండు గంటలు నిద్రపోయే హక్కు వాళ్ళ కుందంటున్నారండీ."

    రాజశేఖరానికి నిద్రంతా ఎగిరిపోయింది.

    "వాట్? నైట్ షిఫ్టులో నిద్రపోతారా? దానిని యూనియన్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారా? వెంటనే పోలీసులని పిలిపించి అందరినీ మక్కిలిరగ్గొట్టి బయటకు గెంటించు."

    "అదంత తేలిక్కాదు సార్."

    "ఎందుక్కాదు?"

    "యూనియన్ అధికారపార్టీకి చెందిన యూనియనండీ! అందుకని వాళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ వుంది. అందుకని పోలీసులు రారు. వచ్చినా వర్కర్స్ ని ఏమీ చేయకూడదని లేబర్ మినిస్టర్ ఆర్డర్స్ యిచ్చారటండీ."

    "ఐనో! ఐనో! ఇండియా విల్ గో టు డాగ్స్ వన్ డే! ఈ కాంగ్రెస్ పరిపాలన ప్రజల్లో ఒక్కడిని కూడా పని చేయనీకుండా గూండాలుగా, సోమరిపోతులుగా, తాగుబోతులుగా తయారుచేసింది."

    "యస్సర్!"

    "కావాలంటే పందెం కట్టు లక్ష్మణరావ్! దేశం సర్వనాశనమై పోవడానికి ఎన్నో రోజులు టైమ్ లేదు. పందెం కడతావా?"

    "వద్దు సార్!"

    "ఎందుకని వద్దు?" కోపంగా అడిగాడు రాజశేఖరం. ఎవరితోనైనా పందెం కట్టటమంటే తనకు ప్రాణం.

    "నాది కూడా అదే అభిప్రాయం సార్,"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS