
పొద్దుగాల సుంకులమ్మ నిదర లేచెతలికి అంబటాల అయినది. సెయ్యంత నొస్తన్నది. రెయ్యంత నిదర లేకుండె కద? కండ్లల్ల మంటలు, పక్కమీకెల్లి లేస్తమనేతలికి కాళ్ళు, సేతుల బలమంతా పోయినట్ల ఉంది. నూరేండ్ల ముసలితనమంత ఒక్కమాటే మీదకొచ్చి పడ్డట్ల ఉన్నది.
'అవ్, నేనింక బతికిన ఎవలికేం లాబం? పోనీ. సస్త! అంతెకద?' అనుకుంట కూసుంటే చంద్రం ఆడికొచ్చిండు.
"అమ్మ!"
"లేవలేకుంటే, బిడ్డా!" అన్నది సుంకులమ్మ.
"నేనున్న కదమ్మ?" అంట సేయిబట్టుకోని నడిపిచ్చిండు.
"సెంద్రయ్యా, నీకిట్ల యింకెన్ని దినాలు కష్టం యియ్యాల, తెలవకున్నదిరా!"
"అట్లనకమ్మ!"
"కాదు, బిడ్డ! దినాము నిదర లేస్తుంటే, ఒక్కొక్క దినం సావుకు దగ్గిరయితున్న ట్లుంది."
"లేదమ్మ, నీకేం పర్వలే. నీకేమి కాదు. నేనున్న కద?"
"ఏందో, బిడ్డా! మనుసు కట్లనిపిస్తఉంది. మీ నాయన కూడ యిట్లనే అంటుండే. అండ్ల నిజం యిప్పుడు నా కెరికయితున్నది."
"ఏమిలే, అమ్మ. నాయనతాన నేను లేకుంటి. అందుకోసానికే అట్లయింది. ఇప్పుడు నీకేమి కాదు."
"అవ్, బిడ్డా! అదొక్కటే మనుసుకు కుదురు. నీ సేతుల్ల ఏంటి జరిగిన పర్వలే" అన్నది.
సుంకులమ్మ పాలుతాగి మల్ల పండుకొన్నది. కునుకు వట్టింది.
ముత్తాలు వచ్చింది. రాడం, అత్త కాళ్ళ మీదపడి ఏడ్సెతందుకే వచ్చింది. అత్త కండ్లు మూసికొని ఉన్నది.
చంద్రం ఆడికొచ్చిండు. "ముత్తాలు! ఏంది, నువ్వు కూడ అట్లేడుస్తవ్? ఈ ధునియల జరిగినయన్ని మన మంచికే అనుకొనాలె. నవ్వుత సేతులు సాపాలె లేకుంటే మన సేతులు యిరిసికట్టన్న, గొంచుపోతరు. ఇగ్గో, ముత్తాలు! కమేలకు పోయెడి మేకలు కూడ నవుకుంటనె పోయెతప్పుడు నువ్వు పెండ్లంటే కండ్లు తడుపుకుంట వేంది, మల్ల?" అన్నడు చంద్రం.
"బావ!"
"సెప్పు, ముత్తాలు!"
"కమేలకు పోయిన బయంలేదు, బావ! ఆడికన్న నువ్వు గొంచుబోతె నవుకుంటనే పోత!"
"ముత్తాలు! నీ మనసంత నా కెరికెనే. ఇప్పటికే అమ్మ గుండె సెదిరినది. నిన్నిప్పుడు యాడికన్న గొంచుబోయి పెండ్లి సేసుకుని తందుకు కూడ పనికిరానోన్ని! దొంగసాటున పెండ్లి సేసుకోని నిన్ను యింట్లకు తీసుకస్త, అమ్మ కూడా నాకు దక్కదు" అన్నడు.
ముత్తాలు కండ్లు తుడుసుకున్నది. తడుసుకొని నగింది. "మంచిది, బావ! అట్లనే కానియి. మల్ల ఎన్నడు నీతాన ఏడ్వను, అత్తకు మొక్కు కోని పోత" అన్నది ముత్తాలు.
చంద్రం మాటాడలే.
ముత్తాలు పోత, ఆగింది.
"బావ! నువ్వు పాడగొట్టుకొన్న బటువు యిగ్గొ! నాకోసానికన్న ఏలికి వెట్టు కో!" అన్నది.
చంద్రం ఆమె ముకం ల సూసిండు.
"యాడి కెల్లొచ్చిందంట అడగొద్దు, ఇది నా ముచ్చట" అంట వాని ఏలుకు ఆమె బటువు తగిలిచ్చి యింట్ల కెల్లి పారింది.
చంద్రం ఆమె దిక్కుకు సూస్తనే ఉన్నడు.
సుంకులమ్మ మంచం మీన పండుకొని ఉన్నది.
పదేను దినాల్ల మనిసి కట్టె లెక్కనే అయింది.
లక్ష్మయ్య, పెండ్లం యింటికొచ్చి, పెండ్లికి పిలిసిపోయిన్రు. పదేను దినాల సంధి జరుగుతున్న యేమి ఆమెకు ఎరికె లేవు. సుంకులమ్మ మనుసుల్ల లేదు.
పదేవ దినం పొద్దుగాల-
ముత్తాలు మెడల రాములు పుస్తె కట్టెటి యేల-
ఊరోల్లంత తరలి పెండ్లి పందిట్ల కొలువున్న యేల చంద్రం తన గుడిసెల, అమ్మతాన కూసోని గొంతుల తులసి నీలు పోస్తున్నడు.
లక్ష్మయ్య కొత్త అల్లునికి కొత్త బట్టలు కప్పివయేల. గుడిసెల చంద్రం తల్లిమీద పాతపచ్చడం కప్పి, రొండు సేతుల్త కండ్లు మూసుకున్నడు!
8
'తవ్విడు బియ్యం, బెబ్బెర బుడ్డలు
తోసుక రావే పెడకోలా!"
కూనపులాయన మొగ్గం తానొచ్చి అన్నడు.
చంద్రం తల పైకెత్తి సూసిండు.
"బావనారుశి కొడుకు యిసొంటి పనోడంట ముచ్చటయితున్నది, బిడ్డా!" అన్నడు కూనపులి ఆయన.
"నాదేమున్నది? ఇంతకంటే మంచి పని చేసెటోండ్లు దేశంల లెస్సగున్నరు. అచ్చ! కూసొ" అన్నడు చంద్రం.
కూనపులాయన యీ మాట, ఆ మాట సెప్పి, మల్ల యింకో యింటికి పోయిండు, పోత, తన మామూలు తీస్కనే పోయిండు.
కూనపులోండ్లు కూడ సాలోండ్లె. ఏటేట వాండ్ల తానె అడుక్కునేతందు కొస్తరు.
"మీ పేరు కూనపులోండ్లంట ఎట్లోచ్చింది సెప్ప "మంటున్నడు చంద్రం. అప్పుడు కూనపులాయన సెప్పిండు!
"సూరియ దేవుని కూతురు బద్రావతి. బద్రావతి శాన అందగత్తె. ఆమెకు లగ్గం చేస్తమంట దేవుడనుకున్నడు. పులిని పట్టెమొగోన్నె పెండ్లి సేసుకుంటనంట బద్రావతివ్రతం పట్టి ఉండె. 'అట్లనా' అనుకున్నడు బావ నారుశి. బావనారుశి యాడుంటే ఆడ, పుల్లు ఎంబడుంటయి. బద్రావతిని పెండ్లి సేసుకునే తందుకు బావనారుశి ఆమెతాన బోయిండు. ఆయన ఎనకనే నూర్ల పులికూనలు, వచ్చినయి. లోపలకు పోత, బయట పులికూనల కాసెతందుకు, రొమ్ముమీద మన్ను నలిపి మనిసిని చేసిండు. పానం పోసిండు. వాడె కూనిపులి వాడు. వాని సంతతి వాండ్లె కూనపులోండ్లు" అన్నడాయన.
ఏటేట సాలోండ్లతాన అడుక్కునే తందుకు యిట్లనే వీండ్లొస్తరు. కతలు సెప్తరు. సాధనా శూరులంట కూడొస్తరు గాని, వాండ్లు యిందరజాలం యిద్దెలు గిట్ట సూపిస్తరు. సాలోండ్ల తానె సేస్తరయి.
సాలోని బతుకే పెద్ద కష్టం. ఇంక వానితాన పనిచేసి అడుక్కునేటోండ్లు కూడ ఉన్నరు. పన్నెగట్లోండ్లున్నరు. కుంచెరికెలోండ్లున్నరు. గోనెబర్రెలోండ్లున్నరు. ఇట్లనే.
కూనపులాయన పోయినంక మల్ల మొగ్గం పని దబ్బ దబ్బ శురు చేసిండు చంద్రం. పెరుగు వేసినంక చక్కర బద్దె ఏపి పాట్టెలు కోసి ముడులేసిండు. గూటాల కెల్లి దొన్గ తీసి సీరె యిప్పిండు. మంచమాల్చి, సీరెమీన పరిసిండు.
ఇన్ని దినాలకు ముత్తాల పందిరి సీరె తయారయింది! ఎవ్వరు అనుకోనంత మంచిగ, సక్కగ తయారయింది.
'అమ్మ సూస్తే ఎంత ముచ్చట పడెడిది!' అనుకున్నడు చంద్రం. 'అవ్, అమ్మ ముచ్చట కోసానికే యీ సీరె నేసిన! కాని, సీరె తయారయ్యెతలికి నాకు అమ్మనే లేకుంటపోయిందీ!' అనుకున్నడు.
ఇంతం, యీదులకెల్లి ఒకాయన వచ్చిండు.
ఆయ నన్నడు: "నీతాన కొత్త నమోనాల మంచి సీరె ఉన్నదంట కూనపులాయిన సెప్పిండు, నేను పట్నం కెల్లొచ్చిన, అమ్ముతవా?"
"గ్గదా?" అంట ముత్తాల పందిరి దిక్కుకు సూబిచ్చిండు.
"అవ్, అదె ఉంటుండొచ్చు!" అంట ఆడికి పోయి సీరె నాడెం సూసుకున్నడు. "నూర్రూపాలు" అన్నడు.
"అమ్మ నన్నను కద?" అన్నడు చంద్రం.
"అచ్చ, యింక యిర్వై చాల్త యా?"
"నూట యిర్వై కాదు, నన్నూటయిర్వై యిచ్చిన యీ సీరె యిచ్చేడిది లేదు!" అంట మల్ల అన్నడు.
బేరగాడు వాని ముకం సూసిండు. "ఇంట్ల ఆడోండ్ల కా?" అంట నగిండు.
చంద్రం వాని దిక్కుకు సూడలే.
బేరగాడు పోయిండు.
మంచం మీ కెల్లి సీరె మంచిగ మడత వెట్టి సందుకుల దాసిండు చంద్రం.
'ఇన్ని దినాలకు అమ్మ ముచ్చట తీరినది. ముత్తాల పందిరి సీరె నేసిపెట్టిండు.' చంద్రం మల్ల సొంచాయించిండు. 'నేస్తెనె ఏమాయె? ముత్తాలు కొరకు అమ్మ నేసిచ్సింది. అమ్మ బతికుంటే, ఆమెనే ముత్తాలుకు కట్టిసిచ్చి, సూసుకొని మురిసిపోయెడిది. ఈ సీరె ముత్తాలుదె!
'అమ్మ సచ్చిపోయింది. ఇప్పుడు ముత్తాలుకు యీ సీరె ఎట్లియ్యాలె? అమ్మ బలి కుండంగ ఒక్క తేన వచ్చి ఉండె ముత్తాలు. మల్ల రాలే! అవు, ఎట్లొస్తది? నా ముకం ఎట్ల సూడగల్తది?
'ముత్తాలుకు నేనె అన్నాలం నేసిన! ఏమన్న కాని, ఆమెను గొంచుబోయి పెండ్లి సేసుకునె తందుకు గుండెల బలం లేకుండే. ఏమి సెయ్యాలె మల్ల? కమేలకె తోలిపిచ్చిన!' చంద్రం మూలి గిండు. 'ఎట్లన్న కాని, యీ సీరె ముత్తాలు కొరకు నేసినది. ఆమెకే యియ్యాలె. ఇది అమ్మ ముచ్చట, నా ముచ్చట కూడ. ముత్తాలు పందిరి సీరెను ముత్తాలు దప్ప ఎరెవరు ముట్టు కునేతందుకు కూడ యీల్లేదు. ముత్తాలుకె యియ్యాలె! కడసారిగ నే నామె కిచ్చెడి దిదె!' అంటనుకున్నడు చంద్రం.
ముత్తాలు పెండ్లి అయినంక లక్ష్మయ్యకు పానం కుదురుగయింది. ముత్తలును తన కొడుక్కు యియ్యాల్నంట అక్క యాడ లొల్లి చేస్తదోనంట శాన బయమయుండె. అక్క ఏమిలొల్లి సెయలే. మంచిగయింది. రాము లేడ, సెందిరిగాడేడ?' అనుకున్నడు.
ముత్తాలును గొంచబోయెతందుకు రాములు పట్నం కెల్లొచ్చిండు. సొమ్ములు, బట్టలు గిట్ట మంచిగవెట్టి ముత్తాలును మగనిత పంపిన్రు.
ముత్తాలు మగనిత బండి ఎక్కింది.
"సీరేయినాదిత?" అంట అడిగెతందు కొచ్చినది మాలి పటేల్ పెండ్లం.
"హవ్, అత్త! సూస్తవా?" అంట సందూ కుల దాసిన ముత్తాల పందిరి సీరె తీసి సూపిచ్చిండు చంద్రం.
"మంచిగుంది, బిడ్డ! నీ పనితనం సూసెతందుకు యీ కండ్లు సాలవు!" అన్న దామె. "ఇది మనుసులు కట్టేటిది కాదు, సెంద్రయ్యా, దేవతలకు పెట్టేటిది!"
చంద్రం తల దించుకొని యింటున్నడు.
"సెంద్రయ్యా!"
"ఏం దత్త?"
"మీ ముత్తాలు యియ్యాల మగనిత పట్న మెత్తున్నదంట, ఎరికెనా?"
"నిజమా, అత్త?" అంటడిగిండు చంద్రం.
"ఏమొ, బిడ్డా! నాగయ్య తల్లి సెప్పి ఉండె."
"అట్ల!"
"అవ్ ఎవలి మంచి సెడ్డలు ఎట్లున్నగాని, ఒక్కతేప పోయి సూసిరా, బిడ్డ! లేకుంటే ఎర్రి పిల్ల ఏడ్పుతది!" అన్నదామె.
ఆమె పోయినంక, శాన సేపటిదన్క చంద్రం అట్లనే, సీరె సూసుకుంట, సొంచాయించు కుంట కూసున్నడు.
ఎండ సుర్రున పాకూతున్నది. గాలి రయ్యిమంట కొడుతున్నది.
చంద్రం లేసిండు. ముత్తాల పందిరి సీరె సంచిల వెట్టుకోని, యింట్ల కెల్లి ఒయిలెల్లిండు.
ఎండ నెత్తి మాడుస్తనే ఉంది.
చంద్రం నడిసిండు. కొంచెం దూరం ఎద్దుల బండిమీద ఎల్లిండు. పేటల, టేశనుతాన రేల్గాడి ఆగి ఉన్నది. మంది తొందర తొందరగ ఎక్కుతున్నరు. చంద్రం పది పైసలకు టికెట్టు కొనుక్కోని టేశన్ల కెల్లిండు.
చంద్రం కండ్లు ముత్తాలు కోసానికే ఎతుకుతున్నయి. ఒక్కక్క డబ్బ సూసుకుంట
పోతుండు.
"ఆఁ!" అంట సూసిండు చంద్రం. ఒక డబ్బల ఆలుమగ లిద్దరు కూసునున్నరు.
రాములు వానిని సూసిండు. ముత్తాలు సూడలే.
చంద్రం ముత్తాలును పిలుస్తమంటను కున్నడు.
రేల్గాడి కదిలింది.
ఏమి సొంచాయించుకునెదంక చంద్రంకు పుర్సతు లేకున్నది. తొందర్ల, దొరికిన డబ్బుల ఎక్కి కూసున్నడు. పక్కటేశన్ల దిగి, ముత్తాలుకు సీరె యిచ్చి మల్రి వస్తమనుకున్నడు. డబ్బాల కూసోని, సంచి తలకింద వెట్టుకొని, జరసేపు పండిండు. కండ్లు మూతలు పడినయి.
చంద్రం నిదర లేచెతలికి పట్నంల లేతగ పొద్దు కాబట్టినది.
మంది అంత దిగుతున్నరు. డబ్బ అంత కాలి అయినది. చంద్రం కూడ దిగిండు.
ముత్తాలు, మగడు అప్పటికే టేశను దాటి పోతున్రు.
చంద్రంను ఆడ టికట్లాయిన పట్టుకున్నాడు. వాని కాల్మొక్కి, అయిదు రూపాలు లంచమిచ్చి, అయిదు రూపాలు పుస్తకంల రాపిచ్చుకొని బయట పడిండు.
ఇంతట్ల ముత్తాలు, మగడు టాంగాల కూసోని పోతున్రు.
ఏరె రక్షవోని పిలుసుకోని టాంగా దిక్కుకు గొంచుబో మంటన్నడు చంద్రం,
రక్ష కదిల్నది.
టాంగ బవంతి ముంగలాగినది. ఒక లంబ డామె యింట్ల కెల్లొచ్చి ముత్తాలును లోపలకు గొంచబోయింది. ఇంక యిద్దరు పనాండ్లొచ్చి సామాండ్లు గిట్ట లోపలకు మోసుకపోయిన్రు. రాములు పోయి దర్వాజ బందు సేపిచ్చిండు.
చంద్రం రక్ష దిగిండు.
దర్వాజ బందున్నది!
కండ్లల్ల నీలు తిరిగినయి.
ఎనక్కు తిరిగొచ్చిండు. పెద్ద సడాకుల ఒటేలుకు బోయి రూపయిచ్చి బువ్వ తిన్నడు.
మల్ల దర్వాజ కోసానికె సూస్తుండు. ఎవ్వరు తెరవలే. పొద్దంత అయినంక, ఆడికి పోయి పిలిసిండు. ఎవ్వరు పలకలే.
రెయ్యి బువ్వ తినకుంట, ఒకతాన దుకనం సీడిమీన వండిండు. మల్ల పొద్దుగాల లేస్తనే పోయిండు. దర్వాజ అట్లనే ఉండే. ఎవ్వరు పలకలే. చంద్రం పానం యాష్టొచ్చినది.
'మల్ల ఎట్లన్న, యింత దూర మొచ్చినంక సీరె యీకుంట ఎట్లా పోత?' అనుకున్నడు. అందుకోసానికే మూడు దినాలు సూసిండు.
మూడో దినం పొద్దుమీకి, ఆ యింటెనకాల గల్లిల వోయిండు చంద్రం. ఆడ తీరుతీర్ల ఆడోండ్లు సిన్న దర్వాజాల్ల నిలుసోని వచ్చె పోయెటోండ్లను సూస్త, కండ్లత సైగలు చేస్త నవుతున్రు.
చంద్రం నవుకున్నడు.
ఇంక జర ముంగలికి పోయెతలికి, రాములు యింటికి ఎనక గుమ్మం గురుతు తెలిసినది.
లంబడామె యింట్ల కెల్లొచ్చింది. చంద్రం కాళ్ళు ఆడనే ఆగినయి.
"ఏంది, సిన్న దొర, అట్ల సూస్తవ్?" అంటడిగిందామె.
"నువ్వు లక్కి కాదు?"
