Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 18

    రాజశేఖరం నవ్వేశాడు.

    "ఒరేయ్! నువ్వు యూనియన్ లీడరయ్యావ్ కాబట్టి మేము బ్రతికి పోయాంగానీ, ఇదే రాజకీయనాయకుడైతే నీ మాటలు విని జనమంతా కత్తులు తీసుకుని గంటలో డబ్బున్నోళ్ళందరినీ గంటలో పొడిచి చంపేస్తారు."

    "నించనీ! ఫరవాలేదు! వేడి రక్తంతోనే విప్లవం వస్తుంది. క్లాస్ స్ట్రగుల్ జిందాబాద్."

    "క్లాస్ స్ట్రగుల్ సంగతలా వుండనీగానీ- నా స్థలంలో ఎవడో వచ్చి గుడిశెలేసుకోవటం తప్పుకాదంటావా?"

    "ఆ స్థలం నీదెలా అవుతుంది- కమాడిటీ-మనీ-కమాడిటీ స్కీమ్ లో ప్రాఫిటు తాలూకు కాపిటల్ అది- సరే నీలాంటి కాపిటలిస్ట్ గాళ్ళను మార్చడం ఈ వాదనల వల్ల కాదని నాకు తెలుసుగానీ- రెండాటలు కారమ్స్ ఆడదామని వచ్చాను. ఖాళీయేనా?"

    "ఓ రడీ! కానీ ఎంతోకొంత పందెం వుంటేగానీ ఆడటం నా కలవాటులేదని నీకు తెలుసుగా?"

    "నువ్వేకాదు! ప్రతి కాపిటలిస్ట్ మెంటాలిటీ అదే! లాభం లేనిదే ఏ పనీ చేయకపోవటం! ఎంత పందెం?"

    "నేను గెలిస్తే నువ్వు రూపాయి ఇవ్వాలి. నువ్వు గెలిస్తే నేను పదివేలిస్తాను."

    "ఆల్ రైట్  కమాన్."

    ఇద్దరూ లోపలకు నడిచి బోర్డ్ ముందు కూర్చున్నారు.

    అరగంటలో కనకారావు కోపంతో మండిపడుతూ రూపాయి తీసి అతనికిచ్చాడు.

    ఎయిర్ పోర్టులో రాజశేఖరంతోపాటు అంతా విదేశీయులే దిగారు. అందులో కొంతమంది మహిళలు.

    అందరి మెడలో 'స్వామి' ఫోటోలు వున్నాయి.


    ఎవరితోనయినా మాట్లాడే సమయంలో తప్పిస్తే మిగతా సమయాల్లో "భగవాన్ స్వామి, భగవాన్ స్వామి" అని జపించుకుంటారు.

    ఎయిర్ కండీషన్ టాక్సీలు చాలా వున్నాయక్కడ.

    రెండు గంటలు పట్టింది భగవాన్ స్వామి ఆశ్రమం చేరుకోటానికి ఆశ్రమం రిసిప్షన్ కౌంటరీలో జూలియాను చూడడానికి వచ్చినట్లు మెసేజ్ రాసి తనకోసం కేటాయించిన కాటేజ్ చేరుకున్నాడు.

    జూలియా భగవాన్ స్వామి ఇన్నర్ సర్కిల్ లోకి ఈ మధ్యే చేర్చుకోబడినట్లు ఉత్తరం రాసింది. అంచేత మధ్యాహ్నం రెండు గంటలవరకూ బిజీ.

    ఆశ్రమం క్యాంటిన్ లో భోజనం చేసి తిరిగి కాటేజ్ వచ్చేసరికి కాషాయ రంగు చీరలో జూలియా గదిలో వుంది.
    తనను చూడగానే చిరునవ్వు నవ్వింది.

    "హౌ ఆర్ యూ జూలియా?"

    "ఫైన్! థాంక్యూ! భగవాన్ స్వామి."

    "ఇక్కడెంతకాలం వుంటున్నావింకా?"

    "ఇంకా భగవాన్ స్వామి అనుమతి దొరకలేదు. దొరకగానే వెళ్ళిపోతాను."

    "ఈసారి ఎక్కడికి?"

    "మనోహరానందస్వామి ఆశ్రమానికి."

    "ఇలా ఎంతకాలం తిరుగుతావు?"

    "నేనేమిటో అర్ధమయ్యేంతవరకూ."

    "బహుశా అది నీకు ఆఖరివరకూ అర్ధంకాదేమో...." నవ్వుతూ అన్నాడు.

    "ఫర్వాలేదు! తెలుసుకోలేకపోయినా వెతుక్కుంటూ వెళ్ళటంలో కూడా ఆనందం వుంది. నా సంగతి వదిలెయ్ గానీ నీ సంగతేమిటి? మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పాను కదా? ఇంకా చేసుకోలేదా?"

    ఆమె ఆ ప్రశ్న వేసేసరికి రాజశేఖరానికి హఠాత్తుగా తన స్టెనో ప్రమీల గుర్తుకొచ్చింది.

    ఆమెను వివాహం చేసుకోవాలని తను తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు చెప్పాలనిపించింది.

    "చేసుకోవాలనే అనుకుంటున్నాను."

    జూలియా ఆశ్చర్యంగా చూసింది.

    "ప్రామిస్?"

    "ప్రామిస్!"

    "ఎవరితోనయినా ఎఫయిర్ వుందా?"

    "అలాంటిదేమీ లేదు. నా సెక్రటరీ వుంది. ప్రమీల అని! చాలా బ్యూటిఫుల్ వుమన్."

    "ఎంత ఏజ్?"

    "థర్టీ"

    "అంతవరకూ పెళ్ళే కాలేదా?"


    "లవ్ ఎఫైర్ ఫెయిలయ్యిందట! పెళ్ళే చేసుకోకూడదనుకుంది! చివరకు నాతో జత కట్టటానికి వప్పుకుంది."

    జూలియా మోహంలో ఆనందం కనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS