Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 15

   
    "అదేం సార్ గట్లంటవ్! నువ్వే గదా ఆ దినం పార్టీలో ఏ జాగా కావాలంటే అది తీస్కో. నాకు మాత్రం రెండు కోట్ల రూపాయలు కావాల్నంటివి? నీ పైసలు నీకిచ్చినానా లేదా?"

    "పైసలిచ్చావయ్యా! కానీ ప్రభుత్వం పరువు మర్యాదలేమయి పోతాయి? ఈ విషయం రాయొద్దని పత్రికలోళ్ళందర్నీ బ్రతిమాలి ఇటొచ్చా! ఆ కాగితాలిటిచ్చేయి- వేరే స్థలమిస్తా."

    "ఇప్పుడెట్లా సార్? ఆ బిల్డింగ్ పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టటానికి బిల్డర్స్ దగ్గర నేను అడ్వాన్స్ లు కూడా తీసుకున్నా! ఆ పైసలు వాపస్ జేయాలి కదా!"

    ముఖ్యమంత్రి తల పట్టుక్కూర్చున్నాడు.

    "నా పదవి గోవిందా- నన్ను ముంచేస్తావు నువ్వు."

    "మీకేం కాకుండా నేన్జూస్తాసార్! సెంటర్ లో ఏ మంత్రి గావాల్నంటే ఆ మంత్రితో పరిచయమున్నది మనకు! ఎంతమంది ఢిల్లీ వాండ్లకు బంజారాహిల్స్, బంజారాహిల్స్ల్ ల జాగా కబ్జాజేసి ఇచ్చినానో మీ కెరుక లేద్సార్! ఎవ్వళ్లయినా గానీ మనమేం జెప్తే అది జేయాలె! నా మాటిని ఆ అసెంబ్లీ భవనం పాతదయిపోయిందనీ, ఏ దినమయినా కూలిపోతదనీ, అందుకే అది అనాధశరణాలయానికిచ్చి కొత్త అసెంబ్లీ భవనం కదతన్నాననీ స్టేట్ మెంటివ్వు! ఎవ్వరూ కాదనరు. కావాల్నంటే పత్రికలోళ్ళ నోరు నే మూయిస్త! చాలా మళ్ళీ?"

    ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడలేదు.

    "సరే! కానీ!" అన్నాడు నీరసంగా బయటకు నడుస్తూ.

    మల్లేష్ ఆనందంగా తన గదిలోకొచ్చాడు.

    సోఫాలో కూర్చుని విదేశీ మద్యం తాగుతున్నారు శంకర్ మోహన్, మల్లిఖార్జునరావులు---

    "ఏమిరా! ఇంకో బాటిల్ కావాల్నా?" అడిగాడు మల్లేష్.

    "వద్దన్నా! సాల్! మస్త్ అయిపోయింది" అన్నాడు శంకర్.

    "అవ్వన్నా! సాలు" అన్నారు మిగతా ఇద్దరూ తూలుతూ.

    మల్లేష్ తన బ్యాగ్ లో నుంచి నోట్లకట్టలు కొన్ని తీశాడు.

    "ఆ రాజశేఖరం ఎస్టేట్స్ కాలనీలోకెళ్ళి ఎంతమందిని తెచ్చిన్రు మీటింగ్ కి?" అడిగాడతను.

    "మూడొందలమందన్నా - పిల్లగాండ్లు అరవై"

    మల్లేష్ డబ్బు లెక్కబెట్టి వారికిచ్చాడు.

    "ఇగో! పెద్దోండ్లకు యాభై, పోరగాండ్లకు ఇరవై-లెక్కకట్టి ఇచ్చినా"

    శంకర్ డబ్బు అందుకున్నాడు.

    "మరి మా సంగతేం జేసినావన్నా?" అడిగాడు శంకర్.

    ముగ్గురికీ తలో అయిదు వందలు ఇచ్చాడతను.

    "ఖుష్ హైనా?"

    "హమ్ ఖుష్ హై సాబ్!" అన్నారు మోహన్, మల్లిఖార్జునులు.

    కానీ శంకర్ ఆ నోట్లను మల్లేష్ మీదకు విసిరికొట్టాడు.

    "మేమేం బిచ్చగాండ్లం కాదున్నా! ఈ మీటింగ్ గురించి నేనెన్ని దినాలకెళ్ళి పన్జేస్తుంటినో మరిచినావా? ఒక్క మీటింగ్ ల కోట్ల రూపాయలు కాజేస్తివి గవర్నమెంటులోన. నన్ను మంచిగజూస్తూనే నిన్ను నేను మంచిగజూస్తేనే నిన్ను నేను మంచిగ జూస్త యాదుంచుకో" కోపంగా అన్నాడు శంకర్.

    మల్లేష్ కోపాన్ని అతి కష్టంమీద అణుచుకున్నాడు.

    అతనికి గత కొద్దిరోజులుగా శంకర్ తో కొంచెం చిరాకుగానే వుంది, ఎప్పటికయినా వీడు పాములా మారి తనను కాటువేస్తాడనిపిస్తోంది. అయితే వాడినెలా వదిలించుకోవాలో తెలీటంలేదు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS