ఈ మధ్య చాలా తరచుగా ఆ ఆలోచనను కలిగిస్తున్నాయి. ఇక్కడ జరిగే సంఘటనలు ఇంతకాలం తనేనాడూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళలేదు. ఏ మంత్రినీ, ఎమ్మెల్ల్యేనీ, ఎంపీని లెక్కచేయలేదు. బహుశా అదే కారణమేమో ఈ మధ్య తరచుగా తనకు సంబంధించిన ఫ్యాక్టరీలూ, ఇతర పరిశ్రమలకు సంబంధించి చాలా అడ్డంకులు వస్తున్నాయి.
అవసరమయితే తను ఫ్యాక్టరీలయినా మూసేస్తాడుగానీ ఎవరికీ తలవంచడు. ఎవరికీ లంచాలివ్వడు. ఎవరికీ తనను శాసించే అవకాశం ఇవ్వడు.
ఇంకొద్ది నిమిషాల్లో మీరు హైద్రాబాద్ నగరంలో దిగబోతున్నారు అన్న అర్ధంతో ప్రకటన వెలువడుతోంది.
సీట్ బెల్టు కట్టుకున్నాడతను.
ఎయిర్ పోర్టు బయట తన కారు సిద్ధంగా వుంది.
సెక్రటరీ సెల్యూట్ కొట్టాడు.
"డైరెక్టర్స్ మీటింగ్ కి కేవలం పది నిమిషాలు టైముంది సార్! తిన్నగా అక్కడికే వెళ్ళిపోదామంటారా?" అడిగాడతను.
"యస్!"
కారు అందమయిన ఓ భవనం ఆవరణలోకి నడిచింది.
అది రాజశేఖరం ఎస్టేట్స్ కి చెందిన గెస్ట్ హౌస్ కమ్ మీటింగ్ ప్లేస్!
సరిగ్గా పదకొండున్నర దాటుతూండగా మీటింగ్ హాల్లో అడుగు పెట్టాడతను. డైరెక్టర్స్ అందరూ గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు.
"సారీ జెంటిల్మన్! రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అఫ్ కోర్స్! తప్పు నాది కాదు. సివిల్ ఏవియేషన్ వాళ్ళది"
అందరూ నవ్వారు.
"ఈ మీటింగ్ ముఖ్యోద్దేశం ఏమిటంటే నేను ప్లాన్ చేసిన అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ గురించి మీకు వివరించటం ఆ కాంప్లెక్స్ బహుశా ఆసియాలోనే పెద్దదవుతుంది."
అందరూ తప్పట్లు కొట్టారు ఎగ్జయిట్ మెంట్ తో.
"అది ఎక్కడ కట్టాలని మీ ప్లాన్?" అడగాడొకతను.
"ఇలారండి" వారిని ఆ పక్కనే వున్న టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.
టేబుల్ మీద దృశ్యం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.
ఒక మురికివాడను చాలా అందంగా కట్టారు ఆ టేబుల్ మీద. గుడిశెలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, విద్యుద్దీపాలు....
"ఏమిటిది?"
"మా ఎస్టేట్స్! సిటీకి సెంట్రల్ ప్లేస్ లో వుంది. చాలా పెద్ద స్థలం. కనీసం పది ఎకరాలుంటుంది. అందులో ప్రస్తుతం ఆక్రమించుకుని వున్న వాళ్ళా యిళ్ళు యివి ఈ స్థలానికి చుట్టూ మెయిన్ రోడ్స్ వున్నాయి. దీని మీద కమర్షియల్ కాంప్లెక్స్ కడితే అన్ని మెయిన్ రోడ్స్ కి ఇది ముఖ్యమయిన కూడలి అవుతుంది. గుండుసూది దగ్గర్నుంచీ, రోడ్డింజన్ వరకూ ఏది కావాలన్నా అన్నీ యీ కమర్షియల్ కాంప్లెక్స్ లో దొరుకుతాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ని కూడా ఓసారి ప్రత్యక్షంగా చూడండి" అంటూ ఆ పక్కనే వున్న బటన్ నొక్కాడతను.
మరుక్షణం పైన్నుంచీ ఓ అందమయిన భవన సముదాయం మోడల్ ఫ్లై ఓవర్స్ తోనూ, రోడ్స్ తోనూ చాలా నెమ్మదిగా ఆ టేబుల్ మీదకు దిగింది.
టేబుల్ మీదున్న గుడిశెలూ, పెంకుటిళ్ళూ అన్నీ ఆ మోడల్ కాంప్లెక్స్ బరువుకి పాడయిపోయినాయి.
అందరూ థ్రిల్ అయి చూస్తుండిపోయారు దానివంక.
"ఫెంటాస్టిక్."
అప్పుడే కనకారావు భుజాన్న సంచీతో లోపలికొచ్చాడు.
వస్తూనే టేబుల్ మీదున్న కమర్షియల్ కాంప్లెక్స్ మోడల్ చూశాడు.
"అరె! భలే బావుందే! ఏమిట్రా యిది?" అడిగాడు కుతూహలంగా.
"మనం కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్ మోడల్! ఇలాంటి మెగా సూపర్ మార్కెట్ లు మన ఇండియాలో లేవు. అమెరికాలోనే వుంటాయి. సమస్తం ఈ కాంప్లెక్స్ లో నుంచి కొనుక్కెళ్ళవచ్చు. ఎనీథింగ్ ఫ్రమ్ ఏసి-ఎన్-ఎన్-టు-ఏరోప్లేన్"
"ఆహా! ఎంతయినా కాపిటలిస్ట్ బ్రెయిన్ కదురా నీది! ఏం చేసినా పైకి అందంగా కనబడుతుంది. కానీ లోపలికెళ్తే అంగుళం అంగుళానికి దోపిడీ! ఎక్కడ కడుతున్నావురా ఇది?"
"మన ఎస్టేట్స్ కి సంబంధించిన స్థలంలోనే! అటు సికింద్రాబాద్ కీ యిటు హైద్రాబాద్ కీ జంక్షన్ అనుకో."
కనకారావు వులిక్కిపడ్డాడు.
"అంటే ఆ లెటర్ కాలనీలోనా?"
"అవును!"
"మరి ఆ కాలనీ ఏమవుతుంది?"
"వాళ్ళంతా ఆక్రమణదారులు! ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే పోతారు! మనకెందుకది?"
కనకారావు కళ్ళలో ద్వేషం కనిపించింది.
"ఒరేయ్! అందుకే మీ కాపిటలిస్ట్ లందరినీ మర్డర్ చేయాలని చెప్పేది! అసలు మిగతా మనుషుల్ని మనుషుల్లా చూడరేమిట్రా? పౌల్ట్రీ ఫామ్ లో పెరిగే కోళ్ళకన్నా అన్యాయంగా చూస్తారు. డబ్బులేని వాళ్ళెవరూ నగరం నడిబొడ్డున వుంటానికి వీల్లేదు- వూరి బయటుండాలి! కదూ? అసలు డబ్బులేనాళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే పీడా వదిలిపోతుంది కదురా దేశానికి? కానీ అలా చేయరు! ఎందుకో తెలుసా? నగరంలో చెత్తాచెదారాలు వూడ్చి క్లీన్ చేయడానికి, బిల్డింగులు కట్టి పెట్టటానికీ, ఫ్యాక్టరీలు నడపడానికీ- అన్నిటికీ వీళ్ళు కావాలి! అయినగానీ వీళ్ళు సెంటర్ లో వుండటానికి వీల్లేదు. నగరం అవుట్ స్కర్ట్స్ లో వుండాలి. శభాష్ తప్పట్లు కొట్టండందరూ" కనకారావుతో పాటు మిగతావాళ్ళంతా కూడా తప్పట్లు కొట్టారు.
