Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 19

    నెమ్మదిగా లేచివచ్చి అతని పెదాల మీద ముద్దు పెట్టుకుంది ప్రేమగా.

    ఒక్కసారిగా రాజశేఖరంలో ఆమె స్పర్శ కోరిక కలిగించింది.

    అలవాటయిన ఆకర్షణ ఆమెని అతని కౌగిలిలోకి చేర్చింది.

    ముద్దులతో శరీరమంతా ముంచెత్తుతోంటే సున్నితంగా అతని చేతుల్నుంచి తప్పించుకుని దూరంగా జరిగింది.

    "వీటన్నిటికీ నేనిప్పుడు అతీతం రాజా! ఐ డోన్ట్ గెట్ ఎగ్జయిటెడ్!"

    "ఎలా మానేజ్ చేస్తావది?"

    "భగవాన్ స్వామి స్మరణతో కళ్ళు మూసుకుంటాను.... అంతే! శరీరంతో సంబంధం లేనట్లయిపోతుంది."

    రాజశేఖరం నిట్టూర్చాడు.


    "ఐ డోంట్ నో .... వెదర్ యూ ఆర్ లక్కీ ఆర్ అన్ లక్కీ!"

    "ఏదయినా ఫరవాలేదు"

    "ఇంకెంత దూరం ప్రయాణం?"

    "తెలీదు"

    "ఇంతవరకూ నీకు తెలిసిందేమిటి?"

    "నేనెవరు? అనే ప్రశ్న రమణమహర్షి ఆశ్రమంలో వేసుకున్నాను. అంతవరకూ ఈ శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిపి 'నేను' అని అనుకునేదానిని. కానీ నేనెవరు అన్న ప్రశ్న సంవత్సరంపాటు వేసుకునేసరికి నేను వేరు, ఈ శరీరం వేరు అన్న విషయం అర్ధమయ్యింది. 'నేను' అనే దానికి చావులేదని తెలిసింది. కానీ శరీరం తాత్కాలికం! ఆ తరువాత నేనెక్కడ వుంటాను?' అనే ప్రశ్న! ఈ శరీరంలోని ఓ పవిత్ర ప్రదేశములో' ఈ అన్న విషయం అర్ధమయ్యేసరికి మరి కొంతకాలం పట్టింది. శరీరంలో దాక్కుని వున్న యీ 'నేను' చుట్టూ ముసిరిన యీగల్లా ఆలోచనలు, ఊహలు! ఈ రెండింటి సంగమంతో సరికొత్త జ్ఞానం కలుగుతుంది. అదే దివ్యమయిన అనుభూతి. అప్పుడు ఆశ్రమాలన్నీ తిరిగి ఆ జ్ఞాన మార్గంలో యింకా ముందుకి వెళ్ళాలనే కోరిక కలిగింది. ఇప్పటికి ఎనిమిది ఆశ్రమాలు తిరిగాను. ఇది తొమ్మిదోదీ"

    "ఇక్కడ ఈ భగవాన్ స్వామి ఏం బోధిస్తున్నారు?"

    "తను భగవంతుని అంశ గనుక తనను ధ్యానిస్తే భగవత్ సాక్షాత్కారం అవుతుందని అంటారు."

    "మరి అయ్యిందా?"

    "ఇంతవరకూ ఆ అనుభవం కలగలేదు కానీ ఆయన పేరు ఉచ్చరించినప్పుడల్లా ఏదో శక్తి ఆవహించినట్లవుతుంది! బహుశా అదే భగవత్ సాక్షాత్కారానికి మార్గమేమో."

    చాలాసేపు అతని బిజినెస్ విషయాలు, ప్రమీల గురించి అడిగి తెలుసుకుంది జూలియా.

    అతను తిరిగొచ్చేస్తుంటే అతనితోపాటు ఎయిర్ పోర్ట్ వరకూ వచ్చిందామె.

    "రాజా! నువ్వు త్వరగా పెళ్ళి చేసుకో! డోంట్ వేస్ట్ యువర్ టైమ్! నీకు కంపానియన్ చాలా అవసరం."

    "అఫ్ కోర్స్! కానీ ఎక్కడో ఏదో ఆశ!"

    ఆమె నవ్వేసింది.

    "ఇంక ఆ ఆశలన్నీ మరిచిపో! నేను తిరిగిరావటం కల్ల! ఒకవేళ వచ్చినా ఇదివరకటి జూలియాని కాలేను. ఓ.కె."

    "ఓ.కె."

    రాజశేఖరం హైద్రాబాద్ చేరుకునేసరికి రాత్రి పదవుతోంది.

    భవనమంతా ఇంకా లైట్లు వెలుగుతూనే వుండటం ఆశ్చర్యం కలిగించిందతనికి.

    మేనేజర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు.

    "వాట్ హాపెన్డ్?" అనుమానంగా అడిగాడు రాజశేఖరం.


    మన స్టాఫ్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే విషయంలో మన ఎస్టేట్స్ స్లమ్ ఏరియాకి వెళ్ళి కొలతలు తీసుకుంటుంటే మల్లేష్ అనే గూండా ఒకడు ఎటాక్ చేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ప్రభుత్వం యిచ్చేసిందనీ అంచేత మనం ఆ ఏరియాలో అడుగు పెట్టానిక్కూడా వీల్లేదని అన్నాడు. పోలీస్ హెల్ప్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో మీ సలహా కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 'ఎస్' అంటే కమీషనర్ గారితో మాట్లాడి పొద్దున్న బుల్ డోజర్స్ తో అక్కడి గుడిశెలన్నీ నేలమట్టం చేసి టేకోవర్ చేసేయవచ్చు."

    రాజశేఖరానికి ఆ గుడిశెల వాళ్ళమీద కోపం ముందుకొచ్చింది.

    "రాస్కెల్స్! ఇండియా అంతా ఇలాంటి మెంటాలిటీయే కనబడుతోంది. ఎవడోకడి సొమ్ము దోచుకోవడమే నేర్పింది ప్రభుత్వం వీళ్ళకు! ఓ.కె.... నేను రేపు మాణింగ్ కమీషనర్ గారితో మాట్లాడతాను. మీరీలోగా బుల్ డోజర్స్ ఓ అరడజను రెడీగా వుంచండి"

    వాళ్ళు వెళ్ళిపోయారు.

    మర్నాడు తెల్లారుజామున అయిదుగంటలకే ఫోన్ మోగింది.

    ఏడింటివరకూ నిద్రపోవటం అలవాటున్న రాజశేఖరానికి చాలా చిరాకు కలిగింది. కానీ తప్పదు. ఎంతో అవసరం, అర్జెన్సీ వుంటేనే తప్ప యీ టైమ్ లో తనను డిస్టర్బ్ చేయరు.

    "ఎస్!" అన్నాడు రిసీవర్ అందుకుని.

    "గుడ్ మాణింగ్ సర్! నేను లక్ష్మణరావును మాట్లాడుతున్నాను"

    "లక్ష్మణరావా?"

    "అవున్సార్!"

    "ఏ లక్ష్మణరావ్?"

    "ఆర్. కె. లక్ష్మణరావ్ ని సార్!"

    "ఏ ఆర్.కె. లక్ష్మణరావ్? అలాంటి పేరుగల వాళ్ళెవరూ నాకు తేలేదు. కీప్ ది ఫోన్ డౌన్" అనేసి మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు.

    రెండు నిమిషాలయినా కాకముందే మళ్ళీ ఫోన్ మోగింది.

    రాజశేఖరానికి వళ్ళు మండిపోయింది.

    "హూ ఈజ్ దట్?" అన్నాడు కోపంగా ఫోనందుకుని.

    "నేనే సార్ ఆర్. కె. లక్ష్మణరావ్ ని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS