ఆ లేబర్ కాలనీలో వాళ్ళందరూ వాడేంచెపితే అది చేస్తారు. తనకు తెల్లారిలేస్తే ఆ కాలనీవాళ్ళతోనే పనులుంటాయి.
అందుకని ఆ శంకర్ ఏం మాట్లాడినా సహించాల్సొస్తుంది. డబ్బు ఎంత డిమాండ్ చేసినా ఇవ్వాల్సివస్తోంది.
తను ఆ రెండింటికి భయపడటం లేదు. ఆ శంకర్ గాడు తనను వదిలేసి స్వంతంగా ఈ ఆక్రమణల దందా మొదలుపెడతాడేమోనని భయం.
వాడా వ్యాపారం మొదలుపెడితే మాత్రం కొద్దిరోజుల్లోనే తనను మించిపోతాడు. ఎందుకంటే ఆ వ్యాపారంలో మంచి చెడ్డలన్నీ వాడు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు తన దగ్గర.
మల్లేష్ బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని కిందపడ్డ నోట్లను ఏరుకున్నాడు.
"అరె నీ యవ్వ! ఎంత కోపంరా నీకు! దిల్లగీ కిచ్చినారా ఆ డబ్బు పాగల్! ఎంతకావాల్నో నువ్వే తీస్కో! నీకు నేనిచ్చెడిదేముందిరా" అంటూ తన బ్యాగ్ అతని ముందుంచాడు.
శంకర్ బ్యాగ్ తెరచి చూశాడు.
లోపల అన్నీ ఇరవై నోట్ల కట్టలు, పది నోట్ల కట్టలు!
అదంతా మల్లేష్ కావాలని ఆడుతున్న నాటకం!
తను అందులో వున్న డబ్బంతా తీసుకున్నా అయిదువేలు కూడా ఆపదు.
మల్లేష్ అతనివేపు ఆత్రుతగా చూస్తున్నాడు.
మొత్తం బ్యాగ్ తీసుకుని చేత్తో పట్టుకున్నాడు శంకర్!
"ఇది కూడా తక్కువే అసలు?" అన్నాడు నిష్ఠూరంగా.
మల్లేష్ కి గుండె ఆగినంతపనయింది.
"అయిదువేలు తక్కువా?"
"అవును. నీకొచ్చే సంపాదనతోటి జూస్తే ఏ మూలకిది? ఇగో.... మల్లేషన్నా! ఖుల్లా జెప్తున్నా ఇను! ఇకముందు గిసంటి దందాలు జేయాల్నంటే నాగ్గూడా షేర్ ఇయ్యాలె! కూలిగాని లెక్క జీతంగాదు. ఏమంటున్న?"
మల్లేష్ కి నోటమాట రాలేదు.
ఏదొక దినం వాడు తనకు నీళ్ళు తెస్తాడనుకున్నాడు గానీ ఏదొక రోజు కాదు-గిప్పుడే తెచ్చిండు.
"అట్లానే బిడ్డా! అట్లనే ఇస్తా" అన్నాడు కసిగా. వాళ్ళు వెళ్లిపోయాక కోపం పట్టలేక మేడమీద గదిలోకెళ్ళి లోపలున్న సైకిల్, దానికి తగిలించిన చెప్పుల ముందు డాన్స్ చేయటం ప్రారంభించాడతను.
* * * * *
బాంబే విమానాశ్రయం చాలా సందడిగా వుంది.
రాజశేఖరం హడావుడిగా సెక్యూరిటి చెక్ నుంచి బయటపడి ప్లేన్ లోకి చేరుకొని ఫస్ట్ క్లాసులో కూర్చున్నాడు.
స్పీకర్ లో ఎయిర్ హోస్టెస్ ఎనౌన్స్ మెంట్ ఇస్తోంది వరుసగా. ఫ్లైట్ స్టార్టయింది.
"హైద్రాబాద్ నగరానికి మీ ప్రయాణం ఎంతో సుఖంగా, ఆనందముగా జరగాలని మా ఆకాంక్ష" అందామె గొంతు.
రాజశేఖరం తన పక్కనుంచీ చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తూ వెళ్తోన్న ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు.
"వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్?"
"ముందు ఆ తెలివితక్కువ ఎనౌన్స్ మెంట్ ని స్టాఫ్ చేయమని చెప్పండి."
ఆమెకు అతని మాటలు అర్ధంకాలేదు.
"ఏమిటి సార్ అన్నారు?"
"ఆ పిచ్చి ఎనౌన్స్ మెంట్ ఇంకోసారి చేయవద్దని చెప్పండి"
"ఏమిటి సార్ అది?"
"అదే.... ప్రయాణం క్షేమంగా, సౌఖ్యంగా జరగాలని"
"అందులో తప్పేముంది సార్?"
"తప్పేమీలేదు.... కానీ మీ డిపార్టుమెంట్ కి కొంచెం సిగ్గుండాలి. గంటన్నర లేటుగా బయలుదేరుతుంటే ఆ మాటలనడానికి. గంటన్నర లేటువల్ల ఇప్పటికే మా ప్రోగ్రామ్స్ అన్నీ సర్వనాశనమయిపోయినాయి. ఇంకా క్షేమంగా, సౌఖ్యంగా ఏమిటి? మీనింగ్ లెస్ టాక్."
ఆమె అతని కోపం చూసి భయపడిపోయింది.
"సారీ సర్! ఆమె ఇంకోసారలా చెప్పకుండా జాగ్రత్త తీసుకుంటాం"
"థాంక్యూ!"
ఆమె వెళ్ళిపోయింది.
రాజశేఖరం అసహనంగా టైమ్ చూసుకున్నాడు.
ఉదయం పది గంటలకు తన పరిశ్రమల మేనేజర్లతో ఏర్పాటుచేసిన మీటింగ్ రద్దయిపోతుంది.
ఇకపోతే పదకొండున్నరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటుంగుంది. కనీసం దానికయినా అందుకోలేకపోతే చాలా ప్రోగ్రామ్స్ అప్ సెట్ అయిపోతాయి.
వాళ్ళందరూ సాయంత్రం ఫ్లైట్స్ కి రిటర్న్ జర్నీ బుక్ చేసుకుని వుంటారు.
అతను సీట్లో వెనక్కు వాలాడు చిరాకుగా. ఈ దేశం ఎప్పటికయినా బాగుపడుతుందా అన్న అనుమానం కలిగిందతనికి.
