Previous Page
ముత్యాల పందిరి పేజి 17


    
    "అవ్, సిన్న దొరా! నీది ఉయ్యాలవాడన్న వులే?"
    "అవ్! రాములింట్ల ఉంటున్నావు?" అంటడిగిండు చంద్రం.
    "ఆయన నీ కెరికెనెనా?"
    "మా ముత్తాలు మొగుడే కద?"
    "అట్ల? ముత్తాలు మీ మామ బిడ్డలే?" అంటడిగింది లక్కి.
    "మా మామ బిడ్డనే! ఒక్క తేప సూసి పోద మంటొచ్చిన" అన్నడు చంద్రం.
    "అట్లనా? మల్ల లోపలకు రారాదు?" అన్నది లక్కి.
    "వస్త కాని, ముత్తాలుత ఒక్కతాన మాటా డాలె!" అన్నడు చంద్రం.
    "రా బిడ్డ! నేనున్న కద?" అంట లక్కి వాన్ని లోపలకు గొంచబోయింది.
    ఇల్లు శాన పెద్దది. ఇంట్ల మనుసు లింకెవరు కనిపియలేదు.
    చంద్రంను లక్కి ఒక్కతాన కూసోవెట్టింది.
    "లక్కి!"
    "ఏంది, సిన్నదొర?"
    "మా ముత్తాలు పున్నెం చేసుకున్నది!"
    "ఇల్లు సూసి అట్లనుకుంటున్నావు, దొర?" అన్నది లక్కి.
    "వాని సొంతం కాద?"
    "కాదు. ఇయ్యేయి వాని సొంతం కాదు."
    "మల్ల బజార్ల దుకనం?"
    "అంత వానిది కాదు."
    "అచ్చ! పోనీ, ముత్తాలును మంచిగ సూసుకుంటడా?"
    "ఏమి మంచో, ఏందో, సిన్న దొరా! వాని గొనం సక్కగలేదు."
    "ఏమట్ల?"
    "మనసు మంచిది కాకుంటే ఎంత సురుకున్న ఏమి లాబం, సిన్న దొరా? నమ్ముకున్నోండ్లనే గలగల దించ్సతడు."    
    "ఏమాయె?"
    "నా అసోంటోండ్ల నెందరినో పెండ్లి సేసకుంట తెచ్చేడిది, అవుసరం తీరినంక బేరగాండ్ల కమ్మేడిది."
    "మనుసుల నమ్ముతారు?"
    "ఈడ జరిగేడిదే అది, దొరా! రాజస్థాన్ ల గిట్ట ఆడోండ్లు తక్కవుంటరులే. ఆడికి వయసు పోరిలా నందర బట్టుకోని యీడికెల్లి బేరగాండ్లు పంపుతడు. ఆడ మల్లా ఏరేవోండ్ల కమ్ముతరు. వాండ్లు, వీండ్లను అంగండ్లల్ల వెట్టి, మొగోండ్లత జత కూర్పుతరు. వీండ్ల కింత బువ్వ పెట్టా; వాండ్లు జేవులు నింపుకొనా!" "ఇంత గోరం జరుగుతుంటే సూస్త ఊరు కుంటున్రా?"
    "ఎవలూకుంటడు? తెలిసిన తాన పట్టుకుంటనే ఉన్నరు."
    "అసాంటి గోరం చేసెటోండ్లను పంపిన పాపంలేదు!"
    లక్ఖి నగింది. "ఏంది సెప్తవ్, సిన్న దొరా! ఆ మాట కొస్తే, వాండ్లల మీ మామ అల్లుడే మొదటోడు."
    "రాములునా?"
    "అవు. వీనికి శానమందిత యిసొంటి యాపారంల లాబాలున్నయి."
    "అట్ల? మల్ల, లక్కి! నువ్వీడకు ఎట్లొచ్చి నవ్?"
    "మీ సవుకారె తెచ్చిండు. లగ్గం సేసుకుంట నన్నడు. ఆయనంటే నాకు శాన యిష్టం. అందుకోసానికే వచ్చిన. పెండ్లి సేసుకొనకున్న, యింట ఉండనిస్త డనుకున్న. నాలుగు దినాలయినంక నన్ను యాడికో తోలిండు. ఎవలో నన్ను గొంచబోయిన్రు. యాడికో నా కేమి ఎరికె లేకుండే.
    "పది దినాలయినంక, దవ్వున ఏ దేశంల నో, వాండ్ల బట్ట లేపిచ్చి అంగట్ల పెట్టిన్రు. ఒకామె కొనుక్కున్నది. ఆమె యింట్ల నా అసాంటి పిల్ల లింక శానమందున్నరు. ఆడికెల్లి పారొస్త నునుకుంటి. ఎట్లనో, ఏందో ఏమి ఎరికె లేకుండె. సచ్చిన లెక్క పడున్న.
    "పదేండ్లయినంక, వయసు మొగోండ్లకు నా తాన యిష్టం పోయినంక, ఆడ నా బతుకు శాన కష్టమయ్యుండే. ఎవ్వరిత సెప్పకుంట ఆడి కెల్లి సారొచ్చిన. మల్ల రాములు తానె వచ్చిన. రాములు మల్ల నన్ను యీడికెల్లి పోనియ్యలే. నేను బయలెల్తె వాని గుట్టంత మందికెరికయితదంట బయం. అందుకోసానికే యింట్ల పనులు గిట్ట సేసెతందుకు సమ యీడనే ఉండమన్నడు."
    "రాము లింత కటికోడువా? ముత్తాలు కింత అన్నాలం జరిగినాది? ఏమంటున్నవు, లక్కి?"
    "హవు, దొరా! అంత నిజమే సెప్తున్న. రాములు మీద యిన్నేండ్లు నా కిష్ట ముండపట్టి ఎవ్వరికి చెప్పలే. ఇప్పుడు నీకె చెప్తున్న. నా అసాంటి పిల్లలను ఊర్లల్ల పెండ్లి సేసుకోని తెచ్చి, యీ యింట్లనెట్టి ఎనక సిరి బేరగాండ్లకు అమ్మిండు. ఈ యాపారంల వానికి శాన లాబముంది.
    "ముత్తాలు ముకం సూస్తే కడుపుల బాదొస్తున్నది, సిన్న దొర! ఇసాంటి పిల్ల నా లెక్క కావద్ధంట కోరుకుంటున్న.
    "సిన్నదొరా! ముత్తాలుకు యిదంత సెప్పిన!" అన్నది లక్కి.
    "చెప్పినావు?"
    "అవు. ఆ తల్లికి అన్నాలం జరిగె తందుకీల్లేదు. ఆ రాములుకు యిసమన్న పెడ్త కాని, యీమెకు కష్టం పానీను. అందుకోసానికే ఆమెకు ఎట్లన్న మంచిదంట ఎరికె చేసిన. నిన్నటి సంది ఒక్క తీరుగ ఏడుస్తనే ఉన్నది బిడ్డ!"
    "అట్ల? లక్కి, ఒక్కసారి ఆమెను నాకు సూసియ్యవా?" అంట మొత్తుకున్నడు.
    "సూపిస్త, సిన్న దొరా! నువ్వెట్లనన్న ఆమెను యీడికెల్లి గొంచబో. లేకుంటే నాకయినట్లే అయితది!"
    చంద్రంకు ఏంటి సేసెతందుకు ఆలోచన రాలే. మనుసుల పుట్టెడు బాధ!    
    "రా, దొరా!" అన్నది లక్కి.
    చంద్రం లక్కిత యింట్లకు బోయిండు.
    ముత్తాలు మూల మంచంమీన కూసోని ఏడుస్త ఉంది.
    "సూడు, చెల్లి! మీ బావను తీస్కచ్చిన్న! ఆయన ఎట్లనన్న గొంచబోతడు. మల్ల రాములొచ్చెతలికి యిద్దరు యీడికెల్లి పోనియి. యాడన్న పెండ్లి సేసుకోన్రి" అన్నది లక్కి.
    లక్కి మాటలకు యిద్దరు కండ్లిప్పుకొని సూసిన్రు.
    "అట్ల సూస్తరేంది మల్ల? జల్ది ఉరుకున్రి" అంట తొందర సేసినది.
    బావ కాపించటంత ముత్తాలుకు ఏన్గ బలం వచ్చింది. ఎట్లనన్న యీడి కెల్లి పోవాలంట గుండెల తొందర ఎక్కవయింది.
    సీకటి పడేతలికి గల్లిల దర్వాజాలు మూత పడినయి.
    రాములు యింటి కొచ్చి సూసుకునేతలికి ముత్తాలు యింట్ల లేదు! వానికి పిచ్చి పట్టినట్లయినది. యాడ బోయిందో సెప్పెతందుకు లంబడి లక్కి కూడ లేదు!
    చంద్రం, ముత్తాలు ఊర్ల ఒకింట దిగిన్రు. ఇల్లోండ్లు వాండ్లకు బువ్వ గిట్ట పెట్టి మంచిగ సూసిన్రు.
    పొద్దు వంగుతున్నది. ముత్తాలు బావ దిక్కుకు సూస్తున్నది.
    "బావ!"
    "ఏంది, ముత్తాలు?"
    "ఆ బటువు నీ ఏలికి మంచిగున్నది."
    "అట్ల? నీ యేలికి మంచిగుండదా మల్ల?"
    "ఉంటది గాని, నా ఏలికి బటువు బరువయి తది, బావ! అందుకోసానికే, అది నీ కిచ్చిన."
    "అగ్గో! పెండ్లి బటువు యాడ వెట్టి నవు?"
    "అది దేవుని కిచ్చిన."
    "అట్లెట్ల?"
    "అదంత అట్లనే, బావ!"
    "ఏం దిట్ల సిత్రంగ మాటాడుతున్నవ్, ముత్తాలు?"
    "ఈ దునియల అంత సిత్రంగనే ఉంటది, బావ!" అంట, కూసున్నదట్ల, ముత్తాలు బావ దిక్కుకు తిరిగి పండుకొన్నది,    
    "బావ!"
    "ఏంది, ముత్తాలు?"
    "నువ్వు నన్ను ఎందుకోసానికి తోలుకొచ్చి నవు?"
    "ఆడ నువ్వుంటం సూడలేను."
    "అట్ల?" అంట నగింది ముత్తాలు. ఆమె నవ్వు మామూలు లెక్క లేదు.
    "అచ్చ, సెంద్రయ్య బావ! నువ్వు నన్ను పెండ్లి సేసుకోరాదు?"
    "ముత్తాలు!" అన్నడు చంద్రం.
    "లే, బావ! ఉత్తనే అట్లన్న! ఒకసారి పెండ్లయినంక మల్ల సేసుకొనమంట నే నెట్లంట?" అంట కండ్లు మూసుకున్నది ముత్తాలు. ఏందో బాధత ఉన్నట్ల యీదిక్కుకు, ఆ దిక్కుకు కదుల్తున్నది.
    "ముత్తాలు! నీ కేమి పర్వలే, ఎవ్వలేమన్న అనుకోని, నా కేమన్న కాని, నీ బతుకును నేను సూసుకుంట. నిన్ను యాడకన్న గొంచబోయి పెండ్లి సేసుకుంట, ముత్తాలు! నిన్ను వాడు పట్టకపోకుండ సూసుకుంట! ఎనక నాకు దయిర్నెం లేకుండె. ఇప్పుడింక ఎనకాడెడిది లేదు, నా మాట నమ్ము, ముత్తాలు!" అంట ఆమె సెయ్యి అందుకున్నడు. సెయ్యి సల్లగుంది!
    ముకంల సూసిండు. కండ్లు మూతపడి ఉన్నయి!
    ముత్తాలు నిదరవోతున్నది.
    మల్ల ఎన్నడు లేవని నిదర!
    చంద్రం గుండె బాదుకున్నడు.
    ఇల్లోండ్లు, వీండ్లు వాండ్లు అంత ఆడికి పోగయిన్రు.
    చంద్రం సంచి తెరిసి, ముత్తాలు పందిరి సీర తీసి ముత్తాలు కాంత కప్పిండు!
    సుట్టు సీకట్లు ముసురుకున్నయి.
    చంద్రం ముత్తాలు మీద పడి ఏడుస్తుండు!

                                    

                                   9

    ఊసెలు పట్టుకొని చంద్రం అట్లనే నిలుసున్నడు.
    మంది వస్తున్నరు పోతున్నరు. ఎదురుంగ రాయి సెట్టుమీద పిట్టలు ఎగురుకుంట బోతున్నయి. లేత కనకాంబరం రంగుల ఎలుగొచ్చి చంద్రం ముకంమీద పడుతున్నది!
    చంద్రం నగిండు!
    జేలు వాడర్ ఆడికొచ్చిండు. బీడీ తీసుకోని ఎలిగిచ్చుకున్నడు.
    "రామయ్యా! ఈ జేల్ల యింకెన్ని దినాలుండాలె?" అంటడిగిండు చంద్రం.
    "ఒక్కపొద్దు. ఇంకొకపొద్దు, సెంద్రయ్యా" అంట ముకం దించుకున్నడు వాడరు రామయ్య.
    "ఆమాట కోసానికే యిన్ని దినాలు సూస్తన్న! ఇయ్యాల నువ్వు సెప్పినవు, రామయ్యా!"
    "ఏంది, బాబు?"
    "మనుసులకయ్యె అనబాలు వాండ్లు తెచ్చుకునేటి యి కాదు, రామయ్యా. తెలిసిన, తెలీకున్న గాని ఆండ్ల యిరుక్కుంటరు. ఈ దునియల సిత్రమంత యింతనే కద?" అంట వగిండు చంద్రం.
    రామయ్య కండ్లు తడిసినయి. 'ఇంకొక్క పొద్దు కద, పాపం!'
    ఆకాసెఁవుల పిట్టలు ఎగురుకుంట పోతున్నయి.
    చంద్రం రేపు కోసానికే సూస్తున్నడు!
    ఆ రేపు ఎట్లుంటదో వాడరు రామయ్యకు, చంద్రంకు యిద్దరికి ఎరికెనే!
    చంద్రం కండ్ల ముంగల ముత్తాలు పందిరి లెక్క ఆకాసెం!
    ముత్తాలు పాడుకుంట పిలుస్తున్నది.

 

                                      ---:సమాప్తం:---


 Previous Page

WRITERS
PUBLICATIONS